
యెమెన్‌లో ఉగ్రదాడులు నలుగురు భారత నర్సులు మృతి
* వృద్ధాశ్రమంలో16 మందిని కాల్చి చంపిన ముష్కరులు
* కోల్‌కతాకు చెందిన మిషనరీల ఆధ్వర్యంలోని ఆశ్రమం
అడెన్, న్యూఢిల్లీ: యెమెన్ తాత్కాలిక రాజధాని అదెన్‌లోని ఓ వృద్ధాశ్రమంపై ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు తెగబడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. నలుగురు భారతీయ నర్సులు సహా 16 మందిని బలిగొన్నారు. కోల్‌కతాలో మదర్ థెరీసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అడెన్ నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి ఆరుగురు సాయుధ దుండగులు వచ్చారు. తమ తల్లిని చూడడానికి వచ్చామని, గేటు తెరవాలని సెక్యూరిటీ గార్డును కోరారు.
గేటు తీయగానే మొదట ఆ గార్డును కాల్చి చంపారు. దుండగుల్లో ఇద్దరు బయట కాపలాగా ఉండగా... మిగతా నలుగురు లోపలికి వెళ్లారు. గదుల్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి చేతులు కట్టేసి తలపై తుపాకీతో కాల్చారు. ఆశ్రమంతా తిరిగి 16 మందిని చంపేశారు.
ఉగ్రవాదులు ఆశ్రమంలోకి చొరబడిన సందర్భంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు హెచ్చరించడంతో ఓ నర్సు స్టోర్‌రూమ్‌లోని ఫ్రిజ్‌లోకి వెళ్లి దాక్కుంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ఆశ్రమంలోకి వెళ్లిన ఖలీద్ హైదర్ అనే స్థానికుడు ఆమెను గుర్తించి రక్షించారు. అందరినీ చేతులు కట్టేసి, తలపై కాల్చి చంపారని తెలిపారు. తన సోదరుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లామన్నారు.