ఎవరికి వారే యమునా తీరే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారడం లేదు. అధికారంలో ఉన్నన్నాళ్లు గ్రూపు తగాదాలతో ఎవరికివారే పార్టీపై పట్టు సాధించేలా వ్యవహరించిన ఆ పార్టీ నాయకులు ప్రతిపక్షంలోకి వచ్చినా అదే రీతిలో ముందుకెళుతున్నారు. అత్యంత ప్రాధాన్యంగల ప్రతిపక్షనేత పదవి జిల్లాకు దక్కింది. ఆ పదవిలో ఉన్న నేతను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ జిల్లా నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యానాలు చర్చనీయాంశమవుతున్నాయి. సీఎల్పీ నేత జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎంపీ పాల్వాయి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి మాట్లాడిన తీరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి అద్దం పడుతున్నాయి. ఇంకా జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపుల గోల సమసిపోలేదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ‘హస్త’వాసి మారదని స్పష్టం చేస్తున్నాయి.
కమర్షియల్ లీడర్..
సీఎల్పీ నేత జానారెడ్డిని ఉద్దేశించి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంపీ పాల్వాయి గోవర్దనరెడ్డి జానాను నేరుగా విమర్శిస్తున్నారు. సీఎల్పీని నడిపించడానికి నిస్వార్థ నేతలు కావాలని, జానాలాంటి కమర్షియల్ లీడర్ కాదని ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రకాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. గవర్నర్లను కలిసి, వినతిపత్రాలు సమర్పిస్తే సరిపోదని, సొంతంగా ఎదిగిన నేతలే ప్రజాఉద్యమాలు నిర్మించగలరని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్‌లో జానా ఎదుగుదలనే ప్రశ్నించారనే భావన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏకంగా జానాను ఆ పదవినుంచి తొలగించి, కరీంనగర్‌కు చెందిన జీవన్‌రెడ్డిని నియమించాలని కూడా డిమాండ్ చేశారాయన.
ఇక, కోమటిరెడ్డి మాటలను పరిశీలిస్తే నిత్యం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జానారెడ్డికి హితవు చెప్పేందుకే ఆయన విలేకరులతో మాట్లాడినట్టు అర్థమవుతోంది. ప్రతిరోజూ టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ, కేసీఆర్‌పై దాడి చేసే విధానాన్ని కాంగ్రెస్ నేతలు మార్చుకోవాలని చెప్పిన కోమటిరెడ్డి... అసలు కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయత గల నేతలే లేరని, అందుకే తానే సొంతంగా ప్రజాసమస్యలపై ఉద్యమిస్తానని చెప్పడం ద్వారా అటు జానాతో పాటు ఇటు పొన్నాలపై కూడా ధిక్కార స్వరాన్ని వినిపించారు. మొత్తం మీద జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వారం రోజుల వ్యవధిలో ఆ ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ ఇటు జిల్లా పార్టీ, అటు టీపీసీసీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. మరో వారంరోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల లోగుట్టును పరిశీలిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది.
యమునా తీరేనా?
ఇక, జిల్లా పార్టీలో మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన ఐదుగురు ఎవరి రీతిలో వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతిరెడ్డిలు ఒక గ్రూపుగా, జానారెడ్డి ఆయన శిష్యుడు భాస్కరరావు మరో గ్రూపుగా, కోమటిరెడ్డి ఒక్కరే ఇంకో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా గతంలో ఎలా వ్యవహరించారో అదే పద్ధతిలో వెళుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అటు రాష్ట్ర, ఇటు జిల్లా స్థాయిలో టీడీపీ నేతలు ఏకతాటిపై నడుస్తూ పార్టీ శ్రేణుల్లో కొంత నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తుండగా, జిల్లాలో మంచి పట్టున్న కాంగ్రెస్ నేతలు మాత్రం సమన్వయ లేమితో వ్యవహరించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీగా ప్రజాసమస్యలపై స్పందించి, నేతలంతా సమన్వయంతో ముందుకెళ్లాలన్నది వారి భావన. కానీ, అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో సగటు కాంగ్రెస్ వాది ఆశ నెరవేరుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.