క్షేమంగా.. సొంత ఊరికి! | Release of nurses in Iraq marks a new phase in Indian diplomacy | Sakshi
Sakshi News home page

క్షేమంగా.. సొంత ఊరికి!

Published Sun, Jul 6 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

క్షేమంగా.. సొంత ఊరికి!

క్షేమంగా.. సొంత ఊరికి!

 ఇరాక్ నుంచి కేరళ చేరిన భారతీయ నర్సులు

  •  కొచ్చి విమానాశ్రయంలో స్వాగతం పలికిన కేరళ సీఎం
  •  అదే విమానంలో భారత్ వచ్చిన 78 మంది తెలంగాణ, ఆంధ్ర కార్మికులు

కొచ్చి/హైదరాబాద్: ఇరాక్‌లో దాదాపు గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మృత్యుభయంతో గడిపిన 46 మంది భారతీయ నర్సులు శనివారం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం, ఇరాక్‌లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో కొచ్చి చేరుకున్నారు. వారికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వాగతం పలికారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయలుదేరిన ఆ విమానంలో ఆ నర్సులు సహా మొత్తం 183 మంది స్వదేశం చేరుకున్నారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 78 మంది కార్మికులు  కూడా ఉన్నారు.
 
అనంతరం వీరిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపించారు. అక్కడినుంచి వారిని వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్‌లని భారతీయ ఎంబసీ అధికారులకు చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు.
 
తమకు బాకీ ఉన్న నాలుగునెలల జీతాలు ఇచ్చేవరకు విమానం ఎక్కబోమంటూ మొదట్లో నర్సులు ఎర్బిల్ విమానాశ్రయంలో పట్టుబట్టారని, అయితే, దౌత్యాధికారులు నచ్చజెప్పడంతో విమానం ఎక్కారని సమాచారం. దాదాపు నెల్లాళ్ల క్రితం ఇరాక్‌లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్‌కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే రెండు రోజుల్లో మరో 600 మంది భారతీయులు ఇరాక్‌నుంచి స్వదేశానికి రానున్నారు.
 
అమ్మో.. మళ్లీ వెళ్లం!
‘బాంబు పేలుళ్ల శబ్దాలు ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ.. నిద్రలేని రాత్రులు గడిపాము. మరోసారి మా ప్రాణాలను పణంగా పెట్టబోం. ఇరాక్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు’ అని భారత్ తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేస్తున్నారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందని కవలలైన సోనా, వీణలు వివరించారు. తిక్రిత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. వారు తమను చంపడానికి తీసుకెళ్తున్నారా? లేక రక్షించడానికి తీసుకెళ్తున్నారా? అన్న విషయం అర్థం కాలేదన్నారు. తిక్రిత్‌లఆసుపత్రి నుంచి బయటకు వచ్చి బస్సులోకి ప్రవేశించిన కొద్దిసేపటికే తామున్న ఆసుపత్రి భవనంలోని ఒకటో, మూడో అంతస్తులు మంటల్లో చిక్కుకుపోవడం కనిపించిందని సీనా అనే నర్సు వెల్లడించింది. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు.
 
మీకెలాంటి హాని చేయమని మిలిటెంట్లు మాతో చెప్పారని, అయినా, వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని,  గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని నర్సులు తెలిపారు.  అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలా అనే బెంగ పట్టుకుందన్నారు. కాగా, యూఏఈకి చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్‌నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం ఇస్తానని కేరళ వార్తా పత్రికల్లో ప్రకటన ఇచ్చారు.
 
ఈ క్రెడిట్ సుష్మాదే !

న్యూఢిల్లీ: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న  కేరళ నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావడం నరేంద్ర మోడీ సర్కారు సాధించిన మొట్టమొదటి దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ ఘనవిజయానికి మొట్టమొదటి క్రెడిట్ మాత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంక్షోభ నివారణ కోసం ఆమె రాత్రింబవళ్లు పనిచేశారు. నర్సులను క్షేమంగా విడిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు.

అందులో భాగంగా అధికారికంగా గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో, ఢిల్లీలోని ఆ దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. ఇరాక్, సౌదీ అరేబియాలతోనూ ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపారు. అనధికారికంగా ఇరాక్ సరిహద్దులుగా ఉన్న సిరియా, జోర్డాన్, టర్కీల్లోని కీలక నేతలతో చర్చలు జరిపి, తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచారని సమాచారం. ‘అంతర్జాతీయంగా భారత్‌కున్న మంచిపేరు సహా అన్ని మార్గాలనూ వాడుకున్నాం’ అని విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement