మిషన్‌ భగీరథ పథకంలో కొత్త ప్రయోగం    | Mission Bhagiratha Works | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ పథకంలో కొత్త ప్రయోగం   

Published Wed, Aug 29 2018 12:49 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Mission Bhagiratha Works  - Sakshi

వాల్వును అమర్చే ప్రదేశాన్ని గుర్తిస్తున్న  ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఓ హేమలత

అచ్చంపేట రూరల్‌ మహబూబ్‌నగర్‌ : ఒకప్పుడు బోరింగుల వద్ద, కుళాయిలవద్ద వంతులకోసం, నీళ్లకోసం కొట్టుకోవడం, తిట్టుకోవడం చూశాం. నల్లా కనెక్షన్‌ ఉన్న కాలనీల్లోనూ వివాదాలు తలెత్తడం గమనించాం. ఎగువ ప్రాంతంలో ఉన్న వారికి నీళ్లు రాకపోతే  మోటార్లు పెట్టడం, అదినచ్చక గొడవలు జరగడం, సిగపట్లతో పోలీస్‌స్టేషన్ల వరకు వివాదాలు వెళ్లడం.. కేసులు పెట్టుకోవడం ఇవన్నీ నీటికోసం జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడా పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేయడానికి ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది.  

ఫ్లో కంట్రోల్‌ వాల్వు.. 

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీరు అందించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్దకు నీటి పైపులను సమకూర్చిన అధికారులు ఆ పైపులకు ఫ్లో కంట్రోల్‌ వాల్వు పరికరాలను అమర్చుతున్నారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల వారికి సమానంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంలో సరికొత్త విధానాన్ని అమలు చేయడంతో గొడవలకు అవకాశం లేకుండా ఉంటుంది. 

నిమిషానికి 5 లీటర్లు 

మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి సమానంగా తాగునీరు అందించడానికి కంట్రోలింగ్‌ వా ల్వును బిగించాలని సంకల్పించారు. ఫ్లో కంట్రోల్‌ వాల్వు ద్వారా ప్రతి నిమిషానికి 5 లీటర్లు నీరు మాత్రమే సరఫరా అయ్యేలా ఇంజనీరింగ్‌ అధికారులు డిజైన్‌ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వాటిని అమర్చుతున్నారు. అందరికీ సమానంగా నీటిని సరఫరా చేయడం కోసం ఈ వాల్వు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బిగించారు.

దీనిద్వారా పరికరం ద్వారా ఎత్తు, పల్లపు ప్రాంతాలకు ఒకే విధంగా తాగునీరు సరఫరా అవుతుంది.  ప్రస్తుతం గ్రామాల్లో అధికారులు పైపులైను మార్గంలోనే ఫ్లో కంట్రోల్‌ వాల్వును బిగించే ప్రదేశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పైపులైన్‌లో బంతిలాంటి ఒక పరికరాన్ని అమర్చడం వల్ల అందులో రంధ్రాలు నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించి అందరికీ సమానంగా నీరు అందేలా వేగాన్ని కట్టడి చేస్తుంది. మరోవైపు నీరు వెనక్కి రాకుండా ఈ వాల్వు పరికరం ఉపయోగకరంగా ఉంటుంది.  

శరవేగంగా పనులు 

జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా 1,66,142  ఇళ్లకు తాగునీరు అందించాలని నిర్దేశించారు. జిల్లాలో 1,640 కిలోమీటర్ల పొడవునా పైపులైను నిర్మించారు. అవసరమైన 602 ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులతో గ్రామీణ నీటి సరఫరా విభాగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని కోసం ఇప్పటికే 60వేల గృహాల వరకు పైపులైను ద్వారా ఫ్లో కంట్రోల్‌ వాల్వు పరికరాలను బిగించారు.

అక్టోబర్‌ వరకు అన్ని గ్రామాలకు.. 

జిల్లాలోని అన్ని గ్రామాలకు అక్టోబర్‌ వరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తాం. అందరికి సమానంగా నీటి ని సరఫరా చేయడానికి ఫ్లో కంట్రోల్‌ వాల్వు పరికరాలను అమర్చుతున్నాం. ఆ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.   

- శ్రీధర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ, నాగర్‌కర్నూల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement