indian nurses
-
ధన్యవాదాలు వర్ఘీస్
తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు. షరాన్ వర్ఘీస్ ఆస్ట్రేలియాలో ఉంది. కరోనా అంతటా ఉంది. తల్లి నర్సు. కూతురు నర్సింగ్ డిగ్రీ పూర్తయింది. ‘‘అమ్మా.. ఏం చేయమంటావ్’’ అని అడిగింది. ‘‘నీ ఇష్టం.. నేనైతే వదిలి రాలేను’’ అంది. ఆమె వదిలి రాలేనన్నది కువైట్‌లోని కరోనా రోగులను. కూతురు కూడా ఆస్ట్రేలియాను వదల్లేదు. వృద్ధులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఈ యువ నర్సుకు గిల్‌క్రీస్ట్ ధన్యవాదాలు తెలిపాడు. షరాన్, ఆడమ్ గిల్‌క్రీస్ట్ షరాన్ వర్ఘీస్ బియస్సీ నర్సింగ్ పూర్తి చేసి యూనివర్సిటీ బయటికి అడుగు పెట్టే వేళకు కరోనా ఆస్ట్రేలియా వరకు వచ్చేసింది. వచ్చేసింది కానీ, మరికొంతకాలమైనా ఉండకుండా పోయేది కాదని అప్పటికెవరికీ తెలీదు. షరాన్ నర్సుగా అక్కడే తన పేరు నమోదు చేసుకుని ఉంది. తొలి ఉద్యోగాన్ని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో వెతుక్కోవడమే మిగిలింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి విదేశీయుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి! కరోనా భయంతో అంతా విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. షరాన్ సందిగ్ధంలో పడింది. కేరళలో తనకు మంచి ఉద్యోగం దొరక్కపోదు. వెళ్లడమా? ఉండటమా? ‘‘అమ్మా... ఏం చేయమంటావ్?’ అని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేసింది. ఆమె కూడా నర్సే. కువైట్‌లో చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే ఉండిపోతాను. వీళ్లనిలా వదిలేసి రాలేదు’’ అన్నారు ఆవిడ! అది మనసులో పడిపోయింది షరాన్‌కు. తనూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోదలచుకుంది. అయితే ఆసుపత్రిలో కాకుండా వృద్ధులకు మాత్రమే వైద్యసేవలు (జెరియాట్రిక్) అందించే ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా ఎక్కువ. వారికి సేవలు అందించడానికి అందుబాటులో ఉండే నర్సుల సంఖ్య తక్కువ. అందుకే షరాన్ జెరియాట్రిక్ నర్స్ అయింది. అప్పటికి కరోనా కూడా ఆస్ట్రేలియా అంతటికీ విస్తరించింది. కరోనా నుంచి వృద్ధులను కాపాడటం అంటే ఒళ్లంతా హూనం చేసుకోవడం మాత్రమే కాదు. ఒళ్లంతా కళ్లు చేసుకోవడం కూడా. ∙∙ రోజుకు ఆరేడు గంటలు పని చేస్తోంది షారన్. కరోనా భయంతో దూర ప్రాంతాల్లో ఉండే నర్సులు రావడం మానేశారు. కొంతమంది రాగలిగి ఉన్నా ఇంట్లో పసిపిల్లలు ఉండటంతో జాగ్రత్తకోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ పని కూడా షరాన్ మీదే పడింది. కష్టమనుకోలేదు షరాన్. ‘‘వదిలేసి రాలేను’’ అని తల్లి అన్నమాట ఆమెకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా వృద్ధుల్ని కనిపెట్టుకుని ఉంటోంది షారన్. ఇటీవల ఓ రోజు.. షరాన్ చదివొచ్చిన ఉలాంగ్గాంగ్ యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. యూనివర్సిటీలోని కోవిడ్ –19 హెల్ప్ గ్రూప్ పంపిన మెయిల్ అది. విదేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో వైద్యసేవలు అందిస్తున్న నర్సులు తమ ఉద్యోగ వివరాలను తెలియజేయాలని హెల్ప్ గ్రూప్ కోరింది. షరాన్ వెంటనే తన వివరాలు మెయిల్ చేసింది. వీడియో తీసి పంపమని మళ్లీ ఒక మెయిల్ వచ్చింది. షరాన్ కాస్త తీరిక చేసుకుని అప్పటికప్పుడు కోటు వేసుకుని, కొంచెం లిప్‌స్టిక్ అద్దుకుని.. ‘హాయ్.. నేను షరాన్’ అంటూ తన వివరాలను రికార్డ్ చేసి పంపింది. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయింది.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫోన్లు, మెజేస్‌లు వరదలా వచ్చి పడేవరకు! అవి కేరళ నుంచి, కువైట్ నుంచి.. ఇంకా విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రీస్ట్ ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలిపాడని! ఆస్ట్రేలియాలోనే ఉండి ఇక్కడి వారికి సేవ చేయాలనుకున్న షరాన్‌కు, మిగతా భారతీయ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్న గిల్క్ట్రీస్ వీడియో క్లిప్ అప్పటికే వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న దేనినీ మెచ్చరు. ఆయన క్రికెట్ అభిమాని. గిల్‌క్రీస్ట్ నన్ను ప్రశంసించారు అనగానే ఫోన్ చేసి ‘వెల్ డన్’ అన్నారు అని సంతోషపడిపోయింది షరాన్. ఇక కేరళలో ఉన్న ఆమె తమ్ముడు, అతడి ఫ్రెండ్స్ అయితే సోషల్ మీడియాలో ఇంచుమించు ఒక ఉత్సవాన్నే జరుపుకుంటున్నారు. షరాన్కి ఇదంతా థ్రిల్లింగ్‌గా ఉంది. ∙∙ కొట్టాయంలోని కురుప్పుంత్ర షరాన్ వర్ఘీస్ స్వస్థలం. తల్లి ఎప్పట్నుంచో కువైట్‌లో నర్సు. షరాన్ తల్లి దగ్గరే ఉండి స్కూల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియాలో కాలేజ్ చదువు. సెలవుల్లో కేరళ వచ్చి వెళ్తుంటుంది. ఇక రెండేళ్ల వరకు ఉలాంగ్గాంగ్ ను వదిలి వెళ్లేది లేదని అంటోంది. ఆ ప్రాంతంలోనే ఒక ‘ఏజ్డ్ కేర్’ సెంటర్లో తనిప్పుడు పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం తనకు ఇష్టమని అంటోంది. -
యెమెన్‌లో ఉగ్రదాడులు నలుగురు భారత నర్సులు మృతి
* వృద్ధాశ్రమంలో16 మందిని కాల్చి చంపిన ముష్కరులు * కోల్‌కతాకు చెందిన మిషనరీల ఆధ్వర్యంలోని ఆశ్రమం అడెన్, న్యూఢిల్లీ: యెమెన్ తాత్కాలిక రాజధాని అదెన్‌లోని ఓ వృద్ధాశ్రమంపై ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు తెగబడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. నలుగురు భారతీయ నర్సులు సహా 16 మందిని బలిగొన్నారు. కోల్‌కతాలో మదర్ థెరీసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అడెన్ నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి ఆరుగురు సాయుధ దుండగులు వచ్చారు. తమ తల్లిని చూడడానికి వచ్చామని, గేటు తెరవాలని సెక్యూరిటీ గార్డును కోరారు. గేటు తీయగానే మొదట ఆ గార్డును కాల్చి చంపారు. దుండగుల్లో ఇద్దరు బయట కాపలాగా ఉండగా... మిగతా నలుగురు లోపలికి వెళ్లారు. గదుల్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి చేతులు కట్టేసి తలపై తుపాకీతో కాల్చారు. ఆశ్రమంతా తిరిగి 16 మందిని చంపేశారు. ఉగ్రవాదులు ఆశ్రమంలోకి చొరబడిన సందర్భంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు హెచ్చరించడంతో ఓ నర్సు స్టోర్‌రూమ్‌లోని ఫ్రిజ్‌లోకి వెళ్లి దాక్కుంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ఆశ్రమంలోకి వెళ్లిన ఖలీద్ హైదర్ అనే స్థానికుడు ఆమెను గుర్తించి రక్షించారు. అందరినీ చేతులు కట్టేసి, తలపై కాల్చి చంపారని తెలిపారు. తన సోదరుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లామన్నారు. -
'ఇరాక్ నుంచి వచ్చిన నర్సులకు ఉద్యోగాలిస్తాం'
దుబాయ్: ఇరాక్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన 46 మంది భారతీయ నర్సులు ఊహించని జాబ్ ఆఫర్ లభించింది. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు దుబాయ్ కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ఎన్ఎంసీ హెల్త్‌కేర్ గ్రూపు సీఈవో డాక్టర్ బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు. అలాగే దుబాయ్ వారు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు ఎన్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఇరాక్ హింస కారణంగా భారతీయ నర్సులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి శనివారం స్వదేశానికి తిరిగొచ్చారు. వీరికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాందికి బీఆర్ శెట్టి తెలిపారు. దుబాయ్, ఈజిప్టు, భారత్ లో ఆయన ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. భారత్ కు తిరిగొచ్చిన నర్సులలో 45 మంది కేరళకు, ఒకరు తమిళనాడుకు చెందినవారున్నారు. -
క్షేమంగా.. సొంత ఊరికి!
ఇరాక్ నుంచి కేరళ చేరిన భారతీయ నర్సులు కొచ్చి విమానాశ్రయంలో స్వాగతం పలికిన కేరళ సీఎం అదే విమానంలో భారత్ వచ్చిన 78 మంది తెలంగాణ, ఆంధ్ర కార్మికులు కొచ్చి/హైదరాబాద్: ఇరాక్‌లో దాదాపు గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మృత్యుభయంతో గడిపిన 46 మంది భారతీయ నర్సులు శనివారం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం, ఇరాక్‌లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో కొచ్చి చేరుకున్నారు. వారికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వాగతం పలికారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయలుదేరిన ఆ విమానంలో ఆ నర్సులు సహా మొత్తం 183 మంది స్వదేశం చేరుకున్నారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 78 మంది కార్మికులు కూడా ఉన్నారు. అనంతరం వీరిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపించారు. అక్కడినుంచి వారిని వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్లని భారతీయ ఎంబసీ అధికారులకు చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు. తమకు బాకీ ఉన్న నాలుగునెలల జీతాలు ఇచ్చేవరకు విమానం ఎక్కబోమంటూ మొదట్లో నర్సులు ఎర్బిల్ విమానాశ్రయంలో పట్టుబట్టారని, అయితే, దౌత్యాధికారులు నచ్చజెప్పడంతో విమానం ఎక్కారని సమాచారం. దాదాపు నెల్లాళ్ల క్రితం ఇరాక్‌లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్‌కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే రెండు రోజుల్లో మరో 600 మంది భారతీయులు ఇరాక్‌నుంచి స్వదేశానికి రానున్నారు. అమ్మో.. మళ్లీ వెళ్లం! ‘బాంబు పేలుళ్ల శబ్దాలు ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ.. నిద్రలేని రాత్రులు గడిపాము. మరోసారి మా ప్రాణాలను పణంగా పెట్టబోం. ఇరాక్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు’ అని భారత్ తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేస్తున్నారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందని కవలలైన సోనా, వీణలు వివరించారు. తిక్రిత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. వారు తమను చంపడానికి తీసుకెళ్తున్నారా? లేక రక్షించడానికి తీసుకెళ్తున్నారా? అన్న విషయం అర్థం కాలేదన్నారు. తిక్రిత్లఆసుపత్రి నుంచి బయటకు వచ్చి బస్సులోకి ప్రవేశించిన కొద్దిసేపటికే తామున్న ఆసుపత్రి భవనంలోని ఒకటో, మూడో అంతస్తులు మంటల్లో చిక్కుకుపోవడం కనిపించిందని సీనా అనే నర్సు వెల్లడించింది. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు. మీకెలాంటి హాని చేయమని మిలిటెంట్లు మాతో చెప్పారని, అయినా, వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని, గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని నర్సులు తెలిపారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలా అనే బెంగ పట్టుకుందన్నారు. కాగా, యూఏఈకి చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్‌నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం ఇస్తానని కేరళ వార్తా పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఈ క్రెడిట్ సుష్మాదే ! న్యూఢిల్లీ: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న కేరళ నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావడం నరేంద్ర మోడీ సర్కారు సాధించిన మొట్టమొదటి దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ ఘనవిజయానికి మొట్టమొదటి క్రెడిట్ మాత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంక్షోభ నివారణ కోసం ఆమె రాత్రింబవళ్లు పనిచేశారు. నర్సులను క్షేమంగా విడిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా అధికారికంగా గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో, ఢిల్లీలోని ఆ దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. ఇరాక్, సౌదీ అరేబియాలతోనూ ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపారు. అనధికారికంగా ఇరాక్ సరిహద్దులుగా ఉన్న సిరియా, జోర్డాన్, టర్కీల్లోని కీలక నేతలతో చర్చలు జరిపి, తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచారని సమాచారం. ‘అంతర్జాతీయంగా భారత్‌కున్న మంచిపేరు సహా అన్ని మార్గాలనూ వాడుకున్నాం’ అని విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. -
స్వదేశానికి చేరిన ఇరాక్ బాధితులు
-
భారతీయ నర్సులకు విముక్తి
-
భారతీయ నర్సులకు విముక్తి
* విడుదల చేసినఇరాక్ సున్నీ మిలిటెంట్లు * స్వదేశానికి తీసుకొచ్చేందుకు విమానాన్ని పంపిన భారత్ * నేటి ఉదయం కొచ్చికి.. న్యూఢిల్లీ/కొచ్చి: ఇరాక్ సున్నీ మిలిటెంట్ల చెర నుంచి 46 మంది భారతీయ నర్సులకు విముక్తి లభించింది. మిలిటెంట్లు వీరిని శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఉన్నట్టుండి విడుదల చేశారు. ఇరాక్‌లో ఘర్షణలు లేని ఎర్బిల్ నుంచి వీరు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక బోయింగ్ విమానంలో స్వదేశానికి రానున్నారు. ఈ విమానం శనివారం ఉదయం నేరుగా కొచ్చికి చేరుకోనుంది. కేరళకు చెందిన ఈ నర్సులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఈ విమానాన్ని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపింది. వీరిని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు గురువారం తమ అధీనంలోని తిక్రిత్ పట్టణ ఆస్పత్రి నుంచి బలవంతంగా మోసుల్ పట్టణానికి తరలించడం తెలిసిందే. ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ రాజధాని అయిన ఎర్బిల్.. మోసుల్కు 80 కి.మీ దూరంలో ఉంది. నర్సులు ఎర్బిల్లోని భారత ఎంబసీని సంప్రదిస్తున్నారని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో తెలిపారు. వారు క్షేమంగా ఉన్నారని, వారిని తీసుకొచ్చే విమానంలో కిర్కుక్ నుంచి మరో 70 మంది భారతీయులు, కేరళకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఓ ఐఎఫ్ఎస్ అధికారి వస్తున్నారన్నారు. అన్ని సాధనాలనూ వినియోగించుకున్నాం.. నర్సులు నాటకీయ పరిణామాల మధ్య విడుద లైనట్లు అక్బరుద్దీన్ వ్యాఖ్యల ద్వారా తె లుస్తోంది. వీరి విడుదలకు జరిపిన సంప్రదింపుల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర ఉందా అని విలేకర్లు అడగ్గా ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. ‘సంప్రదింపుల్లో దౌత్యస్థాయిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయి వివరాలు చెప్పలేం’ అని అన్నారు. దౌత్యం.. ముందు తలుపుల గుండా పనిచేస్తుందని, అయితే తాము ఇతర తలుపులనూ వాడుకున్నామన్నారు. వాటిలో ఒక తలుపు తెరచి తమ పౌరులను తరలించగలిగామని, పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేమన్నారు. నర్సుల విడుదలకు అనేక ప్రయత్నాలు చేశామని, అన్ని సాధనాలనూ వినియోగించుకున్నామన్నారు. కాగా, నర్సులు మోసుల్ నుంచి బస్సులో ఎర్బిల్ విమానాశ్రయానికి దగ్గర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకున్నారని కేరళ సీఎం ఊమెన్ చాందీ ఢిల్లీలో చెప్పారు. భారత ప్రభుత్వం, బాగ్దాద్‌లోని భారత ఎంబసీ, తమ రాష్ట్ర ప్రభుత్వం కలసికట్టుగా కృషిచేసి వీరిని స్వదేశానికి తీసుకొస్తున్నామన్నారు. తమను తిక్రిత్ నుంచి తరలించిన మిలిటెంట్లు మోసుల్ దగ్గర్లోని ఓ ఆస్పత్రి దగ్గరున్న పాత భవనంలో ఉంచారని నర్సులో ఒకరు కొట్టాయంలోని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. కాగా, భారత ప్రభుత్వం నర్సుల ఉదంతాల్లాటివి తలెత్తకుండా పటిష్ట వలస చట్టాన్ని తేవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వాన్ని కోరింది. నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించి ఉంటే వారు ఇదివరకే భారత్‌కు చేరుకుని ఉండేవారంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఊరట చెందారు. తనకు సంతోషంగా ఉందని, వారు సురక్షితంగా తిరిగిరావాలని ఓ సందేశంలో పేర్కొన్నారు. -
భారతీయ నర్సులు బలవంతంగా తరలింపు!
న్యూఢిల్లీ: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో తమ చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులను కేరళకు గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మోసుల్ పట్టణంలో వారిని బందీలుగా ఉంచే అవకాశమున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరంతా కేరళకు చెందిన కావడంతో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.