నేడు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’
ప్రసవం అంటే బిడ్డకు జన్మ.... తల్లికి పునర్జన్మ.... ప్రసవం తరువాత శిశువును చూసి తల్లి ఆనందంతో తన బాధనంతా మరిచిపోతుంది.. అలాంటి సమయంలో శిశువు అనారోగ్యానికి గురైతే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం.. బరువుతక్కువ, నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ‘ కంగారు థెరపీ యూనిట్‌లు సంజీవని’లా పనిచేస్తున్నాయి... అలాగే ప్రసవం ముందు గర్భిణులకు వచ్చే సమస్యలను ‘హైరిస్క్ కేంద్రాల’ ద్వారా పరిష్కరిస్తున్నారు...ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ఈ కేంద్రాల పై ప్రత్యేకకథనం...
సిద్దిపేట :శిశు మరణాలు తగ్గించడంలో సిద్దిపేటలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం సత్ఫలితాలను అందిస్తోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వైద్యశాస్త్రంలో సంస్కరణలను జోడిస్తు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ ప్రయత్నం పసికందులకు పునర్జన్మను అందిస్తున్నాయి. 2015లో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కంగారు యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ వైద్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 12 బెడ్‌లను కలిగిన కంగారు యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. మరోవైపు గర్భిణులకు ప్రసవం కంటే ముందు ఉత్పన్నమయ్యే విపత్కర పరిస్థితుల నుంచి వారిని గట్టెక్కించేందుకు సిద్దిపేట, గజ్వేల్ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్యశాస్త్రంలో వచ్చిన కొత్త పోకడలతో ఏర్పాటైన నూతన యూనిట్లతో కొట్లాది రూపాయాల విలువ గలిన వైద్య సేవలను పేద ప్రజలు పొందుతున్నారు. ఇప్పటి వరకు కంగారు మెథడ్ యూనిట్‌లో వెయ్యి మంది చిన్నారులకు, ఎస్‌ఎన్‌సీయూలో 4వేల మంది పసికందులకు సుమారు 20 కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం..
కంగారు మెథడ్...
వైద్యరంగంలో ఇప్పుడిప్పుడే చర్చనీయాంశమవుతున్న పదం కంగారు. ఆస్ట్రేలియాకు చెందిన కంగారు జంతువులు నెలల నిండకుండానే ప్రసవిస్తాయి. వాటి పిల్లలను కాపాడుకునే క్రమంలో శరీరంలోని పొట్టభాగంలో భద్రపరుస్తాయి. అవసరమైన వేడిని అందించి వాటి పరిణితికి ప్రకృతి సిద్ధంగా దోహదపడుతాయి. కంగారు జంతువుల తాపత్రయాన్ని వైద్యశాస్త్రానికి అనువయింపచేసి తక్కువ బరువు, నెలలతో జన్మించే శిశువులను ప్రత్యేక విధానంతో కాపాడే పద్ధతే కంగారు మెథడ్ యూనిట్ (కేఎంసీ) 2015 జూలైలో సిద్దిపేటలోని ఎంసీహెచ్‌లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం కేఎంసీని ప్రారంభించింది. ప్రసుత్తం 12 బెడ్‌లతో కొనసాగుతున్న సిద్దిపేట కేఎంసీ దేశంలోనే అతిపెద్ద యూనిట్ కావడం విశేషం. ఇప్పటి వరకు వెయ్యి మందికి కేఎంసీలో అరుదైన వైద్యాన్ని అందించి రూ. 20కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా వెయ్యి మంది పసికందులకు పునర్జన్మ ప్రసాదించిన కేంద్రం కేఎంసీ యూనిట్.
నవజాత శిశు సంరక్షణ కేంద్రం....
మరోవైపు కంగారు మెథడ్ యూనిట్‌కు అనుసంధానంగా కీలక భూమిక పోషించే మరో అరుదైన వైద్య సహాయం నవజాత శిశుసంరక్షణ కేంద్రం. (ఎస్‌ఎన్‌సీయూ) ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులను నవజాత శిశుసంరక్షణ కేంద్రం ద్వారా పునర్జన్మ అందించడే యూనిట్ ప్రత్యేకత. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో 18 పడకలతో ఎస్‌ఎంసీయూ యూనిట్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 2015 జూలైలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇవి ప్రధానంగా తీవ్ర అనారోగ్యానికి గురైన శిశువులు, పచ్చకామెర్లతో వచ్చిన చిన్నారులు, ఉమ్మనీటిని మింగి ఆపత్కాల పరిస్థితిని ఎదుర్కొనే పసికందులను రక్షించే ఎకైక పరిష్కారమార్గం ఎస్‌ఎన్‌సీయూ. ఒక్కమాటలో చేప్పాలంటే ఈ యూనిట్ శివు సంజీవని లాంటిది. ఈ యూనిట్ ద్వారా ఇప్పటి వరకు 4వేల మందికి వైద్యసేవలు అందించారు. దీనికి తోడు పచ్చ కామెర్లతో పుట్టిన శిశువుకు వైద్యం అందించే ఫోటోథెరపీ విభాగంలో ఇప్పటి వరకు 6493 మందికి సిద్దిపేట యూనిట్‌లో వైద్యాన్ని అందించారు.
గర్భిణులకు వరం...
హైరిస్కు కేంద్రాలు గర్భిణులకు వరంలాంటివి. ప్రసవం కంటే ముందు వచ్చే ఆనారోగ్య, వైద్యపర సమస్యలను గుర్తించి 24 గంటల పాటు పరిశీలనలో పెట్టి గర్భిణులకు గడ్డు కాలాన్ని దూరం చేయడంలో హైరిస్కులు ఎంతో దోహద పడుతున్నాయి. సుమారు 50 పడకలతో గర్భిణులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న హైరిస్కు సేవలతో గ్రామీణ పేద మహిళలకు కార్పొరేట్ ఆసుపత్రి మెట్లెక్కే అవసరం లేకుండా ఈ కేంద్రాలు సముచిత సేవలను అందిస్తున్నాయి.
‘కంగారూ’పనితీరు ఇలా
ఆస్ట్రేలియా దేశంలో ఉండే కంగారు అనే జంతువు తన బిడ్డను తన పొత్తి కడుపులోని కింది భాగంలో ఒక సంచిలాంటి అరలో జాగ్రత్తగా పొదిగి పట్టుకుంటుంది. ఆ దేశం చాలా శీతల ప్రదేశం కావడంతో తన బిడ్డను అలా తన కడుపు ముందు భాగంలోని అరలో పెట్టుకొని వెచ్చదనాన్ని అందిస్తుంది. దీనినే వైద్యశాస్త్రానికి అన్వయిస్తూ బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను తల్లి ఛాతీపై ఉంచుకొని పసికందుపై నుంచి వస్త్రంతో తల్లీని, పసికందును కలిపి కట్టి ఉంచడం, తల్లి ఛాతీపైన ఒకే వస్త్రంతో పాపను కలిపి కట్టి ఉంచడం వల్ల తల్లి నుంచి పాపకు ఉష్ణప్రసారం (వేడిమి) జరిగి తల్లీ బిడ్డ ఒకే విధమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటారు. పాపతల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా వెచ్చగా ఉంటుందో ప్రసవం అనంతరం బయటికి వచ్చిన తర్వాత కూడా తల్లి కడుపులో ఉండే వెచ్చదనాన్ని కలిగించే పద్ధతినే కంగారు పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో పసికందు తల్లి లేదా తండ్రి, బంధువులతో కూడా పుట్టిన పసికందుకు మెథడ్‌ను వినియోగించవచ్చు.
ఈ విధానం ఎందుకంటే...
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నెలలు నిండి బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో శరీరంలోని ఉష్ణోగ్రత త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల పిల్లలు నీరసంగా ఉండడం, బరువు పెరుగుదల సరిగా ఉండక పోవడం, అంటు వ్యాధులు వచ్చే అవకాశం, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటివి సంభవిస్తాయి.
ఇలా ప్రమాదం నివారించవచ్చు...
కంగారు మాతృసంరక్షణ పద్ధతి ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. కేఎంసీ యూనిట్‌లో 1.3 కిలోల కన్న బరువుతో శిశువు జన్మిస్తే వెంటనే కంగారు పద్ధతిలో 15 నుంచి 30 రోజుల వరకు ఇదే విధానాన్ని అమలు చేయాలి. దీని ద్వారా పిల్లలకు తగినంత ఉష్ణోగ్రత, తల్లి్లపాలు తాగడానికి అధిక అవకాశం, పిల్లల బరువు పెరుగుదల, తల్లికి, బిడ్డకు మధ్య బాంధవ్యం పెరుగుతాయి, నెలలు నిండని పిల్లల్లో అకస్మాత్తుగా ఊపిరి అగిపోయే అవకాశంఉంటుంది. కంగారు పద్ధతి ద్వారా తల్లి తీసుకునే శ్వాస బిడ్డకూడా తీసుకునేలా చేస్తుంది.
ఎంత సమయం చేయాలి...
కేఎంసీ విధానం కేవలం ఆస్పత్రుల్లోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా చేయవచ్చు. 1.3 కిలోల బరువుతో జన్మించే పసికందులను, నెలలు తక్కువతో పుట్టే పిల్లలను పది నుంచి, 15రోజుల వరకు కేఎంసీ పద్ధతిలో తల్లి కానీ, బంధువుతోకానీ బిడ్డను ఒకే చోట ఉండేలా చూడాలి. దీనికి సమయమంటూ ఏమీ లేదు. రెండు కిలోల బరువు వచ్చే వరకు ఖర్చులేని సులభమైన ఉపయోగకరమైన పద్ధతిలో దీనిని వినియోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment