అద్దె చెల్లించండి..!
Published Tue, Feb 25 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాల్లోనే ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కిరణ్ వాలియా, అరవింద్ సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్‌లకు కూడా తాఖీదులు పంపింది. అనధికారికంగా ఉంటున్నందున మార్కెట్ ధర ప్రకారం షీలా దీక్షిత్ రూ. 3.25 లక్షలు, కిరణ్ వాలియా రూ. 5.8 లక్షలు, అర్విందర్‌సింగ్ లవ్లీ రూ. 6.5 లక్షలు, హరూన్ యూసుఫ్ రూ. 2.9 లక్షల అద్దె చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. వీరిలో షీలాదీక్షిత్, కిరణ్ వాలియాలు ఈ నెలారంభంలోనే తమ అధికారిక నివాసాలను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నన్ని రోజులకుగాను అద్దె నిర్ణయించి, నోటీసులు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా లవ్లీ, యూసుఫ్‌లు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై తూర్పు ఢిల్లీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, లవ్లీ, యూసుఫ్‌లు నివసిస్తున్న అధికారిక నివాసాలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు.
ఈ విషయమై ఎస్టేట్ అధికారి నుంచి వివరణ కోరామని, అప్పటి వరకు వేచిచూస్తామన్నారు. వారి వివరణ ఆధారంగానే లవ్లీ, యూసుఫ్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి నివాసాలను ఆక్రమించుకునేందుకు నెల రోజులు పడుతుందన్నారు. నిబంధనల ప్రకారం పదవులకు రాజీనామా చేసిన తర్వాత 15 రోజులకు మించి అధికారిక నివాసాల్లో ఉండరాదని, ఆరు నెలల వరకు ఉండే అవకాశమున్నా మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుందని, అందుకే ఐదుగురు కాంగ్రెస్ నేతలకు అద్దె చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. అందిన సమాచారం ప్రకారం ఇంతకుముందే షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నుంచి నోటీసులు అందాయని, అందుకే ఆమె ఖాళీ చేశారు. దీంతో కిరణ్ వాలియా కూడా షీలా సూచనల మేరకు ఖాళీ చేశారు. దీంతో ప్రజాపనుల విభాగం అధికారుల దృష్టి ఇప్పుడు లవ్లీ, యూసుఫ్‌లపై పడింది. మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించి ఆరు నెలలు ఉంటారా? ఖాళీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Advertisement