Kerala nurses
-
పుట్టింటికి రా తల్లీ
ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సులు తమ కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లాలని అనుమతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్లో వారి ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు తప్పేలా లేవు. ముప్పై ఏళ్ల రేష్మ అనిష్ ముంబై ఎం.జి.ఎం హాస్పిటల్లో నర్సు. ఇప్పుడామెకు ఎనిమిదో నెల. కాన్పు కోసం తన పుట్టిల్లయిన కేరళలోని పతానంతిట్టతుకు మార్చి 27న ఆమె ప్రయాణం పెట్టుకుంది. ఉద్యోగంలో అనుమతుల చికాకు లేకుండా ఏకంగా ఆ ఉద్యోగానికి రాజీనామాయే చేసింది. అంతా సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఇప్పుడు తన పుట్టింట్లో అమ్మ ఆలనాపాలనలో ఉండాల్సింది. కాని లాక్డౌన్ వల్ల అంతా గందరగోళంగా మారింది. ‘నా పుట్టింటికి వెళ్లడానికి ఈ–పాస్ కోసం మహరాష్ట్ర డి.జి.పికి అప్లై చేశాను. కాని ఇప్పటి వరకు సమాధానం లేదు’ అని రేష్మ అంది. ముంబై నుంచి కేరళ చేరుకోవడానికి ఇప్పుడు ఆమె సొంత ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. ఎంత ఖర్చయినా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్లాలనుకుంటోంది. అయితే దీనికి కూడా చిక్కులొచ్చేలా ఉన్నాయి. మహారాష్ట్ర అంబులెన్సుకు ఎంత ఈ–పాస్ ఉన్నా ఇతర రాష్ట్రాలు లోనికి రానివ్వాలని లేదు. ముఖ్యంగా కర్నాటక ఇలాంటి అంబులెన్సులను కూడా ఆపేస్తోంది. ‘ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. పైగా అంబులెన్స్ డ్రైవర్ 14 రోజుల క్వారెంటైన్లో వెళ్లాల్సి రావచ్చు’ అని రేష్మ అంది. రేష్మ భర్త ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్లి అక్కడ లాక్డౌన్లో చిక్కుకుని ఉన్నాడు. ‘తలా ఒక చోట ఉన్నాం. ఎప్పుడు కలుస్తామో’ అని అతను అన్నాడు. బాంబే హాస్పిటల్లో పని చేస్తున్న అతిరదేవి కూడా కాన్పుకు కేరళలోని తన పుట్టిల్లు కొట్టాయంకు వెళ్లాల్సి ఉంది. అంబులెన్సు మాట్లాడితే 50 వేలు డిమాండ్ చేశారు. దానికీ సిద్ధపడినా పోలీసుల అనుమతి ఇంకా రాలేదు. మరో కేరళ నర్సు సమస్య గమనించదగ్గది. ఆమెకు మొదటి గర్భం నిలువలేదు. ఇప్పుడు వచ్చిన రెండో గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పుట్టింటికి వెళ్లడం ముఖ్యమని అనుకుంటోంది. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కాన్పు సమయం స్త్రీలకు కుటుంబం నుంచి ముఖ్యంగా పుట్టింటి నుంచి చాలా ఆలంబన అవసరమైన సమయం. ముంబైలో నర్సులుగా పని చేస్తూ ప్రస్తుతం గర్భవతులైన పదుల సంఖ్యలోని కేరళ స్త్రీలు తాము ఈ సమయంలో ఎక్కడ పుట్టింటికి చేరుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు. -
కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఓ నర్సుకు ప్రాణాంతక కరోనా వైరస్ సోకింది. సౌదీ అరేబియాలోని అల్ హయత్ హాస్పిటల్లో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ కూడా ధ్రువీకరించారు. దీనిపై ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ కూడా చేశారు. సౌదీలో పనిచేస్తున్న 100 మంది భారత నర్సులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో చాలా మంది కేరళకు చెందినవారే. అయితే కేరళ చెందిన ఓ నర్సుకు మాత్రం ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైరస్ సోకిన నర్సుకు అసీర్ నేషనల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నార’ని తెలిపారు. అలాగే మిగతా నర్సులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులతో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కాన్సులేట్ అధికారులు సౌదీ విదేశాంగ శాఖతోపాటు హాస్పిటల్ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కు లేఖ రాశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా సౌదీ ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. మిగిలిన నర్సులకు కరోనా వైరస్ సోకకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయన్ కేంద్రాన్ని కోరారు. కాగా, చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. అలాగే, ఇప్పటివరకు 634 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. మరోవైపు కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించారు. మంగళవారం వరకు 43 విమానాల ద్వారా వచ్చిన 9,156 మంది ప్రయాణీకులను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని తెలిపింది. -
మా ఆస్పత్రుల్లో ఉద్యోగాలిస్తా.. రండి!!
ఇరాక్ అల్లర్ల పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉగ్రవాదుల చెరలో చిక్కి, ఎట్టకేలకు మాతృభూమికి తిరిగివెళ్లిన 46 మంది నర్సులకు తన ఆస్పత్రులలో ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ఒకరు పిలిచారు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఆస్పత్రులున్న బీఆర్ శెట్లి వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కేరళలోని వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. తిక్రిత్‌లో ఉన్న ఈ నర్సులను సున్నీ తీవ్రవాదులు మోసుల్కు తీసుకొచ్చి.. చివరకు శుక్రవారం నాడు కుర్దిష్ రాజధాని ఎర్బిల్‌లో విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో వాళ్లంతా భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈ సహా పలు దేశాల్లో శెట్టికి చెందిన ఎన్ఎంసీ గ్రూపునకు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. -
భారత్ చేరుకున్న కేరళ నర్సులు, తెలుగువారు
ఇరాక్‌లో సున్నీ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపి.. ఎట్టకేలకు వారి చెరవీడిన కేరళ నర్సులు ముంబై చేరుకున్నారు. ఉదయం 8.43 గంటలకు వీరు బయల్దేరిన ప్రత్యేక విమానం ముంబైలో దిగింది. ఇందులో 46 మంది నర్సులతో పాటు మరో 137 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఉదయం 11.55 గంటలకు ఇది కొచ్చి చేరుకుంటుంది. అక్కడినుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ వెళ్తుంది. చిట్టచివరకు సాయంత్రం 5.40 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా వెళ్లి వారిని మాతృభూమికి ఆహ్వానిస్తారు. నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక ఇమ్మిగ్రేషన్ డెస్కును ఏర్పాటు చేశారు. భారతీయ దౌత్యాధికారుల చొరవతో విడుదలైన నర్సులంతా కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన విమానంలో భారత్ చేరుకున్నారు. ఇరాక్‌లో చిక్కుకున్న మరికొందరు భారతీయులు కూడా ఇదే విమానంలో ఉన్నారు. మొత్తం 183 మంది ప్రయాణికులుండగా వారిలో 23 మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వాధికారులు ఉన్నారు. 46 మంది కేరళ నర్సులు కాక మిగిలినవారిలో వంద మంది తెలుగువారని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. -
'ఆ నర్సులను క్షేమంగా భారత్ కు తీసుకువస్తాం'
తిరువంతపురం:ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులు త్వరలో క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు కేరళ సీఎం ఓమెన్ చాందీ స్పష్టం చేశారు. మిలిటెంట్లు చెరలో చిక్కుకున్నఆ నర్సులకు ఎర్బిల్ ఎయిర్ పోర్ట్ లో క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చాందీ తెలిపారు. మోసూల్ పట్టణంలో కేరళకు చెందిన నర్సులను గురువారం తిరుగుబాటుదారులు అపహరించి బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి అపహరించిన ఆ నర్సులను మిలిటెంట్లు బందించి మోసుల్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉన్న కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ కు తరలించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన 'ఉన్నతస్థాయి వివాదాల కమిటీ' వారిని తిరిగి సురక్షితంగా భారత్ కు రప్పించే పనిలో నిమగ్నమైందని చాందీ తెలిపారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
ఇరాక్ మిలిటెంట్ల చెరలో కేరళ నర్సులు
తిక్రిత్ నుంచి 46 మందిని బలవంతంగా తరలింపు ముగ్గురు నర్సులకు గాయాలు; అంతా క్షేమం: కేరళ సీఎం క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ/తిరువనంతపురం/బాగ్దాద్: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 46 మంది భారతీయ నర్సులను(అంతా కేరళకు చెందినవారే) గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లినదీ కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న మోసుల్ పట్టణం వైపు వెళ్లినట్లు సమాచారముందని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామున బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో ముగ్గురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మానవతావాద సంస్థలను కూడా సంప్రదిస్తున్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ వెల్లడించారు. తమ రాష్ట్ర నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యుల ఆందోళన: ఇరాక్‌లో మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న నర్సుల కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమవారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. తిక్రిత్‌లోని బంగ్లాదేశీయులను ఆ దేశం తరలించిందని, ఆ మాత్రం కూడా మనవారు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఒబామా మంతనాలు: ఇరాక్ సంక్షోభం తీవ్ర కావడంతో.. సంక్షోభ నివారణకు అమెరికా సంప్రదింపులు తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సౌదీ రాజు అబ్దుల్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఇరాక్‌లోని సున్నీల నేత, గత పార్లమెంటు స్పీకర్ అయిన ఒసామా అల్ నుజైఫీతో.. విదేశాంగమంత్రి జాన్ కెర్రీ కుర్దుల నేత మస్సూద్ బర్జానీతో చర్చలు జరిపారు. తూర్పు సిరియాలోనూ మిలిటెంట్ల పట్టు బీరుట్: తూర్పు సిరియాలోని దీర్ ఎజ్ జార్ రాష్ట్రాన్ని గురువారం సున్ని మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిరియాలోని అత్యధిక ప్రాంతం ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని, అది లెబనాన్ భూభాగం కన్నా ఐదురెట్లు ఎక్కువని సిరియాలోని మానవహక్కుల సంస్థ వెల్లడించింది. -
కేరళ నర్సులంతా సేఫ్!!
ఇరాక్‌లో.. తీవ్రవాదుల చెరలో ఉన్న టిక్రిట్ నగరంలో ఉన్న మొత్తం 44 మంది కేరళ నర్సులు భద్రంగానే ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఓ ఆస్ప్రత్రిలో పనిచేస్తున్న భారతీయ నర్సులను అంతర్జాతీయ రెడ్ క్రిసెంట్ సొసైటీ వలంటీర్లు వెళ్లి చూశారని, వాళ్లంతా గత వారం రోజులుగా అక్కడ చిక్కుకున్నారని బాగ్దాద్‌లోని భారత రాయబారి అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు వాళ్లంతా సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. కానీ, శుక్రవారం నాడు అక్కడున్న కొంతమంది నర్సుల నుంచి కాపాడాల్సిందిగా కోరుతూ తమకు సందేశం వచ్చిందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి విషయాలు చెప్పారు. నర్సులు కావాలంటే భారత్ వెళ్లిపోవచ్చు గానీ, వారి భద్రతకు మాత్రం తాము ఎలాంటి హామీ ఇవ్వబోమని ఆస్పత్రి వర్గాలు అన్నట్లుగా తెలుస్తోంది. ఇరాక్‌లో దాదాపు 200 మంది భారతీయులు పనిచేస్తుండగా వాళ్లలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
వీడియో వివాదంలో ‘కుమారుడు’!
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి కుమార్ విశ్వాస్ను కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఆప్‌లోకి అడుగుపెట్టాక ఆయన చేసిన వివాదాస్పదమైన చర్యలేవీ లేకపోయినా ఎప్పుడో.. ఓ కవి సమ్మేళనంలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య తాలూకు వీడియో ఆయననిప్పుడు ఇబ్బందులోకి నెట్టింది. మళయాళీ నర్సులకు సంబంధించి 2008లో రాంచీలో జరిగిన ఓ కవి సమ్మేళనంలో కుమార్ విశ్వాస్ చేసిన ప్రసంగం తమను అవమాన పరిచేలా ఉందంటూ కేరళలో పెద్దపెట్టున ఆందోళనలు జరిగాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కల్పించుకొని, ఆప్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కుమార్ విశ్వాస్ ఆ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఓ పాత వీడియోలో తాను చేసిన ప్రసంగం కేరళవాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘కులం, మతం, ప్రాంతం, లింగ, జాతి వివక్షపూరితమైన వ్యాఖ్యలు, చర్యలను నేనెప్పుడూ సమర్థించను. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు నేనెప్పుడూ ప్రయత్నించను. నా వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నా మాటలు కేరళలో ఉంటున్న నా స్నేహితుల మనోభావాలను దెబ్బతీశాయనే విషయం నా దృష్టికి రావడంతోనే నేనీ క్షమాపణ చెబుతున్నా. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాన’ని చెప్పినట్లు ఆప్ ప్రకటించింది. కేరళ విభాగానికి చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. దీంతో మొత్తానికి ‘కుమారుడు’ బతికి బయటపడ్డాడు.