వేగంగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త
నల్గొండ జిల్లా : రోడ్డుపై అతి వేగంగా వెళ్లేవారికి హెచ్చరిక. అతి వేగంతో వెళ్లేవారిని అదుపుచేయడం కోసం నల్గొండ పోలీసులు ప్రత్యేక వాహనాన్ని తెప్పించారు. వేగంగా వెళ్లేవారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా వారి వల్ల ఎదుటి వారికి కూడా ప్రాణనష్టం జరుగుతోంది. ఇటువంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం నల్గొండ పోలీసులు ఈ 'ఇంటర్సెప్టర్' వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అతివేగంతో వెళ్తున్న వాహనాలను కిలోమీటర్ దూరం నుంచే పసిగట్టడం ఈ వాహనం స్పెషల్. సుమారు రూ.30 లక్షలతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనంలో స్పీడ్‌ను గుర్తించే కెమెరాలతో పాటు అత్యవసర ప్రథమచికిత్స సామగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను ఇట్టే గుర్తించి తన కెమెరాలో బంధింస్తుంది. వాహనదారునికి జరిమానాతో పాటు శిక్షపడే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెబుతున్నారు. త్వరలో మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు ఎస్పీ తెలిపారు.