ఆ కులాలను బీసీల్లో చేర్చండి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దశాబ్ధాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పలు కులాలను బీసీల్లో చేర్చాలని ఎంపీ అసదసుద్దీన్ ఒవైసీ బీసీ కమిషన్‌ను కోరారు. ఈమేరకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహిర్ యాదవ, గవిలి, సారోల్లు తదితర కులాలు హైదరాబాద్‌లో దశాబ్ధాలనుంచి నివసిస్తున్నాయని, వీరంతా ఆర్థిక, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కులాలను బీసీల్లో కలిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు.
అంతకుముందు సంచార కులాలకు చెందిన ప్రతినిధులు బీసీ కమిషన్‌ను కలిసి వాదనలు వినిపించారు. బాగోతుల, బొప్పల, శ్రీక్షత్రియ రామజోగి, ఓడ్, గౌలి, బైలుకమ్మర, కాకిపగడాల, సాధనాశూరుల, తెరచీరల కులాల ప్రతినిధులు తమను డీఎస్టీ(డీనోటిఫైడ్ ట్రైబ్స్) కేటగిరీలో పరిగణించాలన్నారు. ఎంబీసీల్లో చేర్చితే ఫలాలు అందవన్నారు. దీంతో స్పందించిన చైర్మన్ బీఎస్ రాములు పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు.