Issued notices
-
వాస్తవాలు ఎందుకు దాచారు?
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ గ్రూప్ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ అసెట్స్‌ను రిలయన్స్‌కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్‌తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్–ఫ్యూచర్స్ గ్రూప్ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్–ఫ్యూచర్స్ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ (ఎఫ్ఆర్ఎల్) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్‌కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్ ఒప్పందం సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్ తెలిపింది. -
ఏలూరు మురళీకృష్ణ ఆసుపత్రికి నోటీసులు
ఏలూరు టౌన్: కరోనా చికిత్సలో ప్రైవేటు, కార్పొరేటు దోపిడీ పెచ్చుమీరుతోంది. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులకు వెళ్లకుండా కరోనా రోగులు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తూ జేబులు గుల్లచేసుకుంటున్నారు. ఆ ఆస్పత్రులు కనీసం వెంటిలేటర్ లేకుండానే రోజుకు రూ.వేలల్లో బిల్లులు వేస్తూ వారంలో రూ.లక్షలు వసూలు చేస్తూ రోగులను నిండా ముంచేస్తున్నాయి. ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లోనూ అనధికారికంగా కోవిడ్ చికిత్సలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం ఈ విషయాలేవీ పట్టనట్లు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు నగరంలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, రైట్ ల్యాబ్‌ల్లో జరుగుతున్న అక్రమాలు జిల్లాలోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. కలెక్టర్ రేవు ముత్యాలరాజు సీరియస్ కావటంతో అధికారులు అప్రమత్తమై మురళీకృష్ణ హాస్పిటల్, రైట్ల్యాబ్లను సీజ్ చేయటంతోపాటు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వసూళ్లు ఏలూరు నగరానికి చెందిన 60ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరారు. వారంపాటు చికిత్స అందించి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఇంటికి పంపించివేశారు. మళ్ళీ నాలుగురోజులకే అస్వస్థతకు గురికాగా ఇదేమిటని డాక్టర్‌ను ప్రశ్నించగా కరోనా మరోసారి వచ్చిందంటూ చెప్పి తప్పించుకున్నారు. ఆమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. నగరానికి చెందిన ఒక యువకుడు తన స్నేహితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్లో చేర్పించగా రోజుకు రూ.35వేలు చొప్పున చెల్లించాలని చెప్పి, ముందుగా రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నారు. మరుసటి రోజే ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ రావటంతో ఇంటికి వెళ్తానని చెప్పినా వినకుండా సిటీస్కాన్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని తేలిందంటూ నాలుగు రోజులు చికిత్స చేసి రూ.2.50 లక్షలు వసూలు చేశారు. ప్రైవేటు చేతికి ప్రభుత్వ టెస్టు కిట్లు ? ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేటలో రైట్ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.వేలల్లో దోచుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద ఆకస్మిక తనిఖీలు చేసి, అక్రమాలు జరుగుతున్నాయనే నిర్ధారణతో ల్యాబ్‌ను సీజ్ చేశారు. రైట్ ల్యాబ్‌లో కోవిడ్–19 యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు లభించటం అక్రమాలు జరుగుతున్నాయనేందుకు సాక్ష్యంగా మారింది. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా పరీక్షలకు వినియోగించే యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టు కిట్లు అక్రమ మార్గంలో ప్రైవేటు ల్యాబ్‌లకు చేరుతున్నాయి. ల్యాబ్‌లో కరోనా పరీక్ష చేసినందుకు ఏకంగా రూ.2,500 నుంచి రూ.3.500 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలుస్తోంది. ఈ కరోనా టెస్టు కిట్లు జూలైలో ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేసినవిగా చెబుతున్నారు. సిబ్బంది అక్రమంగా వీటిని బయట ల్యాబ్‌లకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.10లక్షల విలువైన ఇంజెక్షన్లు ? మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో వెంటిలేటర్లు లేకపోయినా క్రిటికల్ కేర్ పేరుతో భారీ దోపిడీ చేయటంపై జిల్లా ఉన్నతా«ధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఏకంగా రూ.10లక్షల విలువైన రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు అనధికారికంగా నిల్వ చేయటంపైనా దృష్టి సారించారు. ఇష్టారాజ్యంగా వైద్యం చేయటంతో కొందరు రోగులు మృత్యువాత పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేసే సమయంలో హాస్పిటల్లో 20మంది వరకు రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులకు తెలియదంట! జిల్లా కేంద్రం ఏలూరు నడిబొడ్డున ఉన్న మురళీకృష్ణ హాస్పిటల్లో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియకపోవటంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కొందరు నాయకుల అండతోనే డాక్టర్ మురళీకృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆరోగ్యశ్రీలో వైద్యం వికటించటంతో వ్యక్తి మృతిచెందగా కేసు నమోదు కాకుండా లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా ఎక్కడా కేసు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారులూ హాస్పిటల్ యాజమాన్యానికి సహకారం అందిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ.. మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 5 రోజులలో వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి ఎండీ మురళీకృష్ణకు నోటీసులు అందించారు. పదిహేను రోజుల పాటు ఆసుపత్రి సేవలు రద్దు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల సోదాలనంతరం ఆసుపత్రిలోని పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి లేకున్న చికిత్స చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. 11 మంది చికిత్స పొందుతూ మృతి చెందిన కానీ ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. -
తిన్నది కక్కిస్తున్నారు
-
రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనైతిక వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీ చేసింది. జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో రాహుల్ నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంట్లో రఫేల్ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్)ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ రాహుల్‌కు నోటీసులు ఇచ్చింది. -
ట్రాఫిక్ సమస్యకు మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదని, దీని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ్ హైకోర్టుకు లేఖ రాశారు. ఏటా రోడ్లపై పెరిగిపోతోన్న వాహనాల సంఖ్యను నియంత్రించేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. లేఖపై స్పందించిన హైకోర్టు దీనిని పిల్‌గా మలిచింది. దీని పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, పురపాలక ముఖ్య కార్యదర్శి, రవాణా ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఎందుకో.. ఏమో!
ఆత్మకూరు రూరల్: దర్జాకు ప్రతిరూపంగా నిలిచే నల్ల స్కార్పియో.. యజమానుల్లో తెలియని భయం సృష్టిస్తోంది. అధికారులు ఈ వాహనాల వివరాలను సేకరిస్తున్నా.. ఎందుకోసమనే వివరాలు వారికీ స్పష్టంగా తెలియకపోవడమే ఈ పరిస్థితి కారణం. గత మూడు రోజులుగా జిల్లాలోని నల్ల స్కార్పియో యజమానులు ప్రాంతీయ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల మెట్లు ఎక్కి దిగుతున్నారు. జిల్లాలోని నల్ల స్కార్పియోల సంఖ్య, వీటి వివరాలు తెలియజేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టుకమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ఆ మేరకు నంద్యాల ఆర్టీఓకు.. కర్నూలు నంద్యాల, ఆదోని, డోన్ ఎంవీఐలకు ఈ సమాచారం చేరింది. వీరు తమ పరిధిలోని వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి కార్యాలయంలో కలవాలని ఆదేశిస్తున్నారు. అలా వచ్చిన యజమానుల నుంచి వాహన వివరాలతో పాటు డ్రైవర్ సమాచారం సేకరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న వాహన శ్రేణిలో స్కార్పియో వాహనాలు ఉండటం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు అలాంటి వాహనాలు కాన్వాయ్‌లో కలిస్తే భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతోనే నల్ల స్కార్పియోల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అవసరమైతే వీటిని వినియోగించుకునే ఉద్దేశం కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే... డిప్యూటీ రవాణా కమిషనర్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మా పరిధిలోని నల్ల స్కార్పియోల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశాం. వాహనం పూర్తి వివరాలతో పాటు డ్రైవర్ వివరాలను సేకరించాం. -జింకల అనిల్ కుమార్, ఎంవీఐ, ఆత్మకూరు -
అంతా నాలుగు రోజుల్లోనే..
- ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అల్టిమేటంతో స్పందించిన సర్కార్ - బంద్ హెచ్చరికతో దిగొచ్చిన వైనం విజయవాడ సెంట్రల్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె అంశంలో నాలుగు రోజుల్లోనే అద్భుతం జరిగింది. నాలుగు రోజుల్లో విధుల్లో చేరకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై కాంట్రాక్టర్లకు ఈనెల 22న నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రబంద్ తప్పదని ప్రభుత్వానికి ఈనెల 23వ తేదీన అనంతపురం జిల్లా కంబదూర్ మండలం తిమ్మాపురం నుంచి అల్టిమేటం ఇచ్చారు. జగన్ ఇచ్చిన భరోసా కార్మిక వర్గానికి ఊపిరులూదింది. 24న చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం కావడానికి దోహదపడింది. దీంతో కంగుతిన్న సర్కార్ యూనియన్ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించింది. దిగిరాక తప్పలేదు ఈనెల 17న బందరురోడ్డులోని గేట్‌వే హోటల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరగా, సీఎం ససేమిరా అన్నారు. కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పోరాటంలో కీలక భూమిక పోషించారు. మెడలు వంచాం.. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రాష్ట్ర బంద్‌తో సర్కార్ దిగిరాక తప్పలేదు. మొండిపట్టు వీడి జీతాల పెంపుదలకు అంగీకరించింది. ప్రభుత్వం మెడలు వంచిన ఘనత జగన్‌కే దక్కుతుంది. కార్మికుల పోరాటానికి వైఎస్సార్ సీపీ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. ఇది సమష్టి విజయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మార్చుకోవాలి. ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సానుకూల ధోరణిలో వ్యవహరిస్తే మంచిది. - బీఎన్ పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
కూపీ లాగుతున్న ఏసీబీ!
* వేం నరేందర్‌రెడ్డి కుమారుడిని రెండోరోజూ విచారించిన అధికారులు * ఉదయసింహ, సెబాస్టియన్‌లతో కలిపి కృష్ణకీర్తన్‌కు ప్రశ్నలు * టీడీపీ నేతల తర్ఫీదును వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్న ఏసీబీ * ఆర్థిక మూలాలకు సంబంధించి కీలక సమాచారం సేకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్‌లు ఎదురవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఈ కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు గురువారం కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన ఈ విచారణలో.. కృష్ణకీర్తన్‌తో పాటు ఉదయ సింహ, సెబాస్టియన్లను కూడా కలిపి విచారించారు. తొలుత ఈ ముగ్గురిని ఫోన్‌కాల్స్ ఆధారంగా విడివిడిగా ప్రశ్నించగా.. వారు చెప్పిన కొన్ని సమాధానాల మధ్య పొంతన కుదరనట్లు తెలిసింది. దాంతో అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి డబ్బుల వ్యవహారానికి సంబంధించి అడగగా.. తొలుత మౌనమే సమాధానమైనట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణలో చివరకు కొన్ని కీలక అంశాలతో పాటు ఈ కేసులో ఆర్థిక మూలాలకు సంబంధించిన విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. అడ్డంగా దొరికిపోయిన కృష్ణకీర్తన్! ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కృష్ణకీర్తన్ పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద ముందే కొంత సమాచారముంది. దాని ఆధారంగా ఆయనను బుధవారం పిలిపించి, విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాదిరిగానే కృష్ణకీర్తన్ కూడా బాగా ‘తర్ఫీదు’ తీసుకున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కేసుకు సంబంధించిన నిందితులు, అనుమానితులు, సాక్షులుగా ఉన్నవారు వ్యక్తిగత విచారణలో మొండికేస్తుండటంతో.. ఏసీబీ రూటు మార్చింది. విడివిడిగా విచారించినప్పుడు బయటపడిన అంశాల్లోని సందేహాలను, మూకుమ్మడి విచారణలో తీర్చుకుంటోంది. రెండో రోజు విచారణకు రావాల్సిందిగా బుధవారమే కృష్ణకీర్తన్‌ను ఆదేశించిన ఏసీబీ... గురువారం ఉదయం హఠాత్తుగా ఉదయసింహ, సెబాస్టియన్లను కూడా పిలిపించింది. వారిద్దరినీ చూడగానే కృష్ణకీర్తన్ కంగుతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయన మొదటి రోజు చెప్పిన విషయాలను ఉదయసింహ, సెబాస్టియన్ల ముందు మరోసారి ప్రస్తావించే సరికి నీళ్లు నమిలినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన కృష్ణకీర్తన్.. డబ్బులకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. బిగుసుకుంటున్న ఉచ్చు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్‌ను విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం నరేందర్‌రెడ్డిని మరోసారి విచారించాలని భావిస్తోంది. అయితే ఆయనను ఈ కేసులో సాక్షిగా భావిస్తూ నోటీసులు జారీ చేయాలా, నిందితుడిగానా అన్నదానిపై దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు. -
ఆర్థిక మూలాలపైనే దృష్టి!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇప్పటికే సూత్రధారి, పాత్రధారులు ఎవరనేదానిపై ఒక నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఇప్పుడు మిగతా కీలకాంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు, ఇస్తానని హామీ ఇచ్చిన మిగతా రూ.4.5 కోట్లకు సంబంధించిన ఆర్థిక మూలాలపై లోతుగా ఆరా తీస్తోంది. కేసు దర్యాప్తులో ఇది కీలక కోణమని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బుధవారం టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేయడంతో బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణకీర్తన్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు వివిధ కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. సుదీర్ఘ విచారణలో కృష్ణకీర్తన్ కాస్త ఆందోళనకు గురైనట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా విచారణ ముగియకపోవడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఆందోళన చెందిన కుటుంబీకులు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చివరకు కీర్తన్ ఏసీబీ కార్యాలయం నుంచి సాయంత్రం 6.40 గంటల సమయంలో బయటకు వచ్చారు. అంతా నాన్నగారే చూస్తారు! ‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ కూడా మాతో రాజకీయ విషయాలు చర్చించరు. వాటిపట్ల నాకు ఆసక్తి ఉండదు. అంతా నాన్నగారే చూసుకుంటారు..’’ అని కృష్ణకీర్తన్ ఏసీబీ విచారణలో అన్నట్లు సమాచారం. అయితే ఏసీబీ కూడా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు పలు రకాల ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కృష్ణకీర్తన్ ఫోన్ నుంచి పలుసార్లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లకు కాల్స్ వెళ్లడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ‘నా ఫోన్ నుంచి మా తండ్రి వేం నరేందర్‌రెడ్డి మాట్లాడారు’ అని కీర్తన్ చెప్పినట్లు తెలుస్తోంది. మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్‌తోపాటు ఉదయసింహ ఇద్దరూ వేం నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపినప్పుడు కృష్ణకీర్తన్ కూడా అక్కడే ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా భావిస్తోంది. ఈ దిశగా డబ్బులకు సంబంధించి కృష్ణకు ఏసీబీ కీలక ప్రశ్నలు సంధించినప్పటికీ ఆయన్నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. కొందరు టీడీపీ నాయకులు తమ ఇంటికి వచ్చినప్పుడు చూడటమే తప్ప, వారితో ప్రత్యేకించి మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పినట్లు సమాచారం. వేంను మళ్లీ పిలిచే అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోసారి విచారణకు పిలవాలని భావిస్తోంది. కృష్ణకీర్తన్ విచారణ తర్వాత ‘ఆర్థికాంశాల’పై ఏసీబీకి ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వేం నరేందర్‌రెడ్డిని మరోసారి పిలిచి పూర్తిస్థాయి విచారణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో వేం నరేందర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈసారి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. -
అయ్యో స్వామీ.. ఆస్తులు కాపాడరేమీ?
- హేమగిరి సత్యనారాయణ స్వామి భూములపై అక్రమార్కుల కన్ను - ఇప్పటికే కోర్టు వివాదంలో విలువైన స్థలాలు - చర్యలకు అధికారుల తాత్సారం అనకాపల్లి: దేవుని మాన్యాలను కాపాడడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనల మేరకు నోటీసులు జారీ చేయడం తప్ప అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో పలు దేవస్థానాల భూములు వివాదాల్లో ఉండగా, అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ హేమగిరి సత్యనారాయణస్వామి దేవస్థానం భూములకు రక్షణ కరువైంది. 1977 నుంచి దేవాదాయ శాఖలోకి.. సువిశాలమైన భూములను కలిగి ఉన్న సత్యనారాయణస్వామి దేవస్థానం 1977లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. ఈ దేవస్థానానికి సంబంధించిన భూముల విస్తీర్ణంపై స్పష్టత కొరవడంది. అనకాపల్లితో పాటు చోడవరం మండలంలో కూడా స్వామివారికి విలువైన భూములు ఉన్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణస్వామి కల్యాణం కమనీయంగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సత్యనారాయణస్వామి వ్రతాలకు పెట్టింది పేరైన ఈ ఆలయం అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. ప్రస్తుతం ఈ స్వామివారి కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే విలువైన భూములను కాపాడుకోవడంలో మాత్రం అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి పరిధిలో 60 ఎకరాలకు పైబడి భూములుం డగా 15 ఎకరాల వరకు ఏలేరు కాలువ క్వార్టర్లకు సేకరించి నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 45 ఎకరాలలో కూడా వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా కూం డ్రం వెళ్లే రహదారికి ఆనుకొని ఉన్న విలువైన భూములపై గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యా పారి కన్నుపడింది. ఆ వ్యాపారి లేఅ వుట్కు వెళ్లేందుకు దారి నిమిత్తం స్వామివారి భూ ములను ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా అధికారులు బోర్డులు పెట్టి తాత్కాలికంగా అడ్డుకున్నారు. స్వామివారి మామిడి తోటకు ఆనుకొని 8 ఎకరాల నష్టపరిహారానికి సంబంధించిన వివాదంలో రైతులు కోర్టును ఆశ్రయించినందున నిధులు దక్కకుండా పోయాయి. కొత్తూరు కాలేజి జంక్షన్‌కు ఆనుకొని విలువైన స్వామివారి భూములను కొందరు విక్రయించారని సమాచారం. చోడవరం మండలంలో 26 ఎకరాల భూములలోను కొంత భూ మిపై రైతులు తమదేనని పోరాడుతున్నట్లు దేవదాయ, దర్మాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా విలువైన స్థలాలు వివాదాల్లోను, కోర్టు కేసుల్లోను, అమ్మకాల్లోను ఉన్నందున హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధికి ఆటంకంగా మారింది. కోట్లలో విలువున్న హేమగిరి సత్యనారాయణస్వామి దేవస్థానం భూ ములను రక్షించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. అక్రమార్కుల కన్ను హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం భూములపై అక్రమార్కుల కన్నుపడింది. దశాబ్దాల నుంచి ఈ భూములపై కన్నేసిన కొందరు ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఇదే సమయంలో సం బంధిత శాఖ తమకేమి పట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. స్థలాలను ఆక్రమించి తమ పని కానిచ్చేసిన తరువాత దేవాదాయ శాఖ బోర్డులు పెట్టడంతోనే సరిపెడుతున్నారు. -
‘ఓటుకు నోటు’పై మల్లగుల్లాలు
ఏసీబీ నోటీసులు ఇస్తే ఎలా స్పందించాలని యోచిస్తున్న బాబు? ♦ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించేది ఎలా? ♦ రహస్య దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయం ♦ ఐజీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు తదుపరి చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతుండటంతో తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి, కేంద్రం సహకారం అర్థించడానికి తెరపైకి తీసుకువచ్చిన ట్యాపింగ్ ఆరోపణల్ని నిరూపించడం ఎలా? అనే అంశంపైనా దృష్టి కేంద్రీకరించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ పోలీసు, నిఘా, ఏసీబీకి చెందిన ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇందులోనే ‘ఓటుకు నోటు’ పూర్వాపరాలు రహస్యంగా దర్యాప్తు చేయించేందుకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరుల అరెస్టు తరవాత ‘ఓటుకు నోటు’ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు, ఏసీబీ కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాలతో వచ్చేవారం న్యాయస్థానంలో సమగ్ర నివేదిక సమర్పించడానికి తెలంగాణ ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోపాటు ఫోన్ సంభాషణల ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతోపాటు మరికొందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు అనుమతి కోరుతూ మెమో దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా నోటీసులు జారీ చేస్తే వాటిని తీసుకోవాలా? తిరస్కరించాలా? అనే అంశంపై శుక్రవారం నాటి సమావేశంలో సీఎం ప్రధానంగా చర్చించారని తెలిసింది. అసలు నోటీసులు తీసుకోకుండా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అధికారులు, నిపుణులతో చెప్పినట్లు సమాచారం. అయితే అలా ఉండటం సాధ్యంకాదని వారు సీఎంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు గరిష్టంగా మూడు నోటీసులు జారీ చేస్తారని, అజ్ఞాతంలో లేకుండా అందుబాటులో ఉన్న నిందితుడు వీటిలో ఏ ఒక్కటీ తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎంకు వివరించినట్లు తెలిసింది. అదే జరిగితే ఏసీబీ అధికారులు న్యాయస్థానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళి చట్టప్రకారం తదనంతర చర్యలకు ఉపక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. నోటీసులు తీసుకోకుండా ఉండటం కంటే... తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా స్టేకు ప్రయత్నిస్తే ఉత్తమమని న్యాయ నిపుణులు సీఎంకు సూచించారు. విషయం స్టే వరకు వెళ్తే నేరం అంగీకరించినట్లు అవుతుందని సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో కొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. సుదీర్ఘ చర్చోపర్చల అనంతరం నోటీసులు తీసుకుని, న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరికొందరు నిపుణులు, న్యాయవాదుల్ని సంప్రదించిన తరవాత తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు చేసినందున ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా కొన్ని ఆధారాలు సేకరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికోసం అత్యంత రహస్యంగా దర్యాప్తు చేసేందుకు నిఘా విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ బృందానికి ఏ దశలోనూ ఎలాంటి ఆటంకాలూ కలిగించవద్దని, అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందించాల్సిందిగా పోలీసు, నిఘా విభాగాల్లోని అన్ని వింగ్స్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
చెల్లిద్దాం.. తొందరేముంది!
గద్వాలటౌన్: అడిగేవారు ఎవరున్నారని అనుకున్నారో.. లేక తొందరేముందని భావించా రో తెలియదు కానీ గద్వాల మునిసిపాలిటీలో పేరుకుపోయిన మొండి బకాయిల అద్దెలు అ సలు వసూలు కావడం లేదు. నోటీసులు జారీ చేస్తున్నా.. దుకాణాదారులు పెడచెవిన పెడుతున్నారు. ఈ ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతుంది. ఇలా ఇప్పటివరకు అద్దెబకాయిలు రూ.20లక్షల వరకు పేరుకుపోయాయి. పట్టణంలో కొందరు బడా వ్యాపారు లు, రాజకీయ నాయకుల సహకారంతో సకాలంలో దుకాణాల అద్దెలు చెల్లించడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైంది. గద్వాల మునిసిపల్ పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. ‘ఏ’ నుంచి ‘హెచ్’ బ్లాక్ వరకూ, స్పోర్ట్స్ అకాడమి, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, కళాశాల మార్గంలో ఉ న్న ప్రధాన రహదారుల పక్కన వీటిని నిర్మిం చారు. కొన్ని దుకాణా సముదాయాలకు 25 ఏళ్ల లీజు అగ్రిమెంట్ పూర్తయింది. మరికొన్ని దుకాణా సముదాయాలకు 20ఏళ్ల క్రితమే వే లం నిర్వహించి అద్దెలకు ఇచ్చారు. అప్పుడు కేటాయించిన దుకాణాలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేస్తున్నారు. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడేళ్లకు పెంచకుండా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తూ మునిసిపాలిటీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం! పాత బస్టాండ్ చౌరస్తా, మునిసిపల్ కార్యాల యం పక్కన నిర్మించిన నూతన సముదాయంలో 53 దుకాణాలు ఉన్నాయి. రెండేళ్ల క్రి తం గుడ్‌విల్ వేలం పాట ద్వారా అద్దెకు ఇచ్చా రు. రిజర్వేషన్ దుకాణాలు తప్పిస్తే...అప్పట్లో ఉన్న అద్దె కనిష్టంగా రూ.7వేలు, గరిష్టంగా రూ.27వేలుగా దుకాణదారులు వేలం పాడా రు. వేలం పాట తరువాత ఒకరిద్దరు తప్పిస్తే దాదాపు 45 మంది దుకాణదారులు అద్దెలు చెల్లించడం లేదు. ఏ, ఈ, ఎఫ్, జీ, హెచ్, బ్లాక్‌లలోని దుకాణాల అద్దెలు మొదట నిర్ణయించిన విధంగానే ఉండడం వల్ల వాటిని మదింపు చేశారు. మార్కెట్ విలువ ఆధారంగా ఖరారుచేశారు. దీంతో గరిష్టంగా దుకాణం అద్దె రూ.10వేలుగా నమోదైంది. గత కొన్ని నెలలుగా అద్దె వసూళ్లకు వెళ్లిన మునిసిపల్ సిబ్బంది పట్ల దుకాణదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ‘సి’ బ్లాక్‌లోని 46 దుకాణాల లీజు అగ్రిమెంట్ పూర్తయిందని.. వెంటనే దుకాణాలను ఖాళీ చేయాలని అధికారులు కొన్ని నెలల క్రితం నోటీసులు జారీచేశారు. వ్యాపారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బకాయిల వసూలుకు స్పెషల్‌డ్రైవ్ మునిసిపల్ పరిధిలోని ఐడీఎస్ఎంటీ దుకాణాల అద్దె బకాయిల వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామని కమిషనర్ ఇసాక్అబ్ఖాన్ తెలిపారు. గత నాలుగు రోజులుగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టామన్నారు. సిబ్బందికి లక్ష్యాలను నిర్ధేశించి బకాయిలు వసూలు చేస్తున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌కు వ్యాపారుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీచేశామని, అద్దెలు చెల్లించకుంటే దుకాణాలకు తిరిగి వేలం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. -
అనధికారిక నివాసంపై 16 మంది మాజీ మంత్రులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాల్లో అనధికారికంగా నివాసముంటున్న 16 మంది కేంద్ర మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. లోక్‌సభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు వెంకయ్య లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అనధికారికంగా నివాసముంటున్న మాజీ మంత్రులు జూలై 27 వరకు డ్యామేజీ చార్జీల కింద రూ. 20,92,463 చెల్లించాల్సి ఉంటుందన్నారు. టైపు-5 బంగళకు రూ. 53,250 నుంచి టైపు-3 బంగ్లాకు రూ.2,43,678 వరకు చార్జీలు ఉన్నట్టు తెలిపారు. అనధికారికంగా నివాసముంటున్న వారిలో మాజీ మంత్రులు కపిల్ సిబల్, అజిత్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, బేణీ ప్రసాద్‌వర్మ, పల్లంరాజు, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, మానిక్రావ్ హోదయ్ గవిత్ ఉన్నారు. జనరల్ పూల్ కోటా కింద నివాసముంటున్న వారిలో ఎ.కె.ఆంటోనీ, ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, వీరప్పమొయిలీ, కె.చిరంజీవి, జేడీ శీలం తదితరులు ఉన్నారు. వీరికి ఖాళీ చేయడానికి 15 రోజుల గడువు ఇచ్చారు. కాగా, తనకు కేటాయించిన భవనాన్ని ఐదు రోజుల క్రితమే ఖాళీ చేశానని మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలిపారు. -
చంద్రబాబు చిన్నచూపు
సాక్షి, కాకినాడ : చంద్రబాబు ప్రభుత్వం రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి పేరుకుపోయిన నీటితీరువా వసూలుకు ఆదేశాలు జారీ చేసింది. పంటకాలువలో నీటిని ఉపయోగించుకునే ప్రాంతాన్ని బట్టి తీరువా నిర్ణయిస్తారు. మొదటి రెండు పంటల కాలాన్నీ కలిపి ఒక ఫసలి అంటారు. జూలై 1 నుంచి 1424వ ఫసలి సీజన్ ప్రారంభమైంది. ఎకరాకు రబీలో రూ.200, ఖరీఫ్‌లో రూ.150 చొప్పున తీరువా వసూలు చేస్తుంటారు. పంటకాలం ముగిశాక రెండుపంటలకు సంబంధించి రూ.350 వసూలుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తుంటారు. నీటితీరువాకు సంబంధించి ఏడాది వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఆ తర్వాత మాత్రం రూ.6 చొప్పున వడ్డీ వసూలుచేస్తుంటారు. ఏటా పేరుకుపోయే బకాయిలను ఆ ఏడాది కొత్తగా రూ.6 చొప్పున వడ్డీ లెక్కగట్టి నోటీసులిస్తుంటారు. గత ఐదేళ్లుగా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పగబట్టినట్టు ఏటా వరదలు, తుపాన్లు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం రైతుల పరిస్థితిని దయనీయంగా మార్చాయి. గత ఏడాది సుమారు 4 నెలలు సాగిన సమైక్య ఉద్యమం, అనంతరం వరుసగా జరిగిన ఎన్నికలతో నీటితీరువా వసూళ్లకు బ్రేక్ పడింది. దీంతో బకాయిలు కోట్లలో పేరుకు పోయాయి. ప్రస్తుతం పాతబకాయిలు (1422వ ఫసలి వరకు) రూ.20,98,53,000 ఉంటే వడ్డీ రూ.కోటి 33లక్షల 48వేల వరకు ఉంది. ఇక గడిచిన ఖరీఫ్-రబీ పంటకాల పు నీటితీరువా(1423 ఫసలి సీజన్) మొత్తం మరో రూ.11 కోట్ల 25 లక్షల 43 వేల వరకు ఉంది. అంటే వడ్డీతో సహా పేరుకుపోయిన పాత బకాయిలు, 1423 ఫసలి సీజన్‌తో కలిపి మొత్తం రూ.33 కోట్ల 57లక్షల 44 వేల వరకు ఉంది. ఈ బకాయిల మొత్తాన్ని వసూలు చేసే లక్ష్యంతో గ్రామ రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులిస్తున్నారు. అసలే పుట్టెడుకష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాల్సింది పోయి ఇలా పాత బకాయిలన్నీ చెల్లించాలని వేధించడం ఎంతవరకు సమంజసమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా నాన్చుతున్న చంద్రబాబు ప్రభుత్వం నీటి తీరువా వసూలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. డివిజన్ల వారీ బకాయిలిలా.. కాకినాడ డివిజన్లో పాత బకాయిలు రూ.4కోట్ల 26లక్షలుంటే వడ్డీ రూ.26.04లక్షల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి కోటి 89లక్షల 91వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 40లక్షల 71వేల వసూలుకు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రాజమండ్రి డివిజన్లో పాత బకాయిలు రూ.కోటి 89లక్షల 15వేలుంటే వడ్డీ రూ.12లక్షల 49 వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.93లక్షల 67 వేలు కలుపుకొని రూ.2 కోట్ల 95లక్షల 31వేల వసూలుకు నోటీసులిస్తున్నారు.అమలాపురం డివిజన్లో పాతబకాయిలు రూ.3కోట్ల 50 లక్షలు, 22వేలుంటే వడ్డీ రూ.23 లక్షల 99 వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.3కోటి 15లక్షల 85వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 90లక్షల 6 వేల వరకు ఉంది. రామచంద్రపురం డివిజన్లో పాత బకాయిలు రూ.5కోట్ల 74లక్షల 29వేలుంటే వడ్డీ రూ.35లక్షల 16వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.3కోట్ల 96లక్షల 58వేలు కలుపుకొని మొత్తం రూ.10 కోట్ల 06లక్షల 03వేల వరకు ఉంది. పెద్దాపురం డివిజన్లో పాత బకాయిలు రూ.5కోట్ల 43లక్షల 68 వేలుంటే వడ్డీ రూ.34లక్షల 84వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.కోటి 20లక్షల నాలుగువేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 98 లక్షల 56 వేల వరకు ఉంది. రంపచోడపురం డివిజన్లో పాత బకాయిలు రూ.16లక్షల 33వేలుంటే వడ్డీ రూ.96వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.9లక్షల 48వేలు కలుపుకొని మొత్తం రూ.26 లక్షల 77 వేల వరకు ఉంది.. -
ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు
అలహాబాద్:ప్రధాని నరేంద్రమోడీకి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోడీ ఎన్నికవ్వడం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈ నోటీసులిచ్చింది. వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజయ్‌రాయ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన వీటిని జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో భార్య యశోదా పాన్ కార్డు వివరాల కాలమ్‌ను మోడీ ఖాళీగా వదిలేశారని, ఎన్నికల్లో రూ. 70 లక్షలకు మించి ఖర్చు చేశారని అజయ్ ఆరోపించారు. -
ఖర్చుల వివరాలు అందించకుంటే నోటీసులు
ఒంగోలు కలెక్టరేట్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకుంటే నోటీసులు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(వ్యయం) పీకే దాస్ ఆదేశించారు. ఎన్నికల వ్యయంపై న్యూఢిల్లీలోని నిర్వచన్ భవన్ నుంచి బుధవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అందించని అభ్యర్థులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పెయిడ్ న్యూస్ ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చులో చూపించాలన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఖర్చుల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేశాం : కలెక్టర్ విజయకుమార్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయ వివరాలు అందించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసినట్లు పీకే దాస్‌కు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 187 మంది అభ్యర్థులు పోటీచేయగా 181 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించారన్నారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీచేయగా, 25 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించినట్లు చెప్పారు. ఎన్నికల వ్యయ వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అజయ్‌కుమార్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజన్, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మోహిత్‌విశ్వ, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు రోహిత్‌రాజ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు
నల్లజర్ల రూరల్ : ఫోర్జరీ డాక్యుమెంట్లకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారంలో నల్లజర్ల తహసిల్దార్‌గా పనిచేసిన డీవీ సుబ్బారావు, వీఆర్వోలు అద్దంకి వరప్రసాద్, ఆర్ వీ శ్రీనివాస్‌లకు ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం గుండేపల్లిలో 2013 ఫిబ్రవరిలో కొంతమంది రైతుల భూము లు వారికి తెలియకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలతో వేరొకరికి రిజిస్ట్రేషన్ అయిపోయూయి. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు భూసేకరణ సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది మే 23వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అప్పటి తహసిల్దార్ కె.పోసియ్య, ఆర్ఐ పోతురాజు విచారణ చేశారు. కొత్త వ్యక్తుల పేర్లతో వెలుగులోకి.. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం సేకరించిన భూములపై గెజిట్ పబ్లికేషన్ జాబి తాలో కొత్త వ్యక్తుల పేర్లు ఉండటంతో అసలు రైతులు ఆరా తీశారు. ఆర్ఎస్ నంబరు 351బై1ఎలో రైతులు ఆలపాటి శివరామకృష్ణ, అయినాల రాజారావులకు చెందిన 4.35 సెంట్లు భూమిని అదే గ్రామానికి చెందిన ఎటువంటి భూములు లేని ఈదరాడ రామబ్రహ్మం, జొన్న వెంకటేశ్వరరావు పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు సృష్టించి వారితోనే ఆరెళ్ళ రం గారావు, కంకటాల భూషణరావు పేర రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూములు కోల్పోయిన నిర్వాసితుల జాబితాలో వీరి పేర్లే ఉండడంతో దానిపై మార్చి 3న రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. విచారణలో ఈ విషయాలన్నీ నిజమని వెల్లడయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో రికార్డులను తారుమారు చేసిన అప్పటి వీఆర్వో అద్దంకి వరప్రసాద్, మరో వీఆర్వో ఆర్వీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఒక్కొక్కటిగా.. మండల రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారుు. ఆర్ఎస్ నంబరు 84లో మందపాటి వెంకట్రామయ్య, దొడ్డిపట్ల వీరయ్య, మాండ్రాజు వెంకన్న, పెనుమత్స బద్రా యమ్మలకు చెందిన 6 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతమైనట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందారుు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. విచారణలో వెల్లడైన విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని, ఫోర్జరీ పాస్ పుస్తకాలు రద్దు చేస్తామని విచారణ అధికారి కె.పోసియ్య అప్పట్లో ప్రకటించారు. -
10 మంది వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు
తెర్లాం రూరల్: నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరించారు. స్థానిక తహశీల్ధార్ కార్యాల యంలో గురువారం నీటితీరువా వసూళ్ల పై గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారీగా నీటి తీరువాల లక్ష్యం, వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 10 మంది వీఆర్ఓలకు షోకా జ్ నోటీసులు జారీ చేశారు. తెర్లాంలోని ఇద్దరు వీఆర్ఓలు, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం, కాగాం, అరసబలగ, కుసుమూరు, నందిగాం, గంగన్నపాడు గ్రామాల వీఆర్ఓలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరిపి కృష్ణమూర్తి సబ్ కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులు అందజేశారు. పార్వతీపురం డివిజన్లో రూ.11.22 కోట్ల నీటితీరువా బకాయిలు.. పార్వతీపురం డివిజన్లో నీటితీరువా బకాయిలు 11.22 కోట్ల రూపాయలు ఉందని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. వీఆర్ఓల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డివిజన్లో రూ.కోటీ 66 లక్ష ల నీటితీరువా వసూళ్లు లక్ష్యం కాగా ఇం తవరకు రూ.24 లక్షలే వసూలయ్యూయని తెలిపారు. తెర్లాం మండలంలో రూ.48 లక్షలు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.8 లక్షలు మాత్రమే వసూలైందని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్లో ఐదు రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని చనిపోయిన డీలర్ల వారసులతో భర్తీ చేయనున్నామని చెప్పారు. ఏడో విడత భూ పం పిణీకి అవసరమైన భూములు గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెర్లాం డిప్యూటీ తహశీల్దార్ రామస్వామి, ఆర్ఐ కృష్ణమూర్తి, సీనియర్ సహాయకుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పాల్వాయి, రాజేశ్వర్లకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్లకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నోటీసులు ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. తక్షణమే వివరణ ఇవ్వడంతోపాటు అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సభ్యులు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై వారికి నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ఏ నాయకుడికైనా షోకాజు నోటీసు జారీ చేస్తే రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటారు. అయితే ఎన్నికల సమయంలో ఆ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. షోకాజ్ నోటీసులతో సంబంధం లేకుండా పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించే అధికారం టీపీసీసీకి ఉంది. అయితే, పాల్వాయి సీనియర్ నేత, ఎంపీ కూడా. రాజేశ్వర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచన మేరకు ఇరువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మాత్రమే టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పరిమిత మైంది. ‘మా నోటీసులకు వెంటనే వివరణ ఇస్తూ.. పార్టీ అభ్యర్థులకు సహకరిస్తే ఎలాంటి చర్యా ఉండదు. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే మాత్రం సస్పెండ్ చేసేందుకూ వెనుకాడం’ అని క్రమశిక్షణా సంఘం సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. -
అద్దె చెల్లించండి..!
న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాల్లోనే ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కిరణ్ వాలియా, అరవింద్ సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్‌లకు కూడా తాఖీదులు పంపింది. అనధికారికంగా ఉంటున్నందున మార్కెట్ ధర ప్రకారం షీలా దీక్షిత్ రూ. 3.25 లక్షలు, కిరణ్ వాలియా రూ. 5.8 లక్షలు, అర్విందర్‌సింగ్ లవ్లీ రూ. 6.5 లక్షలు, హరూన్ యూసుఫ్ రూ. 2.9 లక్షల అద్దె చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. వీరిలో షీలాదీక్షిత్, కిరణ్ వాలియాలు ఈ నెలారంభంలోనే తమ అధికారిక నివాసాలను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నన్ని రోజులకుగాను అద్దె నిర్ణయించి, నోటీసులు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా లవ్లీ, యూసుఫ్‌లు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై తూర్పు ఢిల్లీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, లవ్లీ, యూసుఫ్‌లు నివసిస్తున్న అధికారిక నివాసాలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు. ఈ విషయమై ఎస్టేట్ అధికారి నుంచి వివరణ కోరామని, అప్పటి వరకు వేచిచూస్తామన్నారు. వారి వివరణ ఆధారంగానే లవ్లీ, యూసుఫ్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి నివాసాలను ఆక్రమించుకునేందుకు నెల రోజులు పడుతుందన్నారు. నిబంధనల ప్రకారం పదవులకు రాజీనామా చేసిన తర్వాత 15 రోజులకు మించి అధికారిక నివాసాల్లో ఉండరాదని, ఆరు నెలల వరకు ఉండే అవకాశమున్నా మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుందని, అందుకే ఐదుగురు కాంగ్రెస్ నేతలకు అద్దె చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. అందిన సమాచారం ప్రకారం ఇంతకుముందే షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నుంచి నోటీసులు అందాయని, అందుకే ఆమె ఖాళీ చేశారు. దీంతో కిరణ్ వాలియా కూడా షీలా సూచనల మేరకు ఖాళీ చేశారు. దీంతో ప్రజాపనుల విభాగం అధికారుల దృష్టి ఇప్పుడు లవ్లీ, యూసుఫ్‌లపై పడింది. మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించి ఆరు నెలలు ఉంటారా? ఖాళీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.