న్యూఢిల్లీ: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో తమ చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులను కేరళకు గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మోసుల్ పట్టణంలో వారిని బందీలుగా ఉంచే అవకాశమున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
వీరంతా కేరళకు చెందిన కావడంతో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.