ఒకే ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌! | NAT-Exercise For Common Entrance Exam In Engineering | Sakshi

ఒకే ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌!

Published Tue, Nov 19 2019 4:31 AM | Last Updated on Tue, Nov 19 2019 5:46 AM

NAT-Exercise For Common Entrance Exam In Engineering - Sakshi

మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అనుసరిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) తరహాలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు మొదలుపెట్టింది. నీట్‌ విధానం విజయవంతం కావడంతో ఇంజనీరింగ్‌కు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో జాతీయస్థాయి పరీక్షల నిర్వహణకు ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న అంశం ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఏడాది కిందట ఎన్‌టీఏను ఏర్పాటు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ఏర్పాటైన వెంటనే ఇది సాధ్యం కాదన్న ఆలోచనతో గతేడాది ఈ అంశాన్ని పక్కన పెట్టింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షల విధానం, ఇంజనీరింగ్‌లో ప్రవేశాల విధానాలపై ఎన్‌టీఏ అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్రానికి రానుంది. – సాక్షి, హైదరాబాద్‌

జేఈఈ పరిధిలోకే అన్ని రాష్ట్రాలు..
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష విధానం అమల్లోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 యూనివర్సిటీలు ఈ ర్యాంకుల ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని యూనివర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలు చేపడుతున్నాయి. గతంలో గుజరాత్, మహారాష్ట్ర కూడా జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టినా 2016లో జేఈఈ మెయిన్‌ నుంచి వైదొలిగాయి.

తాజాగా ఎన్‌టీఏ ఆలోచనల నేపథ్యంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఒకే ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ద్వారా తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. జనవరిలో నిర్వహించబోయే జేఈఈ మెయిన్‌ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులను స్వీకరించినందున 2020–21 నుంచి ఇది అమల్లోకి రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈలోగా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందని భావిస్తున్నామని, ఏదైనా తేడా వచ్చినా 2021–22 నుంచి తప్పనిసరిగా దీని పరిధిలోకి రావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పారు.

40 లక్షల మందికి నిర్వహణ సాధ్యమయ్యేనా? 
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించిన టాప్‌ 2.40 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నారు. మొత్తానికి జేఈఈ మెయిన్‌ పరీక్షకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో తెలంగాణ నుంచి 75 వేల మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే జేఈఈ మెయిన్‌ పరీక్ష ర్యాంకుల ఆధారం గానే అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. అప్పు డు తెలంగాణ, ఏపీ నుంచే 3.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరుకానుండగా దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్‌ నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. అయితే అంత మందికి ఈ పరీక్ష నిర్వహణ ఆచరణ సాధ్యమవుతుందా లేదా అనే అంశంపైనా ఎన్‌టీఏ ఆలోచనలు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఆ తరువాత ఒకే పరీక్ష విధానాన్ని అమల్లోకి తెస్తే రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష రద్దు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement