mission bhagiratha water
-
వణికిపోతున్న భద్రాద్రి వాసులు.. మిషన్ భగీరథ అధికారుల కీలక ప్రకటన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. చదవండి: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు -
తాగునీటి పథకానికి కేటీఆర్ శ్రీకారం
-
తాగునీటి పథకానికి కేటీఆర్ శ్రీకారం
సాక్షి, కరీంనగర్: తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) కరీంనగర్లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 24 గంటల తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మానేరు తీరంలో మొక్కలు నాటారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో నిత్యం తాగునీటిని అందించడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుందని తెలిపారు. 2048 ఏడాది నాటికి సరిపడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఒక్కో రంగంపై దృష్టి పెట్టారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
త్వరలోనే టెట్ పరీక్ష : జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా వైద్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. నాణ్యమైన విద్యనందించడమే సీఎం లక్ష్యమని తెలిపారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. మారుతున్న సమాజ అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని తెలిపారు. పిల్లలేవరు బడి బయట ఉండకూడదని.. అనాథ పిల్లల్ని కూడా స్థానికంగా ఉండే గురుకులాలు, ఇతర పాఠశాలలో చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తామని వెల్లడించారు. -
మిషన్ భగీరథ పథకంలో కొత్త ప్రయోగం
అచ్చంపేట రూరల్ మహబూబ్‌నగర్ : ఒకప్పుడు బోరింగుల వద్ద, కుళాయిలవద్ద వంతులకోసం, నీళ్లకోసం కొట్టుకోవడం, తిట్టుకోవడం చూశాం. నల్లా కనెక్షన్ ఉన్న కాలనీల్లోనూ వివాదాలు తలెత్తడం గమనించాం. ఎగువ ప్రాంతంలో ఉన్న వారికి నీళ్లు రాకపోతే మోటార్లు పెట్టడం, అదినచ్చక గొడవలు జరగడం, సిగపట్లతో పోలీస్స్టేషన్ల వరకు వివాదాలు వెళ్లడం.. కేసులు పెట్టుకోవడం ఇవన్నీ నీటికోసం జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడా పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేయడానికి ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఫ్లో కంట్రోల్ వాల్వు.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీరు అందించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్దకు నీటి పైపులను సమకూర్చిన అధికారులు ఆ పైపులకు ఫ్లో కంట్రోల్ వాల్వు పరికరాలను అమర్చుతున్నారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల వారికి సమానంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో సరికొత్త విధానాన్ని అమలు చేయడంతో గొడవలకు అవకాశం లేకుండా ఉంటుంది. నిమిషానికి 5 లీటర్లు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి సమానంగా తాగునీరు అందించడానికి కంట్రోలింగ్ వా ల్వును బిగించాలని సంకల్పించారు. ఫ్లో కంట్రోల్ వాల్వు ద్వారా ప్రతి నిమిషానికి 5 లీటర్లు నీరు మాత్రమే సరఫరా అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వాటిని అమర్చుతున్నారు. అందరికీ సమానంగా నీటిని సరఫరా చేయడం కోసం ఈ వాల్వు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బిగించారు. దీనిద్వారా పరికరం ద్వారా ఎత్తు, పల్లపు ప్రాంతాలకు ఒకే విధంగా తాగునీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో అధికారులు పైపులైను మార్గంలోనే ఫ్లో కంట్రోల్ వాల్వును బిగించే ప్రదేశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పైపులైన్లో బంతిలాంటి ఒక పరికరాన్ని అమర్చడం వల్ల అందులో రంధ్రాలు నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించి అందరికీ సమానంగా నీరు అందేలా వేగాన్ని కట్టడి చేస్తుంది. మరోవైపు నీరు వెనక్కి రాకుండా ఈ వాల్వు పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. శరవేగంగా పనులు జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా 1,66,142 ఇళ్లకు తాగునీరు అందించాలని నిర్దేశించారు. జిల్లాలో 1,640 కిలోమీటర్ల పొడవునా పైపులైను నిర్మించారు. అవసరమైన 602 ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులతో గ్రామీణ నీటి సరఫరా విభాగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని కోసం ఇప్పటికే 60వేల గృహాల వరకు పైపులైను ద్వారా ఫ్లో కంట్రోల్ వాల్వు పరికరాలను బిగించారు. అక్టోబర్ వరకు అన్ని గ్రామాలకు.. జిల్లాలోని అన్ని గ్రామాలకు అక్టోబర్ వరకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తాం. అందరికి సమానంగా నీటి ని సరఫరా చేయడానికి ఫ్లో కంట్రోల్ వాల్వు పరికరాలను అమర్చుతున్నాం. ఆ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. - శ్రీధర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, నాగర్‌కర్నూల్ -
నగరవాసులకు భగీరథ జలాలు
హైదరాబాద్: నగరవాసులకు మిషన్ భగీరథ జలాలు అందుబాటులోకి వచ్చాయి. 12 రిజర్వాయర్లు సిద్ధంగా ఉండగా మొదటి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్బి ఫేజ్-4, హుడా మియాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అనుకున్న దాని కంటే ముందే పనులు పూర్తి చేసిన అధికారులకు, కాంట్రాక్టర్లకు, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలనలో హైదరాబాద్‌లో కూడా పవర్‌కట్, తాగునీటి సమస్య ఉండేది. ఇప్పుడు రెప్పపాటు కోతలు లేకుండా కరెంటు ఇవ్వగలుగుతున్నాం. సమగ్రమైన ప్రణాళికతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన శాంతి భధ్రతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రహదారులు, మూసీ అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. హైదరాబాద్ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ తమవంతు పరిశుభ్రతను పాటించాలని, 56 రిజర్వాయర్లకు 46 రిజర్వాయర్లను రాబోయే రెండేళ్ళలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.