నగరవాసులకు భగీరథ జలాలు
Published Thu, Apr 20 2017 1:22 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్: నగరవాసులకు మిషన్ భగీరథ జలాలు అందుబాటులోకి వచ్చాయి. 12 రిజర్వాయర్లు సిద్ధంగా ఉండగా మొదటి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్‌బి ఫేజ్-4, హుడా మియాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అనుకున్న దాని కంటే ముందే పనులు పూర్తి చేసిన అధికారులకు, కాంట్రాక‍్టర‍్లకు, సహకరించిన ప్రజలకు కృతజ‍్ఞతలు తెలిపారు. సమైక్య పాలనలో హైదరాబాద్‌లో కూడా పవర్‌కట్, తాగునీటి సమస్య ఉండేది. ఇప్పుడు రెప‍్పపాటు కోతలు లేకుండా కరెంటు ఇవ‍్వగలుగుతున్నాం.
సమగ్రమైన ప్రణాళికతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన శాంతి భధ్రతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రహదారులు, మూసీ అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. హైదరాబాద్ అన్ని రంగాల్లో సర‍్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక‍్కరూ తమవంతు పరిశుభ్రతను పాటించాలని, 56 రిజర్వాయర‍్లకు 46 రిజర్వాయర్లను రాబోయే రెండేళ‍్ళలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement