
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందినట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నాగం చేరడాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ వర్గం వాదన కన్నా ఆయన పార్టీలో చేరడమే మేలనే భావనకు అధిష్టానం వచ్చిందని, అందుకే నాగం వైపే రాహుల్ మొగ్గు చూపారని పార్టీ వర్గాలంటున్నాయి.
ఎప్పుడో ఓకే.. కానీ!
నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని నాలుగైదు నెలలుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లిన ఆయన ఆ పార్టీలో తనకు లభిస్తున్న ప్రాధాన్యంపై చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, రాష్ట్రస్థాయి చరిష్మా ఉన్న నేతగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్‌కు లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. నాగం చేరికను అదే జిల్లాకు చెందిన కీలక నాయకురాలు డీకే అరుణ వ్యతిరేకిస్తున్నారు. నాగం చేరికపై తన వర్గీయులైన ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలను వెంటబెట్టుకుని వెళ్లి ఏకంగా రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగం చేరికకు బ్రేక్ పడింది. అప్పటి నుంచీ అదుగో.. ఇదుగో అంటున్నా ఇప్పటివరకు నాగం కాంగ్రెస్‌లో చేరిక కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా నాగం చేరికపై రాహుల్‌తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ చర్చించి లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. నాగంకు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సీటు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం.
సయోధ్య దిశలో : నాగం, అరుణ వర్గాల మధ్య సయోధ్య కుదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన చేరిక విషయంలో నాగం ఓ మెట్టు దిగి అరుణతో రాజీకి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అరుణ తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పారని, అరుణ రాగానే ఇద్దరి భేటీ ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment