భగీరథ యత్నమే!  | Mission Bhagiratha Project Delaying | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 3:09 AM | Last Updated on Sun, Jul 29 2018 3:16 AM

Mission Bhagiratha Project Delaying - Sakshi

కామారెడ్డి జిల్లా అన్నాసాగర్‌ తండా వద్ద భగీరథ పైపులు పగిలిపోయి వృథాగా పోతున్న నీరు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఇంటింటికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్‌ భగీరథ. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా నీరు ఇస్తేనే ఓట్లడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15న అన్ని ప్రాంతాలకూ బల్క్‌వాటర్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేల కోట్లు వెచ్చిస్తున్నా.. పనుల నిర్వహణలో జాప్యం, లోపాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతర్గత పైపులైన్ల నిర్మాణం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి అందరికీ రక్షిత మంచినీరు అందించడం గగనమేనన్న చర్చ సాగుతోంది. 

నీటి కేటాయింపులు ఇలా.. 
కృష్ణా బేసిన్‌లో 15, గోదావరి బేసిన్‌లో 21 రిజర్వాయర్ల నుంచి భగీరథ కోసం పలు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్థాయిని కూడా ఖరారు చేశారు. 2018లో కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్ల నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్‌లో 21 రిజర్వాయర్ల నుంచి 32.58 టీఎంసీలు కేటాయించారు. 2048 నాటికి రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్‌ నుంచి 86.11 టీఎంసీల నీటి కేటాయింపులు ఖరారు చేశారు. 

ప్రాజెక్టు ప్రగతి ఇలా.. 
గజ్వేల్‌ సబ్‌సెగ్మెంట్‌ పనులను ప్రధాని నరేంద్రమోదీ 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. ప్రస్తుతం 7,229 గ్రామీణ ఆవాసాలు, 12 పట్టణ ప్రాంతాలకు బల్క్‌ వాటర్‌ అందిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లందించిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్‌ రికార్డు సష్టించింది. సూర్యాపేట సబ్‌సెగ్మెంట్‌లో 1,621 ఆవాసాలకు తాగునీటి సరఫరా మొదలైంది. ఆరు మండలాల పరిధిలోని 243 హ్యాబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీలోని 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొదటి విడతగా 1,595 ఆవాసాలకుగానూ 280లకు బల్క్‌వాటర్, 120లకు నల్లా నీరు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3,411 ఆవాసాలకుగానూ 1,900లకు బల్క్‌వాటర్‌ సరఫరా చేసి 875లకు నల్లా నీరు అందిస్తున్నారు. 

ట్రయల్‌ రన్‌లో అపశ్రుతులు 
పైపులైన్ల నిర్మాణం పూర్తయి ట్రయల్‌ రన్‌ చేస్తున్న చోట్లా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పైపులైన్ల నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతలను పాటించకపోవడంతో ‘ట్రయల్‌రన్‌’దశలోనే ఎక్కడికక్కడ అవి పగిలిపోతున్నాయి. లీకేజీలు, పగుళ్లతో పైపులైన్ల నీరంతా పంటపొలాలు, ఇండ్లలోకి చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, వర్నిబోధన్‌ ప్రాంతాల్లో ట్రయల్‌ రన్‌లో భాగంగా పైపులైన్‌ల జాయింట్‌ ఉడి నీరు లీక్‌ అవుతోంది. 

అంతర్గత పైపులైన్లే అసలు సమస్య.. 
ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో ఇంటింటికీ నల్లా కల్పించేందుకు రూ.338.62 కోట్లు మంజూరు చేశారు. 591 ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు 225 నిర్మించారు. అంతర్గత పైపులైన్ల పొడవు 2,215 కి.మీ.లకు 819 కి.మీ.లే నిర్మించారు. 2,72,795 ఇండ్లకు నల్లాలు బిగించాల్సి ఉండగా 63,215 ఇండ్లకే బిగించారు. నిజామాబాద్‌ జిల్లాలో రూ.1,350 కోట్లతో 801 గ్రామాలకు ఉద్దేశించిన ఈ పథకంలో 1,884 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,350 కి.మీ. పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 576 ఉపరితల ట్యాంకులకు 202 పూర్తి కాగా, 2,97,218 నల్లా కనెక్షన్లకు 49,753 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు రూ.1,300 కోట్లు కేటాయించారు. 1,537 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,530 కి.మీ. పూర్తయ్యింది. 615 ఉపరితల ట్యాంకులకు 299 పూర్తి కాగా, 2,42,827 కనెక్షన్లకు 58,833 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ.4,433 కోట్లతో 2016లో ఐదు దశల్లో పనులు చేపట్టారు. అధికారులు 70 శాతం పనులు పూర్తయినట్లు చెప్తున్నా.. 6,067 కి.మీ.కుగానూ 5,100 కి.మీ. పూర్తయినట్లు రికార్డులు చెప్తున్నాయి

నగరాలు, పట్టణాల్లో మరీ దారుణం.. 
రాష్ట్రవ్యాప్తంగా 63 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్‌ కార్పొరేషన్‌తోపాటు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల పరిధిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నగర, పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 2033 నాటి జనాభాకు తగ్గట్లు రిజర్వాయర్లు, పైపులైన్లు వేసే పనులను 2017 మేలో ప్రారంభించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 60 శాతం పనులు కూడా దాటలేదు. 

మిషన్‌ భగీరథ ముఖ్యాంశాలివీ.. 
సెగ్మెంట్లు                                                         26 
నియోజకవర్గాలు                                               99 
మండలాలు                                                    437 
కార్పొరేషన్లు/మున్సిపాల్టీలు/నగరపంచాయతీలు        63 
అవాస ప్రాంతాలు                                              24,224 
మొత్తం కవరయ్యే గృహాలు                                   65,29,770 
గ్రామీణ ప్రాంతాల గృహాలు                               52,47,225 
పట్టణ ప్రాంత గృహాలు                                   12,82,545 
పథకం కింద లబ్ధిదారులు                              2.72 కోట్లు 
పథకం అంచనా వ్యయం                         రూ.43,791 కోట్లు  

పైపులైన్లతో ప్రాణభయం
భగీరథ నీళ్లిచ్చుడేందో.. పైపులైన్లతో ప్రాణభయం పట్టుకుంది. నీళ్ల కోసం వేసిన పైపులైన్లు పగిలి ఇళ్లల్లోకి నీళ్లచ్చి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుస్తలేదు. రాత్రి పూట పైపులైన్‌ పగిలితే జల సమాధి అయితుంటిమి.
– హరిసింగ్, అన్నాసాగర్‌ తండా, కామారెడ్డి జిల్లా

నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదు
ఊర్ల నీళ్లు దిక్కు ల్లేవు. ఊరి బయట నీళ్లు ఇంటింటికీ వస్తాయన్న నమ్మకం లేదు. అడుగడుగునా పైపులైన్లు లీకవుతుండటంతో సింగూరు నుంచి శుద్ధజలాలు రావడం కష్టం.
– సురేశ్, అన్నాసాగర్‌ తండా, కామారెడ్డి జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement