తిరువంతపురం:ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులు త్వరలో క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు కేరళ సీఎం ఓమెన్ చాందీ స్పష్టం చేశారు. మిలిటెంట్లు చెరలో చిక్కుకున్నఆ నర్సులకు ఎర్బిల్ ఎయిర్ పోర్ట్ లో క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చాందీ తెలిపారు. మోసూల్ పట్టణంలో కేరళకు చెందిన నర్సులను గురువారం తిరుగుబాటుదారులు అపహరించి బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి అపహరించిన ఆ నర్సులను మిలిటెంట్లు బందించి మోసుల్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉన్న కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ కు తరలించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన 'ఉన్నతస్థాయి వివాదాల కమిటీ' వారిని తిరిగి సురక్షితంగా భారత్ కు రప్పించే పనిలో నిమగ్నమైందని చాందీ తెలిపారు.
గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
'ఆ నర్సులను క్షేమంగా భారత్ కు తీసుకువస్తాం'
Published Fri, Jul 4 2014 1:22 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement