తెలంగాణలో చానళ్లపై నిషేధం న్యాయమే కానీ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిషేధం విషయంలో ఎంఎస్‌ఓల ప్రతి స్పందన న్యాయంగానే ఉన్నా.. దాని ప్రయోజనం పాలకుడి నియంతృత్వానికి దారి తీయొద్దని, ఉపయోగపడొద్దని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మీడియాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన నియంతృత్వ వ్యాఖ్యలు, నిషేధ ఫత్వాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
మీడియా స్వేచ్ఛ అంటే పాలకులు, మీడియా యాజమాన్యల స్వేచ్ఛ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న వైఖరి, మీడియా స్వేచ్ఛపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బుధవారం సుదీర్ఘ లేఖను మీడియా సంస్థలకు విడుదల చేశారు. మీడియాపై నిషేధం తగదని పేర్కొంటూనే.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ-9 యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. కేవలం పచ్చళ్ల వ్యాపారం చేసే రామోజీరావు పత్రికా స్వేచ్ఛ ముసుగులో 10 వేల ఎకరాల ఫిల్మ్ సిటీ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జగమెరిగిన సత్యమన్నారు.