సాక్షి, కాకినాడ : చంద్రబాబు ప్రభుత్వం రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి పేరుకుపోయిన నీటితీరువా వసూలుకు ఆదేశాలు జారీ చేసింది. పంటకాలువలో నీటిని ఉపయోగించుకునే ప్రాంతాన్ని బట్టి తీరువా నిర్ణయిస్తారు. మొదటి రెండు పంటల కాలాన్నీ కలిపి ఒక ఫసలి అంటారు. జూలై 1 నుంచి 1424వ ఫసలి సీజన్ ప్రారంభమైంది. ఎకరాకు రబీలో రూ.200, ఖరీఫ్‌లో రూ.150 చొప్పున తీరువా వసూలు చేస్తుంటారు. పంటకాలం ముగిశాక రెండుపంటలకు సంబంధించి రూ.350 వసూలుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తుంటారు. నీటితీరువాకు సంబంధించి ఏడాది వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఆ తర్వాత మాత్రం రూ.6 చొప్పున వడ్డీ వసూలుచేస్తుంటారు.
ఏటా పేరుకుపోయే బకాయిలను ఆ ఏడాది కొత్తగా రూ.6 చొప్పున వడ్డీ లెక్కగట్టి నోటీసులిస్తుంటారు. గత ఐదేళ్లుగా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పగబట్టినట్టు ఏటా వరదలు, తుపాన్లు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం రైతుల పరిస్థితిని దయనీయంగా మార్చాయి. గత ఏడాది సుమారు 4 నెలలు సాగిన సమైక్య ఉద్యమం, అనంతరం వరుసగా జరిగిన ఎన్నికలతో నీటితీరువా వసూళ్లకు బ్రేక్ పడింది. దీంతో బకాయిలు కోట్లలో పేరుకు పోయాయి.
ప్రస్తుతం పాతబకాయిలు (1422వ ఫసలి వరకు) రూ.20,98,53,000 ఉంటే వడ్డీ రూ.కోటి 33లక్షల 48వేల వరకు ఉంది. ఇక గడిచిన ఖరీఫ్-రబీ పంటకాల పు నీటితీరువా(1423 ఫసలి సీజన్) మొత్తం మరో రూ.11 కోట్ల 25 లక్షల 43 వేల వరకు ఉంది. అంటే వడ్డీతో సహా పేరుకుపోయిన పాత బకాయిలు, 1423 ఫసలి సీజన్‌తో కలిపి మొత్తం రూ.33 కోట్ల 57లక్షల 44 వేల వరకు ఉంది. ఈ బకాయిల మొత్తాన్ని వసూలు చేసే లక్ష్యంతో గ్రామ రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులిస్తున్నారు. అసలే పుట్టెడుకష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాల్సింది పోయి ఇలా పాత బకాయిలన్నీ చెల్లించాలని వేధించడం ఎంతవరకు సమంజసమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా నాన్చుతున్న చంద్రబాబు ప్రభుత్వం నీటి తీరువా వసూలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మండిపడుతున్నారు.
డివిజన్ల వారీ బకాయిలిలా..
కాకినాడ డివిజన్‌లో పాత బకాయిలు రూ.4కోట్ల 26లక్షలుంటే వడ్డీ రూ.26.04లక్షల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి కోటి 89లక్షల 91వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 40లక్షల 71వేల వసూలుకు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రాజమండ్రి డివిజన్‌లో పాత బకాయిలు రూ.కోటి 89లక్షల 15వేలుంటే వడ్డీ రూ.12లక్షల 49 వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.93లక్షల 67 వేలు కలుపుకొని రూ.2 కోట్ల 95లక్షల 31వేల వసూలుకు నోటీసులిస్తున్నారు.అమలాపురం డివిజన్‌లో పాతబకాయిలు రూ.3కోట్ల 50 లక్షలు, 22వేలుంటే వడ్డీ రూ.23 లక్షల 99 వేల వరకు ఉంది.
1423 ఫసలికి సంబంధించి రూ.3కోటి 15లక్షల 85వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 90లక్షల 6 వేల వరకు ఉంది. రామచంద్రపురం డివిజన్‌లో పాత బకాయిలు రూ.5కోట్ల 74లక్షల 29వేలుంటే వడ్డీ రూ.35లక్షల 16వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.3కోట్ల 96లక్షల 58వేలు కలుపుకొని మొత్తం రూ.10 కోట్ల 06లక్షల 03వేల వరకు ఉంది. పెద్దాపురం డివిజన్‌లో పాత బకాయిలు రూ.5కోట్ల 43లక్షల 68 వేలుంటే వడ్డీ రూ.34లక్షల 84వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.కోటి 20లక్షల నాలుగువేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 98 లక్షల 56 వేల వరకు ఉంది. రంపచోడపురం డివిజన్‌లో పాత బకాయిలు రూ.16లక్షల 33వేలుంటే వడ్డీ రూ.96వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.9లక్షల 48వేలు కలుపుకొని మొత్తం రూ.26 లక్షల 77 వేల వరకు ఉంది..
చంద్రబాబు చిన్నచూపు
Published Sun, Jul 27 2014 11:57 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement