జూదం ఆడం, మద్యం అమ్మం
నారాయణఖేడ్ : గ్రామంలో జూదం ఆడమని మండలంలోని గంగాపూర్ వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో ఎవ్వరం జూదం ఆడమని, జూదం కొనసాగకుండా చూస్తామని తెలిపారు. దీంతో పాటు గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేదించారు. ఏ దుఖాణాల్లోనూ మద్యంను విక్రయించమని సూచించారు. గ్రామంలోని కిరాణ దుఖాణాలు, హోటళ్ళ యజమానులు సైతం హాజరై తమ తమ వ్యాపారాల్లో మద్యంను విక్రయించమని తెలిపారు. దీంతో పాటు గ్రామస్థులందరూ ఎస్‌ఐతో కలిసి మద్యం విక్రయించమని, జూదం ఆడమని తీర్మానం చేశారు.
నారాయణఖేడ్ ఎస్‌ఐ నరేందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌తోపాటు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు అందరూ కలిసి పంచాయతీ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేందర్ మాట్లాడుతూ వ్యసనాల కారణంగా కుటుంబాలు గుల్ల అవుతాయన్నారు. ఎవ్వరూ జూదం ఆడడం కానీ, మద్యం విక్రయాలు కానీ చేపట్టకూడదని అన్నారు. గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంపట్ల ఆయన అభినందించారు. వ్యసనాల కారణంగా గ్రామాల్లొ గొడవలకు ఆస్కారం ఉంటుందన్నారు. ఎలా వ్యసనాలకు దూరంగా ఉంటే గ్రామాలు సుభిక్షంగా విరాజిల్లుతాయని అన్నారు. గ్రామస్థులందరూ ఐక్యతతో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.