Delivery time
-
పుట్టింటికి రా తల్లీ
ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సులు తమ కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లాలని అనుమతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్లో వారి ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు తప్పేలా లేవు. ముప్పై ఏళ్ల రేష్మ అనిష్ ముంబై ఎం.జి.ఎం హాస్పిటల్లో నర్సు. ఇప్పుడామెకు ఎనిమిదో నెల. కాన్పు కోసం తన పుట్టిల్లయిన కేరళలోని పతానంతిట్టతుకు మార్చి 27న ఆమె ప్రయాణం పెట్టుకుంది. ఉద్యోగంలో అనుమతుల చికాకు లేకుండా ఏకంగా ఆ ఉద్యోగానికి రాజీనామాయే చేసింది. అంతా సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఇప్పుడు తన పుట్టింట్లో అమ్మ ఆలనాపాలనలో ఉండాల్సింది. కాని లాక్డౌన్ వల్ల అంతా గందరగోళంగా మారింది. ‘నా పుట్టింటికి వెళ్లడానికి ఈ–పాస్ కోసం మహరాష్ట్ర డి.జి.పికి అప్లై చేశాను. కాని ఇప్పటి వరకు సమాధానం లేదు’ అని రేష్మ అంది. ముంబై నుంచి కేరళ చేరుకోవడానికి ఇప్పుడు ఆమె సొంత ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. ఎంత ఖర్చయినా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్లాలనుకుంటోంది. అయితే దీనికి కూడా చిక్కులొచ్చేలా ఉన్నాయి. మహారాష్ట్ర అంబులెన్సుకు ఎంత ఈ–పాస్ ఉన్నా ఇతర రాష్ట్రాలు లోనికి రానివ్వాలని లేదు. ముఖ్యంగా కర్నాటక ఇలాంటి అంబులెన్సులను కూడా ఆపేస్తోంది. ‘ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. పైగా అంబులెన్స్ డ్రైవర్ 14 రోజుల క్వారెంటైన్లో వెళ్లాల్సి రావచ్చు’ అని రేష్మ అంది. రేష్మ భర్త ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్లి అక్కడ లాక్డౌన్లో చిక్కుకుని ఉన్నాడు. ‘తలా ఒక చోట ఉన్నాం. ఎప్పుడు కలుస్తామో’ అని అతను అన్నాడు. బాంబే హాస్పిటల్లో పని చేస్తున్న అతిరదేవి కూడా కాన్పుకు కేరళలోని తన పుట్టిల్లు కొట్టాయంకు వెళ్లాల్సి ఉంది. అంబులెన్సు మాట్లాడితే 50 వేలు డిమాండ్ చేశారు. దానికీ సిద్ధపడినా పోలీసుల అనుమతి ఇంకా రాలేదు. మరో కేరళ నర్సు సమస్య గమనించదగ్గది. ఆమెకు మొదటి గర్భం నిలువలేదు. ఇప్పుడు వచ్చిన రెండో గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పుట్టింటికి వెళ్లడం ముఖ్యమని అనుకుంటోంది. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కాన్పు సమయం స్త్రీలకు కుటుంబం నుంచి ముఖ్యంగా పుట్టింటి నుంచి చాలా ఆలంబన అవసరమైన సమయం. ముంబైలో నర్సులుగా పని చేస్తూ ప్రస్తుతం గర్భవతులైన పదుల సంఖ్యలోని కేరళ స్త్రీలు తాము ఈ సమయంలో ఎక్కడ పుట్టింటికి చేరుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు. -
ఒకసారి సిజేరియన్ అయితే ప్రతిసారీ అదే తప్పదా?
మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే చేయాలనే అపోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అలాంటి నియమమేదీ లేదు. కాకపోతే రెండోసారి అయ్యే డెలివరీ నార్మల్‌గానే అవుతుందా లేక తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుందా అనే అంశం చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎన్నో నెలలో చేశారు వంటి అనేక అంశాలపై రెండోసారి నార్మల్ డెలివరీయా లేక సిజేరియనా అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... ►కొందరిలో మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే సిజేరియన్ చేసి ఉండవచ్చు. ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉండదు. బిడ్డ తల కిందికే ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూడవచ్చు. ►మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే దారిలో మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం తప్పనిసరిగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిందే. ►సాధారణంగా తల్లుల ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారికి బిడ్డ బయటకు వచ్చే దారి అయిన పెల్విక్ బోనీ క్యావిటీ సన్నగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటివారిలో చాలా సార్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సివచ్చే అవకాశాలు ఎక్కువ. ►మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... పెద్ద ప్రాణానికీ ప్రమాదం. ►మొదటిసారి సిజేరియన్ చేసే సమయంలో గర్భసంచికి నిలువుగా గాటు పెట్టి ఉంటే (క్లాసికల్ సిజేరియన్) ఇక రెండోసారి సిజేరియనే చేయక తప్పదు. (ప్రస్తుతానికి క్లాసికల్ సిజేరియన్స్ చాలా అరుదుగా చేస్తున్నారు). ఒకవేళ అప్పట్లో అడ్డంగా గాటు పెట్టి ఉంటే ఈ సారి నార్మల్ డెలివరీ కోసం అవకాశం ఇచ్చి చూడవచ్చు. పై అంశాల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారీ తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. తల్లీ, బిడ్డా ఆరోగ్యం బాగా ఉండి, పైన పేర్కొన్న అంశాల ఆధారంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే దాని కోసం ప్రయత్నించవచ్చు. అయితే... మొదటిసారి సిజేరియన్ అయిన మహిళ... రెండోసారి ప్రసవాన్ని తప్పనిసరిగా ఆసుపత్రిలో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీ) జరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో డాక్టర్లు నిర్ధారణ చేసి, తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. డాక్టర్ స్వప్న పుసుకూరి కన్సల్టెంట్ ఆబ్‌స్టట్రీషియన్ – గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, హైదర్‌నగర్, హైదరాబాద్ -
పురిటి కోసం అష్టకష్టాలు
ఇల్లెందు: పురుడు పోసుకోవడానికి ఓ మహిళ అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 ఏరియాకు చెందిన పూనెం శిరీష పురిటి నొప్పులతో గురువారం తెల్లారుజామున ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే కడుపులోని పాప కాళ్లు బయటకొచ్చాయి. వైద్యులు డెలివరీ కోసం ప్రయత్నించకుండా ఖమ్మం రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో శిరీషను ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. కానీ సకాలంలో వైద్యం అందక పాప మృతి చెందింది. దీంతో తిరిగి ఇల్లెందు వైద్యశాలకు తీసుకురాగానే మరో పాపకు జన్మనిచ్చింది. రెండో అమ్మాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏడు నెలలకే డెలివరీ కావడంతో ఇన్క్యుబేటర్ బాక్స్‌లో పెట్టాలని వైద్యులు సూచించారు. -
కంగారు మెథడ్...
ప్రసవం అంటే బిడ్డకు జన్మ.... తల్లికి పునర్జన్మ.... ప్రసవం తరువాత శిశువును చూసి తల్లి ఆనందంతో తన బాధనంతా మరిచిపోతుంది.. అలాంటి సమయంలో శిశువు అనారోగ్యానికి గురైతే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం.. బరువుతక్కువ, నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ‘ కంగారు థెరపీ యూనిట్లు సంజీవని’లా పనిచేస్తున్నాయి... అలాగే ప్రసవం ముందు గర్భిణులకు వచ్చే సమస్యలను ‘హైరిస్క్ కేంద్రాల’ ద్వారా పరిష్కరిస్తున్నారు...ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ఈ కేంద్రాల పై ప్రత్యేకకథనం... సిద్దిపేట :శిశు మరణాలు తగ్గించడంలో సిద్దిపేటలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం సత్ఫలితాలను అందిస్తోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వైద్యశాస్త్రంలో సంస్కరణలను జోడిస్తు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ ప్రయత్నం పసికందులకు పునర్జన్మను అందిస్తున్నాయి. 2015లో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కంగారు యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ వైద్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 12 బెడ్లను కలిగిన కంగారు యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. మరోవైపు గర్భిణులకు ప్రసవం కంటే ముందు ఉత్పన్నమయ్యే విపత్కర పరిస్థితుల నుంచి వారిని గట్టెక్కించేందుకు సిద్దిపేట, గజ్వేల్ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్యశాస్త్రంలో వచ్చిన కొత్త పోకడలతో ఏర్పాటైన నూతన యూనిట్లతో కొట్లాది రూపాయాల విలువ గలిన వైద్య సేవలను పేద ప్రజలు పొందుతున్నారు. ఇప్పటి వరకు కంగారు మెథడ్ యూనిట్లో వెయ్యి మంది చిన్నారులకు, ఎస్‌ఎన్‌సీయూలో 4వేల మంది పసికందులకు సుమారు 20 కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.. కంగారు మెథడ్... వైద్యరంగంలో ఇప్పుడిప్పుడే చర్చనీయాంశమవుతున్న పదం కంగారు. ఆస్ట్రేలియాకు చెందిన కంగారు జంతువులు నెలల నిండకుండానే ప్రసవిస్తాయి. వాటి పిల్లలను కాపాడుకునే క్రమంలో శరీరంలోని పొట్టభాగంలో భద్రపరుస్తాయి. అవసరమైన వేడిని అందించి వాటి పరిణితికి ప్రకృతి సిద్ధంగా దోహదపడుతాయి. కంగారు జంతువుల తాపత్రయాన్ని వైద్యశాస్త్రానికి అనువయింపచేసి తక్కువ బరువు, నెలలతో జన్మించే శిశువులను ప్రత్యేక విధానంతో కాపాడే పద్ధతే కంగారు మెథడ్ యూనిట్ (కేఎంసీ) 2015 జూలైలో సిద్దిపేటలోని ఎంసీహెచ్‌లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం కేఎంసీని ప్రారంభించింది. ప్రసుత్తం 12 బెడ్లతో కొనసాగుతున్న సిద్దిపేట కేఎంసీ దేశంలోనే అతిపెద్ద యూనిట్ కావడం విశేషం. ఇప్పటి వరకు వెయ్యి మందికి కేఎంసీలో అరుదైన వైద్యాన్ని అందించి రూ. 20కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా వెయ్యి మంది పసికందులకు పునర్జన్మ ప్రసాదించిన కేంద్రం కేఎంసీ యూనిట్. నవజాత శిశు సంరక్షణ కేంద్రం.... మరోవైపు కంగారు మెథడ్ యూనిట్‌కు అనుసంధానంగా కీలక భూమిక పోషించే మరో అరుదైన వైద్య సహాయం నవజాత శిశుసంరక్షణ కేంద్రం. (ఎస్ఎన్సీయూ) ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులను నవజాత శిశుసంరక్షణ కేంద్రం ద్వారా పునర్జన్మ అందించడే యూనిట్ ప్రత్యేకత. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో 18 పడకలతో ఎస్‌ఎంసీయూ యూనిట్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 2015 జూలైలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇవి ప్రధానంగా తీవ్ర అనారోగ్యానికి గురైన శిశువులు, పచ్చకామెర్లతో వచ్చిన చిన్నారులు, ఉమ్మనీటిని మింగి ఆపత్కాల పరిస్థితిని ఎదుర్కొనే పసికందులను రక్షించే ఎకైక పరిష్కారమార్గం ఎస్ఎన్సీయూ. ఒక్కమాటలో చేప్పాలంటే ఈ యూనిట్ శివు సంజీవని లాంటిది. ఈ యూనిట్ ద్వారా ఇప్పటి వరకు 4వేల మందికి వైద్యసేవలు అందించారు. దీనికి తోడు పచ్చ కామెర్లతో పుట్టిన శిశువుకు వైద్యం అందించే ఫోటోథెరపీ విభాగంలో ఇప్పటి వరకు 6493 మందికి సిద్దిపేట యూనిట్లో వైద్యాన్ని అందించారు. గర్భిణులకు వరం... హైరిస్కు కేంద్రాలు గర్భిణులకు వరంలాంటివి. ప్రసవం కంటే ముందు వచ్చే ఆనారోగ్య, వైద్యపర సమస్యలను గుర్తించి 24 గంటల పాటు పరిశీలనలో పెట్టి గర్భిణులకు గడ్డు కాలాన్ని దూరం చేయడంలో హైరిస్కులు ఎంతో దోహద పడుతున్నాయి. సుమారు 50 పడకలతో గర్భిణులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న హైరిస్కు సేవలతో గ్రామీణ పేద మహిళలకు కార్పొరేట్ ఆసుపత్రి మెట్లెక్కే అవసరం లేకుండా ఈ కేంద్రాలు సముచిత సేవలను అందిస్తున్నాయి. ‘కంగారూ’పనితీరు ఇలా ఆస్ట్రేలియా దేశంలో ఉండే కంగారు అనే జంతువు తన బిడ్డను తన పొత్తి కడుపులోని కింది భాగంలో ఒక సంచిలాంటి అరలో జాగ్రత్తగా పొదిగి పట్టుకుంటుంది. ఆ దేశం చాలా శీతల ప్రదేశం కావడంతో తన బిడ్డను అలా తన కడుపు ముందు భాగంలోని అరలో పెట్టుకొని వెచ్చదనాన్ని అందిస్తుంది. దీనినే వైద్యశాస్త్రానికి అన్వయిస్తూ బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను తల్లి ఛాతీపై ఉంచుకొని పసికందుపై నుంచి వస్త్రంతో తల్లీని, పసికందును కలిపి కట్టి ఉంచడం, తల్లి ఛాతీపైన ఒకే వస్త్రంతో పాపను కలిపి కట్టి ఉంచడం వల్ల తల్లి నుంచి పాపకు ఉష్ణప్రసారం (వేడిమి) జరిగి తల్లీ బిడ్డ ఒకే విధమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటారు. పాపతల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా వెచ్చగా ఉంటుందో ప్రసవం అనంతరం బయటికి వచ్చిన తర్వాత కూడా తల్లి కడుపులో ఉండే వెచ్చదనాన్ని కలిగించే పద్ధతినే కంగారు పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో పసికందు తల్లి లేదా తండ్రి, బంధువులతో కూడా పుట్టిన పసికందుకు మెథడ్‌ను వినియోగించవచ్చు. ఈ విధానం ఎందుకంటే... నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నెలలు నిండి బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో శరీరంలోని ఉష్ణోగ్రత త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల పిల్లలు నీరసంగా ఉండడం, బరువు పెరుగుదల సరిగా ఉండక పోవడం, అంటు వ్యాధులు వచ్చే అవకాశం, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటివి సంభవిస్తాయి. ఇలా ప్రమాదం నివారించవచ్చు... కంగారు మాతృసంరక్షణ పద్ధతి ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. కేఎంసీ యూనిట్లో 1.3 కిలోల కన్న బరువుతో శిశువు జన్మిస్తే వెంటనే కంగారు పద్ధతిలో 15 నుంచి 30 రోజుల వరకు ఇదే విధానాన్ని అమలు చేయాలి. దీని ద్వారా పిల్లలకు తగినంత ఉష్ణోగ్రత, తల్లి్లపాలు తాగడానికి అధిక అవకాశం, పిల్లల బరువు పెరుగుదల, తల్లికి, బిడ్డకు మధ్య బాంధవ్యం పెరుగుతాయి, నెలలు నిండని పిల్లల్లో అకస్మాత్తుగా ఊపిరి అగిపోయే అవకాశంఉంటుంది. కంగారు పద్ధతి ద్వారా తల్లి తీసుకునే శ్వాస బిడ్డకూడా తీసుకునేలా చేస్తుంది. ఎంత సమయం చేయాలి... కేఎంసీ విధానం కేవలం ఆస్పత్రుల్లోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా చేయవచ్చు. 1.3 కిలోల బరువుతో జన్మించే పసికందులను, నెలలు తక్కువతో పుట్టే పిల్లలను పది నుంచి, 15రోజుల వరకు కేఎంసీ పద్ధతిలో తల్లి కానీ, బంధువుతోకానీ బిడ్డను ఒకే చోట ఉండేలా చూడాలి. దీనికి సమయమంటూ ఏమీ లేదు. రెండు కిలోల బరువు వచ్చే వరకు ఖర్చులేని సులభమైన ఉపయోగకరమైన పద్ధతిలో దీనిని వినియోగించవచ్చు. -
కాన్పు సమయంలో శిశువు మృతి
కావలిరూరల్: కాన్పు సమయంలో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చోటుచేసుకుంది. శిశువు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సన్నగిరి శివప్రసాద్ భార్య కావ్య కాన్పుకోసం బిట్రగుంటలోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. రాత్రి 9.51 గంటలకు ఆమెకు సహజ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించాడు. అయితే కాసేపటికి శిశువు మరణించాడు. దీంతో కావ్యతోబాటు ఆమె కుటుంబసభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు. కాన్పు సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేరు. కాల్ ఆన్ డ్యూటీలో ఉన్న చిన్న పిల్లల వైద్యనిపుణులు అర్ధగంట తర్వాత ఆస్పత్రికి రాగా, డ్యూటీ డాక్టర్ మరో పావు గంట తర్వాత చేరుకున్నారు. శిశువు మృతిచెందాడని వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుబ్బారావు, చైర్మన్ గుత్తికొండ కిషోర్‌బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. డాక్టర్లు సకాలంలో స్పందించలేదు ఇక్కడ కాన్పులు బాగా జరుగుతున్నాయంటే తీసుకువచ్చాం. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేరు. సిబ్బందే కాన్పు చేశారు. వారు ఫోన్ చేయగా చిన్నపిల్లల డాక్టర్ అర్ధగంటకు వచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.– దరిశి సుధీర్, కావ్య సోదరుడు పూర్తి స్థాయిలో విచారిస్తాం కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మా సిబ్బంది తీసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే విషయంపై విచారిస్తున్నాం. కాన్పు సమయంలో గర్భంలో మలం కలసిపోయి శిశువు ముక్కులు, నోట్లోకి వెళ్లి చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తాం. – డాక్టర్ కె.సుబ్బారావు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం శిశువు మృతి చెందాడనే విషయం తెలియగానే కమిటీ సభ్యులతో కలసి ఇక్కడికి చేరుకున్నాం. డాక్టర్లు అందుబాటులో లేరనే ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. ఈ ఘటనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – గుత్తికొండ కిషోర్‌బాబు, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చెర్మన్ -
ప్రసవ సమయంలో ఉచితంగా రక్తం పంపిణీ
సాక్షి, ముంబై: ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి తల్లికి, బిడ్డకు రక్తం అవసరమైతే ఉచితంగా సరఫరా చేస్తామని మహానగర పాలక సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ వెల్లడించారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో ఎక్కువ ధర చెల్లించి రక్తం కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. సాధారణంగా కొందరు మహిళలకు ప్రసవం సమయంలో తీవ్ర ర క్తస్రావం జరుగుతుంది. సిజరింగ్ అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. దీంతో తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్తం కోసం ఆస్పత్రులు, బ్లడ్‌బ్యాంకుల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో బంధువుల పరిస్థితి వర్ణణాతీతం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహానగర పాలక, ఉపనగర, ప్రసూతి గృహాలలో రక్తం అందుబాటులో ఉంటుందని కేస్కర్ చెప్పారు. ఒకవేళ శిశువు తక్కువ బరువుతో జన్మించినా, ఇతర కారణాల వల్ల రక్తం అవసరమైనా శిశువుకు 30 రోజుల వరకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మహానగర పాలక ఆస్పత్రుల్లో గర్భిణీలకు ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, సోనోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైన బ్లడ్ గ్రూప్ లేకపోతే.. నగరంలో ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకుని అందజేస్తారు. ఈ పథకాన్ని అన్ని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.