ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సు రేష్మ
ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సులు తమ కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లాలని అనుమతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌లో వారి ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు తప్పేలా లేవు.
ముప్పై ఏళ్ల రేష్మ అనిష్ ముంబై ఎం.జి.ఎం హాస్పిటల్‌లో నర్సు. ఇప్పుడామెకు ఎనిమిదో నెల. కాన్పు కోసం తన పుట్టిల్లయిన కేరళలోని పతానంతిట్టతుకు మార్చి 27న ఆమె ప్రయాణం పెట్టుకుంది. ఉద్యోగంలో అనుమతుల చికాకు లేకుండా ఏకంగా ఆ ఉద్యోగానికి రాజీనామాయే చేసింది.
అంతా సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఇప్పుడు తన పుట్టింట్లో అమ్మ ఆలనాపాలనలో ఉండాల్సింది. కాని లాక్‌డౌన్ వల్ల అంతా గందరగోళంగా మారింది. ‘నా పుట్టింటికి వెళ్లడానికి ఈ–పాస్ కోసం మహరాష్ట్ర డి.జి.పికి అప్లై చేశాను. కాని ఇప్పటి వరకు సమాధానం లేదు’ అని రేష్మ అంది. ముంబై నుంచి కేరళ చేరుకోవడానికి ఇప్పుడు ఆమె సొంత ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. ఎంత ఖర్చయినా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్లాలనుకుంటోంది. అయితే దీనికి కూడా చిక్కులొచ్చేలా ఉన్నాయి.
మహారాష్ట్ర అంబులెన్సుకు ఎంత ఈ–పాస్ ఉన్నా ఇతర రాష్ట్రాలు లోనికి రానివ్వాలని లేదు. ముఖ్యంగా కర్నాటక ఇలాంటి అంబులెన్సులను కూడా ఆపేస్తోంది. ‘ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. పైగా అంబులెన్స్ డ్రైవర్ 14 రోజుల క్వారెంటైన్‌లో వెళ్లాల్సి రావచ్చు’ అని రేష్మ అంది. రేష్మ భర్త ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్లి అక్కడ లాక్‌డౌన్‌లో చిక్కుకుని ఉన్నాడు. ‘తలా ఒక చోట ఉన్నాం. ఎప్పుడు కలుస్తామో’ అని అతను అన్నాడు. బాంబే హాస్పిటల్‌లో పని చేస్తున్న అతిరదేవి కూడా కాన్పుకు కేరళలోని తన పుట్టిల్లు కొట్టాయంకు వెళ్లాల్సి ఉంది.
అంబులెన్సు మాట్లాడితే 50 వేలు డిమాండ్ చేశారు. దానికీ సిద్ధపడినా పోలీసుల అనుమతి ఇంకా రాలేదు. మరో కేరళ నర్సు సమస్య గమనించదగ్గది. ఆమెకు మొదటి గర్భం నిలువలేదు. ఇప్పుడు వచ్చిన రెండో గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పుట్టింటికి వెళ్లడం ముఖ్యమని అనుకుంటోంది. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కాన్పు సమయం స్త్రీలకు కుటుంబం నుంచి ముఖ్యంగా పుట్టింటి నుంచి చాలా ఆలంబన అవసరమైన సమయం. ముంబైలో నర్సులుగా పని చేస్తూ ప్రస్తుతం గర్భవతులైన పదుల సంఖ్యలోని కేరళ స్త్రీలు తాము ఈ సమయంలో ఎక్కడ పుట్టింటికి చేరుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment