ప్రమాదాల నివారణకు నయా రూల్‌!  | Motor Vehicles Act 2019 implemented from September1 In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు నయా రూల్‌! 

Published Sun, Sep 1 2019 12:13 PM | Last Updated on Sun, Sep 1 2019 12:14 PM

Motor Vehicles Act 2019  implemented from September1 In Mahabubnagar  - Sakshi

కోయిల్‌సాగర్‌ రహదారిలో జీపు టాప్‌పై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలోని ఏ రోడ్డును చూసినా రక్తపు మరకలే కనిపిస్తాయి. నిబంధనలు పాటించకపోవడంతో జాతీయ రహదారి, అంతర్‌రాష్ట్ర రహదారులు, గ్రామీణరోడ్లపై సైతం ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతేడాది 763 ప్రమాదాలు జరిగితే.. ఈ ఏడాది జూలై వరకు 337 ప్రమాదాలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదాలను నివారించడానికి పోలీసుశాఖ నిబంధనలను కఠినతరం చేసింది. నేటినుంచి ఎవరైనా ట్రిపుల్‌రైడింగ్‌ చేసినా..హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహనాలు నడిపినా.. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, సీటుబెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్‌ చేసినా..లైసెన్సు లేకున్నా.. చివరికి చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినా.. భారీగా జరిమానాలతోపాటు జైలుశిక్ష వేయనున్నారు. 

పెరిగిన వాహనాల వినియోగం 
జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఒక రోజులో 90కిపైగా ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్‌ చే స్తున్నారు. ఇక కార్లు 5నుంచి 8వరకు ఉంటున్నా యి. ఆటోల ఇతర వాహనాలు కలిపి మరో పది కి పైగా రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 4,25,470 వాహనాలు ఉంటే దీంట్లో కార్లు 21,603, ద్విచక్ర వాహనాలు 3,20,457 ఉన్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక ద్విచక్ర వా హనం ఉంటోంది. కొందరి వద్ద రెండేసి ఉంటున్నాయి. అవసరం లేకున్నా హోదా కోసం కొను గోలు చేస్తున్నారు. సరకుల రవాణా, ప్రయాణి కుల తరలింపు కోసం కూడా వాహనాలు కొ నేస్తున్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 600 వరకు వాహనాలు ఉన్నట్లు అధికారుల అంచనా. 

నిత్యం ఎన్నో ప్రమాదాలు  
ద్విచక్ర వాహనాల వినియోగం జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో ఈ వాహనాల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల ప్రమాదం జరిగితే, మరికొన్ని సందర్భాల్లో ఇతర వాహనదారుల తప్పిదంతో చోటు చేసుకుంటున్నాయి. సందర్భం ఏదైనా ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. 

మద్యం మత్తులో..  
తాగి వాహనాలు నడిపేవారు ఇటీవల పెరిగారు. వీరి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై లారీలు ఇతర భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు రాత్రివేళల్లో మద్యం తాగుతున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నడిపే వారుసైతం మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారు.  మత్తులో వాహనాలను ఇష్టారాజ్యంగా నడపటంతో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లోనూ రహదారుల వెంబడి బార్లు, మద్యం దుకాణాలు ఉండటంతో ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. 

నూతన చట్టంతోనైనా మారాలి 
నూతన మోటారు వాహన చట్టాన్ని కేంద్రం తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇది వరకున్న జరిమానాలు దాదాపు ఐదింతలకు పెంచారు. ప్రధానంగా మద్యం తాగి, అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లకు బైక్‌లు ఇచ్చే అంశాలపై జరిమానా భారీగా పెంచారు. అయితే పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మైనర్‌ డ్రైవింగ్, డ్రంకెన్‌ డ్రైవ్, రాష్‌ డ్రైవింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో వాహనదారులను చైతన్యం చేస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. 

వేలల్లో కేసులు..రూ.కోట్లలో జరిమానాలు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత జనవరి నుంచి జూలై వరకు మైనర్‌ డ్రైవింగ్‌లో 2,743, హెల్మెట్‌ 5,765, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన కేసులు 4,321, ట్రిబుల్‌ రైడింగ్‌ 680, ఓవర్‌స్పీడ్‌ 2,345, సీటు బెల్టు 1,132 కేసులు నమోదు చేశారు. మొత్తంగా 18,640 కేసులు నమోదు చేయగా వాటిలో రూ.1,52,68,110 జరిమానాలు విధించారు. 290 డ్రంకెన్‌డ్రైవ్‌ కేసుల్లో రూ.4,45,000 జరిమానాలు విధించా రు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి నుంచి ఆగస్టు వరకు ఓవర్‌ లోడ్‌ 78 కేసులు,  లైసెన్స్‌ లేకుండా 433 కేసులు నమోదు చేశారు. 

నేటినుంచే అమలు 
నేటి నుంచే కొత్త జరిమానాలు రానున్నాయి. రోడ్లపై వాహనాలు నడిపే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు రానే వచ్చింది. గతంలో ఏం అవుతుందిలే అనుకున్న వాళ్ల జేబులకు నేటి నుంచి చిల్లు పడనుంది. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తే నెల జీతం పోలీసులకు కట్టాల్సిందే అనే విషయం వాహనదారులు గుర్తు పెట్టుకుని రోడ్లపైకి రావాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement