‘ఐసీబీటీ’పై మళ్లీ కదలిక | Moving on ICBT Plan Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఐసీబీటీ’పై మళ్లీ కదలిక

Published Mon, May 13 2019 7:48 AM | Last Updated on Mon, May 13 2019 7:48 AM

Moving on ICBT Plan Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆదినుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటున్న ప్రతిష్టాత్మక ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ ప్రాజెక్ట్‌ (ఐసీబీటీ)లో ఇప్పుడు కొంత కదలిక మొదలైంది. 2011లో ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టుకు వివిధ అవాంతరాలు ఎదురవడంతో ప్రస్తుతమున్న మార్కెట్‌కు అనుగుణంగా అధ్యయనం చేసేందుకు నియమించిన ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీ కమిటీ ఆ పనుల్లో వేగాన్ని పెంచింది. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి పనులు చేపట్టాలని హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.   

ఆది నుంచి అడ్డంకులే...
2011లో ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న కేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ సమస్యతో కొన్ని నెలలు ఆలస్యం కాగా, అంతలోనే ఐసీబీటీ ప్రాజెక్టు పనులు చేయాలనుకున్న మియాపూర్‌ విలేజ్‌ సర్వే నంబర్‌ 20 (పీ), 28లోని 55 ఎకరాల భూమి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది. మియాపూర్‌లోని 200 ఎకరాల భూమి గొడవ గురించి ఇద్దరు అన్నదమ్ములు ఆర్బిట్రేటర్‌ వద్దకు వెళ్లడంతో ఆ భూమిని చెరిసగం అమ్ముకోవచ్చని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో హెచ్‌ఎండీఏకు చెందిన మియాపూర్‌ విలేజ్‌ సర్వే నంబర్‌ 20 (పీ), 28లోని 55 ఎకరాల భూమి కూడా ఉండటంతో ఐసీబీటీ పనులకు ఆటంకం ఏర్పడింది. అయితే ఈ భూమిని అమ్మేందుకు వీల్లేదని ఇప్పటికే భవనాలు కట్టామని మరికొంత మంది ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడంతో అంతకుముందు సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రీకాల్‌ చేసింది. దీంతో ఐసీబీటీ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. అయితే భవిష్యత్‌లో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు  ఎదురుకాకుండా ఉండేందుకు అడ్వొకేట్‌ జనరల్‌ సలహా కోరగా ప్రాజెక్టు పనులు చేపట్టవచ్చంటూ సూచించారు. ‘మియాపూర్‌ సర్వే నంబర్‌ 20, 28 నిజాం కాలంలో జాగీర్‌లకు చెందినది. అయితే 1358 ఎఫ్‌ జాగీర్‌ రద్దు చట్టం ప్రకారం ఆ భూములు ప్రభుత్వానికి బదలాయింపు అయ్యాయి. జాగీర్‌ వారసులకు కమ్యూటేషన్‌ కూడా చెల్లించింది. మియాపూర్‌లో ఐసీబీటీ పనులు నిరభ్యంతరంగా చేపట్టవచ్చ’ని హెచ్‌ఎండీఏ రాసిన లేఖకు అడ్వొకేట్‌ జనరల్‌ సమాధానమిచ్చారు. అయితే  తాజా పరిస్థితులకు అనుగుణంగా మరొకసారి ఐసీబీటీ ప్రాజెక్టుపై పునరధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. 

షాపింగ్‌ చేయొచ్చు...సినిమా చూడొచ్చు...
తమిళనాడులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ (ఐసీబీటీ)ను తలదన్నేలా గా మియాపూర్‌లో ఐసీబీటీ పనులు చేయనున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ బస్సులు ఇక్కడ నిలపొచ్చు. ఏవైనా వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు రెంటల్‌ సర్వీసు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రజలకు కావల్సిన సౌకర్యాలైన ఆరోగ్యం దగ్గరి నుంచి వినోదం వరకు అన్ని వసతులు కల్పించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు డార్మిటరీస్, వినోదం కోసం సినిమా థియేటర్‌ను నిర్మించనున్నారు. ఫుడ్‌కోర్ట్స్‌ అందుబాటులో ఉంచనున్నారు. సెలూన్స్‌ కూడా ఏర్పాటుచేయనున్నారు. దీనికితోడు బంధువులు, స్నేహితులతో బస్సు వచ్చేంతసేపు షాపింగ్‌ చేసుకునేందుకు కూడా షాపింగ్‌ మాల్స్‌ సౌకర్యాలు కల్పిస్తారు.   

మియాపూరే ఎందుకంటే...
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి తోడు సిటీ బస్సులు కూడా వేలల్లో ట్రిప్పులు తిప్పుతుండటంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు నిత్యకృత్యం అయ్యాయి. ఒకప్పుడు బస్సులు నిలిపేందుకు ఎంజీబీఎస్‌ను అధికారులు నిర్మించగా రోజురోజుకు ఇక్కడకు బస్సుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులు హాల్ట్‌ చేసేందుకు శివారు ప్రాంతంలోనే ఓ భారీ బస్టాండ్‌ను నిర్మించాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకనుగుణంగానే  శేరలింగంపల్లి మండలం మియాపూర్‌ విలేజ్‌ సర్వే నంబర్‌ 20 (పీ), 28లోని 55 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ ప్రాజెక్ట్‌ పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం వెనుక భారీ ప్రణాళిక ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో పాటు నగరానికే తలమానికమైన అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, ఏ ప్రాంతం నుంచైనా బస్సులు వచ్చి వెళ్లేలా సౌకర్యం ఉండటంతో మియాపూర్‌ను హెచ్‌ఎండీఏ అధికారులు ఎంపిక చేశారు. అలాగే ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఐసీబీటీకి వచ్చివెళ్లే ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మెట్రో సర్వీసులు కూడా ఉండేలా చూసుకున్నారు. సిటీ బస్సులు కూడా ఇక్కడి నుంచి సేవలు అందించనున్నాయి.

సగం ట్రాఫిక్‌ తగ్గినట్టే...
ఐసీబీటీ అందుబాటులోకి వస్తే నగరంలోకి వచ్చే దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను నియంత్రించవచ్చు. మియాపూర్‌లోనే ఇవి హల్ట్‌ కావడంతో అక్కడి నుంచి ప్రజలు సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఇతర మార్గాల ద్వారా సిటీలోకి వస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు మెట్రో, సిటీ బస్సులో ఐసీబీటీకి వెళతారు. దీనివల్ల నగరంలో ఏర్పడుతున్న ట్రాఫిక్‌ జామ్‌ సగం వరకు తగ్గినట్టే అవుతుంది. ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది.– అరవింద్‌ కుమార్,హెచ్‌ఎండీఏ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement