krisha river
-
కాలువల ఆధునికీకరణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: కాలుష్యంతో నిండిన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునీకరించడమే ప్రధాన ఉద్దేశమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సాగుకు, తాగుకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కాలువలు, కాలువగట్లు ఇకపై ప్రజలకు ఉపయోగపడే వాకింగ్ ట్రాక్‌లుగా, పార్క్‌లుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వైబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెనాల్స్ పొల్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టా పరిధిలో 10 వేల కిలో మీటర్ల కాలువలు, కృష్ణా డెల్టా పరిధిలో 9,800 కాలువలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. ముందుగా 1344 కిలోమీటర్లు, 36 మేజర్ కెనాల్స్‌లో పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కెనాల్స్ బ్యూటిఫికేషన్ విషయంలో లైనింగ్ లేనిచోట గ్రీనింగ్ చేయాలని.. కాలువ కట్టలపై సిమెంట్, కాంక్రీట్ వినియోగించకుండా పాత్‌వేలు రాళ్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అన్ని మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా చర్యలుండాని సీఎం జగన్ ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎన్జీవోలను భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఒక్కో కాలువలో ఎంత మురికినీరు కలుస్తుంది, దాన్ని నివారించేందుకు ఎంత ఖర్చవుతుంది, ఎస్టీపీల నిర్మాణం, మెయింటెనెన్స్ వివరాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఔట్లెట్ పాయింట్ వద్ద అకౌంటబిలిటీ ఉండాలని అందుకవసరమైన చర్యలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారును ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించాలి విజయవాడ, విశాఖలో ముందుగా కాల్వల ఆధునికీకరణ పనులు చేయాలని సీఎం ఆదేశించారు. 18 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు నాలుగు జిల్లాల్లో కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. పులివెందులను కూడా కార్యక్రమంలో చేర్చాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ముందు కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించి వారే ముందు ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాళ్లు ఇళ్లు కట్టుకోగానే అక్కడి నుంచి తరలించాలని సీఎం తెలిపారు. తాడేపల్లి మున్సిపాలిటిలో ముందుగా పనులు ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఇళ్లు తరలించేటప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని, ఎక్కడా వారిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే తరలించాలన్నారు. ఒక్కసారి పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎవరూ ఆక్రమించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లాలో రైవస్ కెనాల్, గుంటూరు జిల్లాలో కృష్ణా వెస్ట్రన్ కెనాల్, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కెనాల్, తూర్పుగోదావరి జిల్లాలో జీఈ మెయిన్ కెనాల్, పులివెందుల, విశాఖపట్నం పైలెట్ ప్రాజెక్ట్‌లుగా చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తెలిపారు. నాడు నేడు కార్యక్రమం తరహాలో చేయాలన్నారు. దాతల పేర్లతో ఏర్పాటు ప్రజలకు తెలిసేలా ఫోటోలు తీసి ఇప్పుడున్న పరిస్ధితి, భవిష్యత్‌లో ఏలా తీర్చిదిద్దుతామో చూపాలని సీఎం జగన్ తెలిపారు. కాలువలపై ఏర్పాటు చేసే పార్క్‌లకు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి ముందుకొచ్చే దాతల పేర్లతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. మిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. సాలిడ్‌వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌తో రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ డైరెక్టర్ కాటమనేని భాస్కర్, ఆర్దిక, జలవనరులశాఖ, మున్సిపల్‌శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చెరువు ఎండిపాయే..
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు ఓవైపు వరద ఉధృతితో జలకళను సంతరించుకుంటే... గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చెరువులు మాత్రం చిన్నబోతున్నాయి. ఏటా ఈ సమ యానికల్లా నీటితో కళకళలాడాల్సిన చెరువులన్నీ తీవ్ర వర్షాభావంతో వట్టిపోతున్నాయి. రాష్ట్రంలో 44 వేలకుపైగా ఉన్న చెరువుల్లో ఏకంగా 26 వేల పైచిలుకు చెరువుల్లో నీటి జాడ కానరావడం లేదు. కృష్ణాబేసిన్‌లోని పూర్వ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే 21వేలకు పైగా చెరువులు నీటి కరువుతో అల్లాడుతున్నాయి. కృష్ణా బేసిన్లో గుండె చెరువు.. ఎగువ నుంచి భారీ వరదల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిండాయి. అయితే పరీవాహకంలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొత్తంగా 23,608 చెరువులు ఉండగా ఇందులో 21,133 చెరువుల్లో 25% కన్నా తక్కువ నీరే చేరింది. 25 నుంచి 50% మాత్రమే నీరు చేరిన చెరు వులు 1,656 వరకున్నాయి. 524 చెరువుల్లో 50 నుంచి 75% నీరుండగా, కేవలం 295 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో 85% చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో 3,791 చెరువులకు గానూ 3,611 చెరువులు ఖాళీగానే ఉన్నా యి. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలో మొత్తంగా 11 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతోంది. కృష్ణా బేసిన్‌తో పోలిస్తే గోదావరిలో కొద్దిగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బేసిన్లో 20వేలకుపైగా ఉన్న చెరువుల్లో 9వేలకు పైగా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరిం ది. ఎగువన ప్రాజెక్టుల గేట్లు మూసివేయడంతో దిగువకు వరద ప్రవాహం తగ్గుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరి ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. -
వరద తగ్గె.. గేట్లు మూసె
సాక్షి, హైదరాబాద్ : కొన్నిరోజులుగా లక్షల క్యూసెక్కులతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వర్షాలు తగ్గడంతో బేసిన్లో ఎగువన ఆల్మట్టికి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గింది. దీంతో దిగువన నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా వరద తగ్గుతుండటంతో ప్రాజెక్టుల్లో గేట్లను ఒకొక్కటిగా మూసివేస్తూ నీటి నిల్వల పెంపుదలపై అధికారులు దృష్టిసారించారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నిల్వ 129 టీఎంసీలుకాగా 120 టీఎంసీల్లో నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌లోనూ గేట్లు మూసివేసి నీటిమట్టాన్ని పెంచుతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 3.16 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు అవుట్ ఫ్లోను కూడా తగ్గించి 2.45 లక్షల క్యూసెక్కులను దిగువన సాగర్‌కు వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 301 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 4.21 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆ నీటినంతా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. -
భగీరథ యత్నమే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటింటికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా నీరు ఇస్తేనే ఓట్లడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15న అన్ని ప్రాంతాలకూ బల్క్‌వాటర్ ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు నిధుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేల కోట్లు వెచ్చిస్తున్నా.. పనుల నిర్వహణలో జాప్యం, లోపాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతర్గత పైపులైన్ల నిర్మాణం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి అందరికీ రక్షిత మంచినీరు అందించడం గగనమేనన్న చర్చ సాగుతోంది. నీటి కేటాయింపులు ఇలా.. కృష్ణా బేసిన్లో 15, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి భగీరథ కోసం పలు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్థాయిని కూడా ఖరారు చేశారు. 2018లో కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్ల నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 21 రిజర్వాయర్ల నుంచి 32.58 టీఎంసీలు కేటాయించారు. 2048 నాటికి రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి 86.11 టీఎంసీల నీటి కేటాయింపులు ఖరారు చేశారు. ప్రాజెక్టు ప్రగతి ఇలా.. గజ్వేల్ సబ్‌సెగ్మెంట్ పనులను ప్రధాని నరేంద్రమోదీ 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. ప్రస్తుతం 7,229 గ్రామీణ ఆవాసాలు, 12 పట్టణ ప్రాంతాలకు బల్క్ వాటర్ అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ రికార్డు సష్టించింది. సూర్యాపేట సబ్‌సెగ్మెంట్‌లో 1,621 ఆవాసాలకు తాగునీటి సరఫరా మొదలైంది. ఆరు మండలాల పరిధిలోని 243 హ్యాబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసాలు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా 1,595 ఆవాసాలకుగానూ 280లకు బల్క్‌వాటర్, 120లకు నల్లా నీరు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,411 ఆవాసాలకుగానూ 1,900లకు బల్క్‌వాటర్ సరఫరా చేసి 875లకు నల్లా నీరు అందిస్తున్నారు. ట్రయల్ రన్లో అపశ్రుతులు పైపులైన్ల నిర్మాణం పూర్తయి ట్రయల్ రన్ చేస్తున్న చోట్లా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పైపులైన్ల నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతలను పాటించకపోవడంతో ‘ట్రయల్‌రన్’దశలోనే ఎక్కడికక్కడ అవి పగిలిపోతున్నాయి. లీకేజీలు, పగుళ్లతో పైపులైన్ల నీరంతా పంటపొలాలు, ఇండ్లలోకి చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, వర్నిబోధన్ ప్రాంతాల్లో ట్రయల్ రన్లో భాగంగా పైపులైన్ల జాయింట్ ఉడి నీరు లీక్ అవుతోంది. అంతర్గత పైపులైన్లే అసలు సమస్య.. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో ఇంటింటికీ నల్లా కల్పించేందుకు రూ.338.62 కోట్లు మంజూరు చేశారు. 591 ఓవర్‌హెడ్ ట్యాంకులకు 225 నిర్మించారు. అంతర్గత పైపులైన్ల పొడవు 2,215 కి.మీ.లకు 819 కి.మీ.లే నిర్మించారు. 2,72,795 ఇండ్లకు నల్లాలు బిగించాల్సి ఉండగా 63,215 ఇండ్లకే బిగించారు. నిజామాబాద్ జిల్లాలో రూ.1,350 కోట్లతో 801 గ్రామాలకు ఉద్దేశించిన ఈ పథకంలో 1,884 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,350 కి.మీ. పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 576 ఉపరితల ట్యాంకులకు 202 పూర్తి కాగా, 2,97,218 నల్లా కనెక్షన్లకు 49,753 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కామారెడ్డి జిల్లాకు రూ.1,300 కోట్లు కేటాయించారు. 1,537 కి.మీ. అంతర్గత పైపులైన్‌కుగానూ 1,530 కి.మీ. పూర్తయ్యింది. 615 ఉపరితల ట్యాంకులకు 299 పూర్తి కాగా, 2,42,827 కనెక్షన్లకు 58,833 మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.4,433 కోట్లతో 2016లో ఐదు దశల్లో పనులు చేపట్టారు. అధికారులు 70 శాతం పనులు పూర్తయినట్లు చెప్తున్నా.. 6,067 కి.మీ.కుగానూ 5,100 కి.మీ. పూర్తయినట్లు రికార్డులు చెప్తున్నాయి నగరాలు, పట్టణాల్లో మరీ దారుణం.. రాష్ట్రవ్యాప్తంగా 63 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్ కార్పొరేషన్‌తోపాటు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల పరిధిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నగర, పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 2033 నాటి జనాభాకు తగ్గట్లు రిజర్వాయర్లు, పైపులైన్లు వేసే పనులను 2017 మేలో ప్రారంభించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 60 శాతం పనులు కూడా దాటలేదు. మిషన్ భగీరథ ముఖ్యాంశాలివీ.. సెగ్మెంట్లు 26 నియోజకవర్గాలు 99 మండలాలు 437 కార్పొరేషన్లు/మున్సిపాల్టీలు/నగరపంచాయతీలు 63 అవాస ప్రాంతాలు 24,224 మొత్తం కవరయ్యే గృహాలు 65,29,770 గ్రామీణ ప్రాంతాల గృహాలు 52,47,225 పట్టణ ప్రాంత గృహాలు 12,82,545 పథకం కింద లబ్ధిదారులు 2.72 కోట్లు పథకం అంచనా వ్యయం రూ.43,791 కోట్లు పైపులైన్లతో ప్రాణభయం భగీరథ నీళ్లిచ్చుడేందో.. పైపులైన్లతో ప్రాణభయం పట్టుకుంది. నీళ్ల కోసం వేసిన పైపులైన్లు పగిలి ఇళ్లల్లోకి నీళ్లచ్చి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుస్తలేదు. రాత్రి పూట పైపులైన్ పగిలితే జల సమాధి అయితుంటిమి. – హరిసింగ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదు ఊర్ల నీళ్లు దిక్కు ల్లేవు. ఊరి బయట నీళ్లు ఇంటింటికీ వస్తాయన్న నమ్మకం లేదు. అడుగడుగునా పైపులైన్లు లీకవుతుండటంతో సింగూరు నుంచి శుద్ధజలాలు రావడం కష్టం. – సురేశ్, అన్నాసాగర్ తండా, కామారెడ్డి జిల్లా -
చిన్నారి అశ్విక మృతదేహం లభ్యం
-
నేను...ఇంకా ఎవరి కోసం బతకాలి
సాక్షి, విజయవాడ : కృష్ణానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఏడేళ్ల చిన్నారి అశ్విక మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 22కు చేరింది. అశ్విక...సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ బంధువుల కుమార్తె. కాగా సీపీఐ నారాయణ మేనల్లుడు ప్రభు కుటుంబసభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అశ్విక మృతదేహం లభ్యం ఒక్కగానొక్క కుమార్తె. ఇంట్లో చలాకీగా తిరుగుతూ అందరి కళ్లల్లో వెలుగులు నింపింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆ కుటుంబ సభ్యులపై విధికి కన్నుకుట్టింది. తల్లి, ఇంటికి దీపం అయిన ఇల్లాలు, కంటికి వెలుగైన కూతురు. ఆ ముగ్గురూ ఆయనను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఇక తాను ఎవరి కోసం బతకాలంటూ మౌనంగా రోదిస్తున్నాడు. పవిత్ర సంగమంలో ఆదివారం చోటుచేసుకున్న దుర్ఘటనలో మృతి చెందిన తల్లి, భార్య మృతదేహాలు లభ్యం కాగా కుమార్తె అశ్విక మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. నగరంలోని లబ్బీపేటకు చెందిన పోపూరి ప్రభుకిరణ్ ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య హరిత (28), కుమార్తె అశ్విక (7) రెండో తరగతి చదువుతోంది. ప్రభుకిరణ్ సొంత ఊరు నెల్లూరు జిల్లా ఓజిల మండలం కురుకొండ. తల్లిదండ్రులు పోపూరి లక్ష్మీబాపారావు, లలిత అక్కడే ఉంటున్నారు. లలిత ఇటీవల విజయవాడ కుమారుడు వద్దకు వచ్చారు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కుటుంబం మొత్తం భవానీ ఐలాండ్‌కు వెళ్లారు. సాయంత్రం పవిత్ర సంగమంలో హారతులు చూస్తామంటే తల్లి, భార్య, కుమార్తెను బోటు ఎక్కించిన ప్రభుకిరణ్ ఇంటికి వెళ్లిపోయాడు. గంట వ్యవధిలోనే కుటుంబ సభ్యులు ఎక్కిన బోటు బోల్తా పడిందన్న వార్త వినాల్సి వచ్చింది. తన ముద్దులపట్టి అశ్విక విగతజీవిగా మారడంతో ప్రభు భోరున విలపించాడు. మరోవైపు గల్లంతు అయినవారి మృతదేహాలు లభ్యం కావడంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు ముగిశాయి. -
లెక్క.. పక్కా !
ప్రాజెక్టుల నుంచి నీటివిడుదలకు సంబంధించి అధికారుల నిర్ణయాలకు ఇక చెల్లు! ఇకనుంచి వాడుకునే ప్రతీ నీటిబొట్టుకు లెక్క చెప్పాల్సిందే..! ఆయకట్టుకు నీళ్లుకావాలంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వాహణ, నీటి విడుదల, మరమ్మతులు.. తదితర అంశాలన్నీ కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకోసం విజయవాడ లేదా కర్నూలు జిల్లాలో ప్రత్యేకబోర్డు ఏర్పాటుకానుంది. గద్వాల, న్యూస్‌లైన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావం నేపథ్యంలో జిల్లాలో జలవనరుల వినియోగం, ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేకబోర్డు ఏర్పడనుంది. ఈ రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా కృష్ణానది ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా కర్నూలు జిల్లాల్లో కృష్ణాబోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉందని సంబంధితశాఖ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. కృష్ణానదిపై ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ బోర్డులో ఉన్న సభ్యులు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. బోర్డు సీడబ్ల్యూసీ ఆధీనంలో పనిచేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న తుంగభద్ర బోర్డు కూడా రద్దుకానుంది. ఇది కూడా కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ నీటిమళ్లింపు(ఆర్డీఎస్)పథకం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే ఇకనుంచి ప్రాజెక్టుల నీటి విడుదలతోపాటు, వేసవిలో చేయాల్సిన మరమ్మతు పనులకు సంబంధించి బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జూరాల ప్రాజెక్టు నిర్వాహణను చూస్తున్న రేవులపల్లి డ్యాం డివిజన్ ఇక కృష్ణాబోర్డు ఆదేశాలతోనే పనిచేయాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మాణమై 2012లో జాతికి అంకితమైన భారీ ఎత్తిపోతల పథకాలు కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందులో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఎంజీఎల్‌ఐ, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే భీమా ఎత్తిపోతల పథకాలతోపాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్వాహణ కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అధికారుల నిర్ణయాలకు చెల్లు! కృష్ణానది కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు జూన్, జూలై నెలల్లో వరద వచ్చిన రోజునే ప్రాజెక్టు కాల్వల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదల జరిగేది. బోర్డు ఏర్పాటుతో జూరాల అధికారులు కృష్ణాబోర్డుకు సమాచారం అందించి అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాతే ఆయకట్టుకు నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఆర్డీఎస్, కోయిల్‌సాగర్, మిగతా ఎత్తిపోతల పథకాల్లో కూడా నీటి విడుదల కూడా బోర్డు అనుమతి పరిధిలోనే ఉంటుంది. జూరాల, కృష్ణానది రిజర్వాయర్ల నుంచి పంపింగ్ చేసి రిజర్వాయర్లను వరదనీటితో నింపాల్సిన విషయంలోనూ బోర్డుసభ్యులు తీసుకునే అనుమతే తుది నిర్ణయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు నెలల్లో బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాటై ప్రాజెక్టుల నిర్వహణ పరిశీలన ప్రారంభిస్తుందని తెలిసింది.