సాక్షి, విజయవాడ : కృష్ణానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఏడేళ్ల చిన్నారి అశ్విక మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 22కు చేరింది. అశ్విక...సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ బంధువుల కుమార్తె. కాగా సీపీఐ నారాయణ మేనల్లుడు ప్రభు కుటుంబసభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
అశ్విక మృతదేహం లభ్యం
ఒక్కగానొక్క కుమార్తె. ఇంట్లో చలాకీగా తిరుగుతూ అందరి కళ్లల్లో వెలుగులు నింపింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆ కుటుంబ సభ్యులపై విధికి కన్నుకుట్టింది. తల్లి, ఇంటికి దీపం అయిన ఇల్లాలు, కంటికి వెలుగైన కూతురు. ఆ ముగ్గురూ ఆయనను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఇక తాను ఎవరి కోసం బతకాలంటూ మౌనంగా రోదిస్తున్నాడు. పవిత్ర సంగమంలో ఆదివారం చోటుచేసుకున్న దుర్ఘటనలో మృతి చెందిన తల్లి, భార్య మృతదేహాలు లభ్యం కాగా కుమార్తె అశ్విక మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది.
నగరంలోని లబ్బీపేటకు చెందిన పోపూరి ప్రభుకిరణ్ ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య హరిత (28), కుమార్తె అశ్విక (7) రెండో తరగతి చదువుతోంది. ప్రభుకిరణ్ సొంత ఊరు నెల్లూరు జిల్లా ఓజిల మండలం కురుకొండ. తల్లిదండ్రులు పోపూరి లక్ష్మీబాపారావు, లలిత అక్కడే ఉంటున్నారు. లలిత ఇటీవల విజయవాడ కుమారుడు వద్దకు వచ్చారు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కుటుంబం మొత్తం భవానీ ఐలాండ్‌కు వెళ్లారు. సాయంత్రం పవిత్ర సంగమంలో హారతులు చూస్తామంటే తల్లి, భార్య, కుమార్తెను బోటు ఎక్కించిన ప్రభుకిరణ్ ఇంటికి వెళ్లిపోయాడు. గంట వ్యవధిలోనే కుటుంబ సభ్యులు ఎక్కిన బోటు బోల్తా పడిందన్న వార్త వినాల్సి వచ్చింది. తన ముద్దులపట్టి అశ్విక విగతజీవిగా మారడంతో ప్రభు భోరున విలపించాడు. మరోవైపు గల్లంతు అయినవారి మృతదేహాలు లభ్యం కావడంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment