‘ఓటుకు నోటు’పై మల్లగుల్లాలు
ఏసీబీ నోటీసులు ఇస్తే ఎలా స్పందించాలని యోచిస్తున్న బాబు?
♦ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించేది ఎలా?
♦ రహస్య దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయం
♦ ఐజీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు తదుపరి చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతుండటంతో తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి, కేంద్రం సహకారం అర్థించడానికి తెరపైకి తీసుకువచ్చిన ట్యాపింగ్ ఆరోపణల్ని నిరూపించడం ఎలా? అనే అంశంపైనా దృష్టి కేంద్రీకరించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ పోలీసు, నిఘా, ఏసీబీకి చెందిన ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇందులోనే ‘ఓటుకు నోటు’ పూర్వాపరాలు రహస్యంగా దర్యాప్తు చేయించేందుకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరుల అరెస్టు తరవాత ‘ఓటుకు నోటు’ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు, ఏసీబీ కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాలతో వచ్చేవారం న్యాయస్థానంలో సమగ్ర నివేదిక సమర్పించడానికి తెలంగాణ ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోపాటు ఫోన్ సంభాషణల ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతోపాటు మరికొందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు అనుమతి కోరుతూ మెమో దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా నోటీసులు జారీ చేస్తే వాటిని తీసుకోవాలా? తిరస్కరించాలా? అనే అంశంపై శుక్రవారం నాటి సమావేశంలో సీఎం ప్రధానంగా చర్చించారని తెలిసింది.
అసలు నోటీసులు తీసుకోకుండా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అధికారులు, నిపుణులతో చెప్పినట్లు సమాచారం. అయితే అలా ఉండటం సాధ్యంకాదని వారు సీఎంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు గరిష్టంగా మూడు నోటీసులు జారీ చేస్తారని, అజ్ఞాతంలో లేకుండా అందుబాటులో ఉన్న నిందితుడు వీటిలో ఏ ఒక్కటీ తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎంకు వివరించినట్లు తెలిసింది. అదే జరిగితే ఏసీబీ అధికారులు న్యాయస్థానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళి చట్టప్రకారం తదనంతర చర్యలకు ఉపక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.
నోటీసులు తీసుకోకుండా ఉండటం కంటే... తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా స్టేకు ప్రయత్నిస్తే ఉత్తమమని న్యాయ నిపుణులు సీఎంకు సూచించారు. విషయం స్టే వరకు వెళ్తే నేరం అంగీకరించినట్లు అవుతుందని సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో కొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. సుదీర్ఘ చర్చోపర్చల అనంతరం నోటీసులు తీసుకుని, న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరికొందరు నిపుణులు, న్యాయవాదుల్ని సంప్రదించిన తరవాత తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు చేసినందున ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా కొన్ని ఆధారాలు సేకరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికోసం అత్యంత రహస్యంగా దర్యాప్తు చేసేందుకు నిఘా విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ బృందానికి ఏ దశలోనూ ఎలాంటి ఆటంకాలూ కలిగించవద్దని, అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందించాల్సిందిగా పోలీసు, నిఘా విభాగాల్లోని అన్ని వింగ్స్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.