excercise
-
అత్యంత అరుదైన పిల్లి.. అక్కడ మాత్రమే నివసిస్తాయట
ఇవి మీకు తెలుసా? ► ఐస్‌ల్యాండ్‌లో క్రిస్మస్ పండగ కానుకలుగా పుస్తకాలను ఒకరికి ఒకరు పంచుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రచురణ కర్తలు అత్యధిక సంఖ్యలో పుస్తకాలు అమ్ముతారు కాబట్టి దీనికి ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అని పేరు వచ్చింది. ►‘జిమ్నాస్టిక్స్’ అనేది పురాతన గ్రీకు పదం ‘జిమ్నాజీన్’ నుంచి పుట్టింది. దీని అర్థం నగ్నంగా వ్యాయామం చేయడం. యువకులకు యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చే విధానం ‘జిమ్నాజీన్’ కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ► ‘బే క్యాట్’ అనేది అత్యంత అరుదైన పిల్లి జాతి. ఇవి ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపంలో మాత్రమే నివసిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల వీటి సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదపు అంచున ఉన్నాయి. అంతరించి పోతున్న జాతుల జాబితాలో వీటిని చేర్చారు. -
శరీరానికి కావల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది, నాజుగ్గా మారుస్తుంది
‘ఆరోగ్యకరమైన జీవనానికి .. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి’ అనేది తెలిసిన మాటే. కానీ బిజీ లైఫ్‌లో అదే వీలు కావట్లేదని ఫీలయ్యేవారికి ఈ డివైజ్ భలే మంచి చాయిస్. ఎందుకంటే.. ఇది సమయం వృథా కాకుండా.. అందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. కూర్చున్నా, నిలుచున్నా ఫిట్‌నెస్సే మరి. ఈ డివైజ్ (ఎలక్ట్రో మజిల్స్ స్టిములేషన్ ఇన్హాన్స్ వైబ్రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్సర్సైజర్).. మిమ్మల్ని ఎల్లప్పుడూ నాజూగ్గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది. అదెలా అంటే.. దీనిపైన నిలబడి.. డివైజ్‌కి అమర్చిన ఎక్సర్సైజ్ బ్యాండ్స్‌ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తానికీ వైబ్రేషన్ పొందొచ్చు. దీనిపైన నిలబడితే.. బాడీ మొత్తంలో ఉండే కండరాల పనితీరు మెరుగుపడి.. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూనో.. కూరగాయలు తరుక్కుంటూనో.. ఇలా ఏ పని చేసుకోవాల్సి వచ్చినా ఆ పని చేసుకుంటూనే.. ఈ ఎక్సర్సైజర్ ప్రయోజనాలను పొందొచ్చు. చైర్లో కానీ.. సోఫాలో కానీ కూర్చుని.. కాళ్లను దీనిపై పెట్టుకుని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. రిమోట్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో 3 ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న అపార్ట్‌మెంట్స్‌లో కూడా సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది. ధర 458 డాలర్లు. అంటే 37,899 రూపాయలు. -
ఈ స్మార్ట్ డివైస్‌తో ఎవరైనా నాజుగ్గా తయారవ్వాల్సిందే
ఎన్ని చిట్కాలు పాటించినా.. ఎంత డైట్ ఫాలో అయినా.. శారీరక శ్రమ ఉంటేనే ఒంట్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అందుకే చాలా మంది ప్రతిరోజు వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి డైలీ వర్కౌట్స్ అన్నిటికీ చక్కటి ప్రత్యామ్నాయమే ఈ వెయిటెడ్ హూలా హూప్. దీన్ని నడుముకు బిగించుకుని.. ఒకే చోట స్థిరంగా నిలబడి కేవలం నడుముని మాత్రమే తిప్పితే.. నాజూగ్గా మారొచ్చు. ఈ స్మార్ట్ ఎక్స్ర్సైజ్తో నడుము, పొట్ట భాగాల్లోని కొవ్వు ఇట్టే కరుగుతుంది. రోజుకి 30 నిమిషాలు చేస్తే చాలు.. 180 నిమిషాల యోగా / 60 నిమిషాల సైక్లింగ్ / 60 నిమిషాల రన్నింగ్ చేసినంత ఫలితం దక్కుతుంది. ఇది అన్ని వయసుల వారికి ఉత్తమమైన వ్యాయామం.న్యూ అప్‌గ్రేడెడ్ డిజైన్‌తో రూపొందిన ఈ ‘హూలా హూప్ డివైస్.. మ్యాగ్నెటిక్ లాక్ సిస్టమ్‌తో సర్దుబాటు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. 13 నాట్స్‌తో ఉన్న ఈ టూల్‌ని 28 నాట్స్ దాకా అటాచ్ చేసుకుని.. లావుగా ఉన్న వాళ్లు కూడా వాడుకోవచ్చు. ప్రతి నాట్కి 24 మసాజ్ పాయింట్స్ ఉంటాయి. దీనికి వేల్లాడే ఒక వెయిట్ బాల్.. 360 డిగ్రీలు గిర్రున తిరుగుతూ ప్రతి మసాజ్ హెడ్‌ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో చుట్టూ పేరుకున్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. -
కొవ్వు ఎందుకు పెరుగుతుంది? తగ్గించాలంటే ఏమి చేయాలి?
మానవ శరీరంలో కొవ్వు కణాలను ఆడిపోసైట్స్ అంటారు. కొవ్వు కణాల సంఖ్య, బాల్యం , టీనేజ్ లో నిర్ధారణ అయిపోతుంది . అటుపై ఆ కణాల సంఖ్య పెరగదు .. తగ్గదు. కొవ్వు కణాలు తమ ఒరిజినల్ సైజు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పెరుగగలవు. అంటే ఊబకాయం ఉన్నవారిలో కొవ్వుకణాలు ఎక్కువగా వుండవు ; పెద్దవిగా ఉంటాయి . ఒక వ్యక్తి వ్యాయామం చేసి కండలు పెంచాడు . మరో వ్యక్తి బాగా తిని కొవ్వు పెంచాడు . అప్పుడు సైజు లో తేడా ఎలా ఉంటుంది ? ఒక కిలో కండ కన్నా, ఒక కిలో కొవ్వు అయిదు రెట్లు భారీగా ఉంటుంది. కండలు పెంచిన వారెవరూ భారీగా వుండరు . కొంత మంది కండలు, కొవ్వు రెండూ పెంచుతారు. అంటే.. విపరీతంగా తినడం అలాగే వీపరీతంగా వర్కవుట్ చేయడం. ఇలాంటి వారు కనిపించడానికి భారీగా వుంటారు. కేవలం కొవ్వు పెంచిన వారు మాత్రం దూది కొండలా వుంటారు. పురుషుల్లో కొవ్వు ఎక్కువగా కడుపు భాగంలో, స్త్రీలలో తుంటి, తొడలపై నిలువ ఉంటుంది. పశ్చిమ దేశాలలో ఎక్కువగా శ్వేత జాతి ప్రజలుంటారు, వారిలో అధిక తిండి తినే వారికి ఒళ్ళంతా కొవ్వే. అంటే అధిక కొవ్వు చర్మం కింద ఉంటుంది. దాంతో పాటు ఒళ్ళంతా కొవ్వు నిల్వ ఉంటుంది. అందుకే అమెరికన్లలో ఊబకాయం ఎక్కువ. ఊబ కాయస్థుల సంఖ్య కూడా ఎక్కువ. అదే భారతీయుల్లో కొవ్వు ఎక్కువగా ఉదరభాగంలో అంతకు మించి గుండె లాంటి అవయవాల చుట్టూరా పేరుకొని పోతుంది. దీన్ని విసెరల్ ఫాట్ అంటారు . ఇది ప్రమాదకరం. గుండెపోట్లకు దారి తీస్తుంది. వ్యాయామం లేకుండా కేవలం క్రాష్ డైట్ తో బరువు తగ్గించాలనుకొనే వారి కండరాలు బలహీనం అవుతాయి. ఇది మెటబాలిజం (జీవన చర్యలు) వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందువల్లే అలాంటి వారు కొన్నాళ్ల పాటు డైట్ నియమాలు పాటించి, అవి మానేసాక సులభంగా బరువు పెరిగిపోతారు. అనేక మంది హీరోయిన్ ల విషయం లో ఇదే జరుగుతోంది. బరువు తగ్గాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయడం అవసరం. ఇలాంటి శిక్షణ వల్ల గుండె కూడా దృఢం అవుతుంది. శరీరం లో ఒక భాగం లో కొవ్వు ఎక్కువ ఉందనుకొందాము. ఉదాహరణకు పొట్ట భాగంలో. నూటికి తొంబై మంది ఏమనుకొంటారంటే "పొట్ట కు సంబదించిన వర్కౌట్స్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరిగి పోతుంది". కానీ ఇలా ఒక భాగానికి సంబంధించిన వర్కౌట్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరగడం అంటూ ఉండదు. ఎప్పుడయితే వ్యాయామం ప్రారంభించామో ఒక పద్దతిలో శరీరం మొత్తం లోని కొవ్వు కరిగిస్తూ వస్తుంది. ఏ విధంగానయితే కొవ్వు కొద్దికొద్దిగా పెరుగుతుందో.. అదే విధంగా వ్యాయామం చేస్తున్న కొద్ది రివర్స్‌లో తగ్గుతూ వస్తుంది. కేవలం ఒక భాగంలోనే కొవ్వు హఠాత్తుగా తగ్గడం అంటూ ఉండదు. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కావాలి . శక్తి అవసరంలో యాబై శాతం మాత్రం కార్బ్స్ ద్వారా తీర్చాలి. కానీ మన సమాజం లో నూటికి తొంబై మంది ... 90 శాతం దాక శక్తి అవసరాలను కార్బ్స్ ద్వారా తీరుస్తున్నారు. ఇలా అధిక పిండి పదార్థాలు తినడం ఒక రకమైన అడిక్షన్ (వ్యసనం). కార్బ్స్ అంటే జంక్ ఫుడ్. మైదా పిండితో చేసే వస్తువులు, పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింక్స్, చాకోలేట్స్, కుకీలు, బ్రెడ్ ఇలా నోటికి రుచికరంగా ఉండే ఏవైనా వీటికిందకే వస్తాయి. తాగుబోతును మద్యం మానమంటే ఆ వ్యక్తికి కోపం వచ్చినట్టే ఈ అధిక పిండిపదార్థాలు తీసుకునే వ్యసన పరులకు అవి తినొద్దని చెబితే నచ్చదు. పైగా కోపం కూడా వస్తుంది. తాగుబోతు కనీసం తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకొంటాడు. కానీ అధిక కార్బ్స్ పోతులు తాము వ్యసనపరులు అని కూడా గ్రహించరు. పాపం. వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
మెడనొప్పి బాధిస్తుందా.. అయితే ఇలా చేయండి
ఇటీవలి కాలంలో మెడనొప్పి సమస్య చాలా మందిని వేధిస్తోంది. మెడనొప్పి ఉంటే ఏ పనులూ సరిగ్గా చేయలేం. ఈ మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా కారణాన్ని తెలుసుకుని, అందుకు తగ్గ చికిత్సను తీసుకుంటే మెడ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. ఆఫీసులో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వారు గంటల తరబడి కూర్చుని లాప్టాప్ లేదా కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి వస్తుంది. సాధారణంగా మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి వస్తుంది. చిన్న సమస్యే అని తేలిగ్గా తీసేస్తే సమస్య మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది. మెడ నొప్పికి కారణాలు: సరిగ్గా కూర్చోకపోవడం: కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువ సేపు ఉపయోగించేటప్పుడు సరిగ్గా కూర్చోకపోవడం వల్ల దీనివల్ల కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారితీస్తాయి. ఇది మెడనొప్పికి కారణమవుతుంది. గాయాలు: తల అకస్మాత్తుగా వెనుకకు, తరువాత ముందుకు కదిలినప్పుడు, నరాలు ఒత్తుకుపోవడం... వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. కీళ్ళు అరిగిపోవడం: శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సు వచ్చే కొద్దీ అరుగుతాయి. ఈ అరుగుదల వల్ల మెడ కదలికలు ప్రభావితం అవుతాయి. దీనివల్ల మెడనొప్పి వస్తుంది. ► అయితే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు సరైన భంగిమ: కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు భుజాలు తుంటిపై సమానమైన వాలులో ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమకోణంలో ఉండేట్టు చూసుకోవాలి. సెల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు మెడను వంచకూడదు. అలా వంచకూడదంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టాలి. అలాగే మీ వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. విరామం అవసరం: ఎక్కువసేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మెడను, భుజాలను బాగా కదిలించండి. అలాగే మీ శరీరాన్ని సాగదీయండి. భుజాలపై ఎక్కువ బరువును వేయద్దు: మీ భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్ ప్యాక్ లను మోయకండి. ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా. మెడ నొప్పి వస్తుంది. సౌకర్యంగా పడుకోవాలి: మీ తల, మెడ.. మీ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. మీ తలకింద పెద్ద సైజు దిళ్లను అసలే ఉపయోగించకండి. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించండి. కాళ్ల కింద దిండును వేసుకుంటే మంచిది. దీనివల్ల వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి. జీవనశైలిలో మార్పులు: ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఎక్కువగా తిరగండి. నడవండి. ధూమపానం అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మెడ నొప్పి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు: ఇంటి నుంచి పనిచేయడం లేదా ల్యాప్ టాప్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అయితే శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాల వల్ల మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వైద్యులు లేదా ఫిజియో థెరపిస్టులు చెప్పే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల మెడనొప్పి తొందరగా తగ్గుతుంది. కాపడం: మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, వాపు లేదా మంటను తగ్గించడానికి చల్లని లేదా హీట్ కంప్రెస్ రెండింటినీ ఉపయోగించొచ్చు. ఇది కండరాల సడలింపునకు సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అయితే ఈ టెక్నిక్ ను 20 నిమిషాల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. మసాజ్: మెడ నొప్పికి మసాజ్ థెరపీ వల్ల కండరాలను సడలించవచ్చు. తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మెడనొప్పి తగ్గడానికి నొప్పి నివారణ మందులు ఉంటాయి. అయితే అలా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్టులు తప్పవు. అందువల్ల మందులకు బదులు కొన్ని నొప్పి నివారణ చర్యలు, ఉపశమన చర్యలను పాటించడం మంచిది. -
చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్‌లతో చనిపోయే వారు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. కొద్దిరోజుల ముందు ప్రఖ్యాత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను మరవకముందే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఘటన అందరినీ కలచివేసింది. ఇద్దరిదీ చిన్న వయసే. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ, మంచి ఫిట్నెస్ను కలిగి ఉన్నవారే. వీళ్లకే ఇలా జరుగుతుంటే... సాధారణ ప్రజల పరిస్థితేమిటి అన్న ఆందోళన చాలామందిని వేధిస్తోంది. ఇలాంటి హార్ట్‌అటాక్‌లను సరిగ్గా గుర్తిస్తే.. వీలైనంత త్వరగా వైద్యసహాయం అందేలా జాగ్రత్త పడవచ్చు. మరణాలనూ నివారించవచ్చు. వాటిని గుర్తించడం ఎలాగో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలిపే కథనమిది. చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు ఆందోళన వద్దు... అప్రమత్తత మేలు! గతంలో 35 లోపు వయసున్న వారిలో గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్‌లు) అరుదు. నిజానికి కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌నూ సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఇవి సన్నబడతాయి. కొన్నిసార్లు మూసుకుపోతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గడం లేదా ఒక్కోసారి పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఆ సమయాల్లో ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను ‘యాంజినా/యాంజైనా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తసరఫరా జరగనప్పుడు గుండె కండరాలు చచ్చుపడిపోవడం మొదలవుతుంది. దాన్నే హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ – ఏఎమ్ఐ) అంటారు. అప్పుడు వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ కారణంగా... యాంజినల్ చెస్ట్ పెయిన్ (ఛాతీ నొప్పి) నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా సంభవించవచ్చు. ఇటీవల మన దేశంలోనూ 35 – 40 ఏళ్లలోపు వారికి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ బాగా పెరిగాయి. లక్షణాలు : గుండెపోటు లక్షణాలు పెద్దవయసు వారిలోనూ, చిన్నవయసు వారిలోనూ ఒకేలా ఉంటాయి. దీనిలో ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి. గమనించాల్సిన అంశమేమిటంటే.. చిన్నవయసు వారిలో నొప్పి తీవ్రత కాస్త ఎక్కువ. ఈ నొప్పినే ‘యాంజినా’ అంటారు. గుండెపోటు మరికొన్ని రకాలుగా కూడా వ్యక్తం కావచ్చు. ముఖ్యంగా ఈ నొప్పి మన ఒంట్లో... ►కింది దవడ మొదలుకొని... బొడ్డు వరకు ఎక్కడైనా కనిపించవచ్చు. ∙ఇది ఛాతీపై నొక్కిపట్టుకుంటున్నట్లుగా (స్క్వీజింగ్) వస్తుంటుంది. ∙ఛాతీపై పెద్ద బరువు ఉన్నట్లుగా, పాకుతున్నట్లుగా వస్తుంది. ∙ఒక్కోసారి ఛాతీలో మంటగా అనిపిస్తుంది. అందువల్లనే బాధితులు దాన్ని ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతుంటారు. త్వరగా గుర్తించేందుకు తోడ్పడే అంశాలు... ►ఛాతీపై ఒత్తిడి కలుగుతున్నట్లుగా / పట్టేసినట్టుగా / నొక్కినట్టుగా / మంటతో వచ్చే నొప్పి. ∙ఐదు నిమిషాల్లో నొప్పి తీవ్రత క్రమంగా పెరగడం. ∙నొప్పి విస్తరిస్తున్నట్లుగా రావడం. (కొందరిలో ఛాతీ ఎడమవైపు నొప్పి ఉంటేనే గుండెనొప్పిగా భావిస్తుంటారు. ఇది ఛాతీ మధ్యలోనూ వచ్చి, అన్ని వైపులకూ విస్తరించవచ్చు). ►ఛాతీ నొప్పి ప్రధానంగా ఎడమ భుజంలోకి, మెడలోకి, వీపులోకి పాకుతూఉండవచ్చు. ►నొప్పితో పాటు మరికొన్ని లక్షణాలూ కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది, చల్ల చెమటలు, అకస్మాత్తుగా నోరంతా వికారం. ►శారీరక శ్రమ తర్వాత నొప్పి పెరగడం లేదా ఛాతీ పట్టేసినట్టుగా కావడం. ►తీవ్రమైన ఉద్వేగానికి లోనైనప్పుడు లేదా విశ్రాంతి సమయంలో కూడా ఛాతీనొప్పి. ►చాలా అరుదుగా దవడ పై భాగంలోనూ నొప్పి రావచ్చు. కానీ ఈ లక్షణాన్ని చూసిన వెంటనే డాక్టర్లు దాన్ని గుండెపోటుగా పరిగణించకపోవచ్చు. ఇది అరుదు కావడంతో కొన్ని పరీక్షల తర్వాతే గుండెపోటును నిర్ధారణ చేస్తారు. కారణాలు : ► శారీరక శ్రమ లేకుండా కూర్చుని చేసే పనులు పెరగడంతో కొవ్వులు పేరుకుపోయి రక్తప్రవాహానికి అడ్డుపడే అవకాశాలు పెరుగుతున్నాయి. ►మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో 40 ఏళ్ల తర్వాతే కనిపించే ఈ ముప్పు ఇటీవల 25 నుంచి 30 ఏళ్లప్పుడే జరుగుతోంది. ►మారుతున్న ఆహారపు అలవాట్లు యువతను ప్రభావితం చేస్తున్నాయి. గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ తగ్గి, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వులైన ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగింది. ►యువతలో మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు అథెరో స్కి›్లరోసిస్కు దారితీస్తాయి. ►హైబీపీ కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది. గుండెపోటు ముప్పును పెంచే అంశాలు ►యువతలోనూ ఊబకాయుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. పైగా మన సమాజంలో పొట్ట దగ్గర ఊబకాయం మరీ ఎక్కువ. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ / సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మామూలు ఊబకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీ వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువ. ►ఇటీవల డయాబెటిస్ చిన్నవయసులోనే కనిపిస్తోంది. గుండెపోటుకు ఇదో స్పష్టమైన ముప్పు. ►ఆహారాల్లో ఎక్కువగా వాడుతున్న ఉప్పు, కొవ్వు పదార్థాలు (ట్రాన్స్‌ఫ్యాట్స్)... రక్తనాళాల్లో కొవ్వులు చేరేలా, సన్నబడేలా చేస్తున్నాయి. ►యువతలో శారీరక శ్రమ / వ్యాయామం లేకపోవడమూ ఓ ప్రధాన ముప్పే. వ్యాయామం చేసే యువత కూడా... కొవ్వు కరిగేలా చేసుకోవడం కంటే కండరాల నిర్మాణం, మంచి ఆకృతిపైనే ఆసక్తి చూపుతున్నారు. తీవ్రమైన శ్రమ కలిగించే వ్యాయామాల కంటే శ్రమలేనివే మంచివన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. ►కుటుంబ చరిత్రలో గుండెజబ్బులుండ టమూ గుండెపోటుకు దారితీసే అంశమే. దాదాపు 25 శాతం మందిలో ఈ ఫ్యామిలీ హిస్టరీయే గుండెపోటుకు ఓ కారణం. ►యువతలో ఎక్కువ గంటల పాటు, రాత్రుళ్లు నిద్రలేకుండా పనిచేసే వృత్తులో ఉండటం బాగా పెరిగింది. శారీరక/మానసిక ఒత్తిడి కూడా. ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అంశాలే. పైన పేర్కొన్న కారణాలను గుర్తించి, వాటిలో వీలున్నవి సరిదిద్దుకుని, లక్షణాలను శ్రద్ధగా గమనించి, యువకుల్లో అవి కనిపించగానే తక్షణం ఆసుపత్రికి తరలించడం వల్లవారి ప్రాణాలను కాపాడవచ్చు. జాగ్రత్తగా గమనించాల్సిందే... చిన్న... పెద్ద వయసు వారిలో గుండెపోటును స్పష్టంగా గుర్తించడం అవసరం. పెద్దవయసు వారిలో నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నందున మరింత శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే ఆ వయసు వారిలో ఉండే ముప్పు (కో–మార్బిడిటీస్) వల్ల ఈ అప్రమత్తత అవసరం. అయితే ఇప్పుడు చిన్నవయసు వారిలో సైతం ఇవే లక్షణాలను ఇంకా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే చిన్నవయసులో గుండెపోటుకు పెద్దగా అవకాశం ఉండదన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవలి ఘటనల తాలూకు హెచ్చరికల నేపథ్యంలో చిన్నవయసువారి విషయంలోనూ అప్రమత్తత అవసరమవుతోంది. ఇక చిన్నవయసువారిలో గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటివి గుండెపోటు లక్షణాల మాదిరిగానే వ్యకమవుతూ ఉండటం వల్ల... రిస్క్ తీసుకోకుండా ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. - డాక్టర్ ఎ. శరత్ రెడ్డి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!
Work From Home Back Pain Health Tips: కరోనా వల్ల ఉద్యోగుల్లో మెజార్టీ వాటా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం అయ్యిందని తెలిసిందే. ముఖ్యంగా కార్పొరేట్, టెక్ కంపెనీల ఉద్యోగులంతా ఎక్కువ పని గంటలకు ఫిక్స్ కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగుల గురించి ఆందోళన కలిగించే అంశం ఒకటి వెలుగు చూసింది. ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన ‘ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్: లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇన్షియేటివ్’.. అధ్యయనం వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్లో ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి’లాంటి జబ్బులు పెరిగిపోవడం గుర్తించింది. ఒత్తిడి, టైంకి తినకపోవడం ఇందుకు కారణాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైంలో అంటువ్యాధుల బారిన సైతం పడుతున్నారని పేర్కొంది. అయితే వీటన్నింటికంటే ప్రధానంగా.. వెన్ను నొప్పి సమస్యగా తయారవుతోందని గుర్తించింది ఈ స్టడీ. ‘వెన్నునొప్పి ఎక్కువ సమస్యగా మారుతోంది యువతలోనే’ అని ఈ స్టడీ గుర్తించింది. ముఖ్యంగా యంగ్ వర్కింగ్ పాపులేషన్(18-25ఏళ్ల లోపువాళ్లు) 25 నుంచి 31 శాతానికి పెరగడం, వాళ్లలోనే ఇది అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని ఈ అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. ‘‘నడుం నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యల కిందే ఉండేవి. కానీ, ఇప్పుడా సినారియో మారింది. యువతకు వస్తున్నాయి. జనరేషన్లుగా మారుతున్న లైఫ్ స్టయిల్, ముఖ్యంగా సరైన పొజిషన్లో (సిట్టింగ్ పోశ్చర్స్) కూర్చోకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలాకాలంగా సాగుతున్నా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిపోతోంద’ని జిందాల్ నేచుర్‌క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ యోగా ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ రాజేశ్ చెబుతున్నారు. ‘ఇప్పుడున్న జనరేషన్ హెల్త్ ఇష్యూస్‌ను.. లైఫ్ స్టైల్లో భాగంగానే భావిస్తున్నాయి. పైగా సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయడం లేద’ని చెబుతున్నారు రాజీవ్. కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్లను సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇక మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే పని కానిచ్చేస్తున్నారు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని.. ఇలా రకరకాల పోశ్చర్స్లో వర్క్ చేయడం.. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్దతిని పాటించకుండా చేయడం వెన్ను నొప్పికి దారి తీస్తోంద’ని రాజీవ్ అంటున్నారు. ఇలా చేయొచ్చు కరోనాకు ముందు చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉండడానికి చెప్పిన కారణం.. ‘టైం లేకపోవడం’. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోంలోనూ అదే సాకును చూపిస్తున్నారు. అందుకే వ్యాయామాలకు కొంత టైం అయినా కేటాయించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కాబట్టి, వ్యాయామాలు, నడకలో ఏదో ఒకటి పాటించాలని చెప్తున్నారు. అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తే సిట్టింగ్‌లోనే కాళ్లు చేతులూ ఆడించడం, వెన్నెముకకు రిలీఫ్ ఇవ్వడంలాంటివి చిన్నచిన్న ఎక్సర్సైజులు చేయాలి. మెడ మీద ఒత్తిడి పడని విధంగా హెడ్రెస్ట్ ఇస్తుండాలి. చిన్న చిన్న మెడ ఎక్సర్సైజులు చేయాలి. వీలైతే నిపుణుల పర్యవేక్షణలో, సలహాలతో యోగా, ఎక్స్ర్సైజులు చేయొచ్చు. ► సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ► చెయిర్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ► ఆ చెయిర్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ► మనిషి ఎత్తుకు అనుగుణంగా చెయిర్ ను అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. ► అన్నింటికి మించి ఇబ్బందిగా అనిపించినా ఈ పోశ్చర్స్ పాటించాల్సిందే. చిన్న చిన్న ఎక్సర్‌సైజులతో ఉపశమనం పొందాల్సిందే. లేకుంటే నడుం నొప్పి తీవ్ర సమస్యగా మారి.. ట్రీట్మెంట్, సర్జరీలకు దారితీయొచ్చు. చదవండి: బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా? ఇది మీకోసమే.. -
బద్దకం వదలండి.. కేన్సర్‌నూ చంపేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మీరు తరచూ వ్యాయామం చేస్తే జీర్ణ సమస్యలతో పాటు గుండె జబ్బులు దరి చేరవని మనకు తెలుసు. అయితే ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు.. ఇంతకంటే సూక్ష్మస్థాయిలో శరీరంలో జరిగే మార్పులను, వాటి ప్రభావాన్ని అంచనా వేశాయి. వీటన్నింటి ఆధారంగా వ్యా యామం చాలా రకాలుగా మేలు అని చెప్పొచ్చు. బుద్ధి కుశలత.. రోజులు, నెలలు కాదు.. కనీసం ఒక్కరోజు వ్యాయామం చేసినా సరే.. ఒక రకమైన జన్యువు ఉత్తేజితం అవుతుందని, తద్వారా మెదడులోని నాడీ కణాల మధ్య సినాప్టిక్ సంబంధాలు మెరుగవుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. జాగింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుందన్న భావనకు మూలం కూడా ఇదే. ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధనలు చేసింది. బాస్కెట్ బాల్ వంటి ఆటను ఎలుకలతో ఆడించి, గంట తర్వాత పరిశీలిస్తే వాటి మెదడులో జ్ఞాపకాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడే మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో సినాప్టిక్ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు తేలింది. అంటే దీన్నిబట్టి పరీక్షలున్న రోజు కాసింత వ్యాయామం చేసి వెళ్తే మరిన్ని ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చు. మెదడులో పలు మార్పులు.. రెండు రకాల వ్యాయామాలు మన మెదడు పనితీరును మార్చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు మెరుగ్గా అలవాటు పడే లక్షణం (బ్రెయిన్ ఎలాస్టిసిటీ) మాత్రమే కాకుండా.. మతిమరుపును దూరం చేసుకునేందుకు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాయామం ఉపయోగపడుతుంది. హై ఇంటెన్సిసిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హిట్) రకం వ్యాయామం (నిమిషం, 2 నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేసి.. కొంత విరామం ఇవ్వడం.. ఆ తర్వాత మళ్లీ తీవ్రస్థాయి వ్యాయామం చేయడం) వల్ల న్యూరాన్ల మధ్య బంధాలు బలపడతాయని సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సటర్ 2019లో సుమారు 2 లక్షల మందిపై నిర్వహించిన పరిశోధన ద్వారా మతిమరుపు, అల్జీమర్స్‌ను దూరం చేసుకునేందుకు వ్యాయామం, జీవనశైలి మార్పులు దోహదపడతాయని గుర్తించింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కనీసం 32 శాతం మంది మతిమరుపును నివారించగలిగారు. చిన్నతనంలో మంచిఆహారం తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల పెరిగి పెద్దయ్యాక మెదడు సైజు ఇతరుల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కోగలరని కూడా తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దృష్టి లోపాల నివారణకూ.. వయసుతో పాటు కళ్ల సంబంధిత సమస్యలను వ్యాయామం ద్వారా కొంత నిరోధించొచ్చు. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలిపిన విషయం ఇది. రెండు గుంపుల ఎలుకలపై ప్రయోగాలు జరిపారు. ఒక గుంపు వ్యాయా మం చేయలేదు. రెండోదాన్ని వేగంగా తిరిగే చక్రాల్లో బంధించి అవి చక్రం వెంబడి పరిగెత్తేలా చేశారు. 4 వారాల తర్వాత రెండు గుంపుల ఎలుకల కళ్లపై లేజర్ కిరణాలు ప్రసరించపజేశారు. దీంతో వ్యాయామం చేసే గుం పులోని ఎలుకల కళ్లకు 45 శాతం వరకు తక్కువగా నష్టం జరిగిందని గుర్తించారు. దీన్నిబట్టి మనుషుల్లోనూ రోజూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా వయసుతో వచ్చే దృష్టి లోపాలను కొంతవరకు నివారించొచ్చని తేలింది. కేన్సర్‌ను చంపేయొచ్చు.. కొన్ని రకాల కేన్సర్లకు చెక్ పెట్టేందుకు వ్యాయామం ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం చేసే క్రమంలో కండరాలు రక్తంలోకి కొన్ని రకాల జీవ రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి కాస్తా రోగ నిరోధక వ్యవస్థలో కేన్సర్ కణాలను చంపేసే ‘టీ సెల్స్’పనితీరును మెరుగుపరుస్తాయని గతేడాది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ (స్వీడన్) నిర్వహించిన ఈ పరిశోధనలో తేలింది. వ్యాయామం చేస్తున్న ఎలుకల నుంచి ఈ జీవ రసాయనాలను తీసి కేన్సర్ కణితులు ఉన్న ఎలుకలకు అందించినప్పుడు వాటి పరిమాణం తగ్గిందని తేలింది. -
15 నిమిషాల నడక.. లక్ష కోట్ల డాలర్ల ఆదా!
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యమే మహా భాగ్యం..’ అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రపంచంలో వెలకట్టలేని వాటిల్లో ఆరోగ్యానిది మొదటి స్థానం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేస్తూ చురుకైన జీవనశైలి పాటిస్తున్న ఉద్యోగులకు దీర్ఘాయువు సొంత మవడమే కాదు, అతని కుటుంబం, పని చేసే సంస్థ, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రజల ఆరోగ్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. మనదేశంలోని విద్యావంతుల్లో అధిక శాతం కూర్చుని పనిచేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆలోచన మంచిదే అయినా.. దీర్ఘకాలం వ్యాయామానికి, వాకింగ్‌లకు దూరంగా ఉండటం వల్ల శరీరంలో జబ్బులకు ‘టులెట్’ బోర్డు పెట్టినట్లేనని, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగులను రోగాలు చుట్టుముట్టేందుకు ఎంతోకాలం పట్టడంలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బు వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే.. అంతవరకు సంపాదించింది క్షణాల్లో కరిగిపోతున్న ఉదంతాలు రోజూ చూస్తున్నాం.. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసే లక్షలాది మందిలో అధిక శాతం కంప్యూటర్ల మీదనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఈ సర్వే ఓ మేలుకొలుపు లాంటిదని వైద్యులు సూచిస్తున్నారు. పావుగంట నడిస్తే.. అన్ని రోగాలను దూరం పెట్టినట్లేనని స్పష్టంచేస్తున్నారు. (చదవండి: పిల్లలు గంట.. పెద్దలు 45 నిమిషాలు) ప్రాణాలు..పైసలు భద్రం ఈరోజుల్లో ఆసుపత్రికి వెళ్తే.. ఒక మనిషి జీవిత సంపాదనే కాదు, అతని ఆస్తులు అమ్ముకున్నా.. క్షేమంగా వస్తాడన్న గ్యారెంటీ ఉండటం లేదు. చికిత్స కంటే నివారణ మేలు అన్న మాట ప్రకారం.. రోగాలు వచ్చాక జాగ్రత్త పడటం కంటే దానికి దూరంగా ఉండేలా ప్రతీరోజూ అదనంగా 15 నిమిషాలు నడవాలని సర్వే చెబుతోంది. దానివల్ల ప్రతీ ఉద్యోగి పనితీరులో మెరుగైన ప్రదర్శన కనిపిస్తున్నట్లు కూడా గుర్తించింది. ఇలా రోజూ వాకింగ్, జాగింగ్ చేసే వారు ఆసుపత్రులకు తక్కువగా వెళ్తున్నారని, తద్వారా తమ ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని భద్రంగా ఉంచుతూ దీర్ఘాయువులుగా జీవిస్తున్నారని గమనించింది. 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్యవారిలో రోజుకు 15 నిమిషాలు నడవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 బిలియన్ డాలర్లు అంటే మన లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ప్రకటించింది. మన కరెన్సీలోకి మారిస్తే.. దీని విలువ దాదాపు రూ.73 లక్షల కోట్ల మేర ఉంటుందని తెలిపింది. 30 శాతం బద్ధకస్తులే.. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 100 మందిలో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా దాదాపు 30 మంది గడుపుతున్నారని సర్వే గుర్తించింది. అయితే, వీరిలో చాలామంది పనిచేయలేని బద్ధకస్తులు కాదు.. ఐటీ, ప్రైవేటు ఉద్యోగ జీవితాల వల్ల వ్యాయామానికి దూరంగా ఉన్నారు. వీరిలో ఏటా 50 లక్షల మంది వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతోనే మరణిస్తున్నారని సర్వే తేల్చిచెప్పింది. ఈ లెక్కన రాష్ట్రంలోని హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో కదలకుండా పనిచేసే ఉద్యోగులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగిందని, ఇప్పటికైనా మేల్కొనాలని హెచ్చరిస్తున్నారు. నడకతో రోగాలు దరిచేరవు ప్రతీరోజూ నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. భారతీయులు ఉద్యోగాల్లో ఎదుర్కొం టున్న ఒత్తిళ్ల కారణంగా షుగర్, బీపీ, గుండె జబ్బుల బారినపడుతున్నారు. నడవడం వల్ల కండరాలు బలోపేతమవడంతో పాటు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, సానుకూల ఆలోచనలతో ప్రతి ఉద్యోగి వృత్తిలో మెరుగైన పనితీరును కనబరిచే అవకాశాలు పుష్కలం. అందువల్ల వీలును బట్టి చిన్న చిన్న దూరాలకు నడిచే వెళ్లడం, లిఫ్ట్‌కు దూరంగా ఉండటం, ఇంటి పని, వంట పని చేసుకోవడం మరింత ఉత్తమం. – డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, హుజూరాబాద్ -
వైరల్ వీడియో: వ్యాయామం చేస్తోన్న జిరాఫీ!
మీరు జిరాఫీ గడ్డి తినే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? అబ్బో దాంట్లో ఏముంది చాలా సార్లు చూశాం అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేయకతప్పదు. ఎందుకంటే జిరాఫీ సాధారణంగా తన పొడుగాటి మెడను వంచి గడ్డిని తింటుంది. అయితే 7 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మాత్రం ఒక జిరాఫీ భిన్నంగా కాళ్లను విడిగా జరిపి మెడను వంచి గడ్డిని తింటోంది. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇది మ్యానుఫక్చర్ డిఫెక్ట్ ఏమో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, వాళ్ల పీటీ టీచర్ దీన్ని చూసి నిజంగా గర్వ పడతారు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధారామన్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ జిరాఫీ వ్యాయమం చేయకుండా గడ్డి తింటోంది అంటూ కామెంట్ చేశారు. చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు.. -
ఇదేం వ్యాయామం రా నాయనా!
వ్యాయామం చేసేటప్పుడు మీలో చాలా మంది ట్రెడ్మిల్ చూసే ఉంటారు. రోడ్డు మీద పరిగెత్తే అవసరం లేని వాళ్లు ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించి చెమటలు కక్కుతుంటారు. ట్రెడ్‌మిల్‌ను మనం ఎంత స్పీడ్ పెంచితే అంత వేగంగా పరిగెడతాం. అయితే ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి ట్రెట్మిల్ను ఉపయోగించకుండా సైకిల్ తొక్కుతున్న మనుషులను ట్రెడ్మిల్గా చేసుకొని వారి మీద నుంచి పరిగెత్తడం ఆశ్యర్యం కలిగిస్తుంది. వీడియోలో స్లైక్లింగ్ చేస్తున్న వారిపై ఒక అమ్మాయి జీన్స్ వేసుకొని మెరుపువేగంతో పరిగెత్తడం కనిపించంది. దాదాపు 5 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చూస్తే అచ్చం ట్రెట్‌మిల్ పైన పరిగెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోనూ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేశాడు. ' ప్రజలు నమ్మశక్యం లేకుండా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియోను 1.4 మిలియన్ల మంది వీక్షించారు. ఇలాంటి సాహసాన్ని మునుపెన్నడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. People are absolutely insanely innovative and incredible... pic.twitter.com/kk2ZZBfAkh — Rex Chapman🏇🏼 (@RexChapman) July 2, 2020 -
కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!
చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పేదల నుంచి సంపన్నుల వరుకు, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ ఇంటికే పరిమితమయ్యేలా చేసింది కరోనా మహమ్మారి. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్డౌన్ ను ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. భారత్‌లో ఈ లాక్డౌన్ 21 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ అవకాశాన్ని ‘మేం ఫిట్‌గా తయారవ్వాలి’ అని అనుకునే వారు చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఏ పార్క్కో, జిమ్కో, ఫిట్నెస్ సెంటర్‌కో వెళతారు అయితే లాక్డౌన్ కారణంగా ఇవేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పెద్దవారు కనీసం రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారు మధ్యలో బ్రేక్ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని స్ట్రచ్ చేయాలని తెలిపింది. వర్క్ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటివద్ద నుంచే వ్యాయామం చేయడానికి ఉన్న కొన్ని మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. 1. యూట్యూబ్, టీవీల్లో వ్యాయామ కార్యక్రమాలు చూడటం: ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. గూగుల్‌లో దొరికిన విషయం అంటూ ఉండదు. ఇక వ్యాయామానికి సంబంధించి అయితే యూ ట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వీడియోలు ఉన్నాయి. మరీ ఇంట్లోనే ఉండి ఫిట్నెస్ పొందాలి అనుకునే వారు ఈ వీడియోలు చూస్తూ వ్యాయామం చేయవచ్చు. ప్రస్తుతం మనలో స్ఫూర్తి నింపడానికి చాలా మంది ఫిట్నెస్ ట్రైనర్లు కూడా అనేక వీడియోలను ఇప్పుడ షేర్ చేస్తన్నారు. ఎప్పటి నుంచో మీరు ఫిట్‌గా ఉండటానికి చేసే ప్రయత్నాలను వాయిదా వేస్తూ ఉంటే ఈ లాక్డౌన్ కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి. 2. డాన్స్ చేయండి: కేలరీలను కరిగించుకోవడానికి మరో చక్కని మార్గం డాన్స్ చేయడం. ఇంట్లో ఉంటూనే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ డాన్స్ చేయండి. దీని వల్ల మీకు ఆనందంతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్నెస్ లభిస్తుంది. 3. యాక్టివ్ వీడియో గేమ్‌లు ఆడటం: ఆటలు శరీరానికి మంచి వ్యాయామం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బయట తిరగలేం కాబట్టి యాక్టివ్ వీడియో గేమ్స్ ఆడుకుంటూ మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఆడటం వల్ల ఫిజికల్ యాక్టివిటి జరుగుతుంది. దీంతో కేలరీలు కూడా కరుగుతాయి. మీరు మీకిష్టమైన ఆటలాడుతూ వ్యాయామం కూడా ఒకేసారి చేయవచ్చు. 4. స్కిప్పింగ్: ఇంట్లోనే ఉంటూ ఒక తాడుతో వ్యాయామం చెయ్యొచ్చు. స్కిప్పింగ్ రోప్‌తో ఎగురుతూ మీ ఇంటి టెర్రస్ పైనే వ్యాయామాన్ని చక్కగా పూర్తిచేయవచ్చు. అలాగే స్కిప్పింగ్ చేయడం వల్ల చాలా ఎక్కువ కేలరీలు ఖర్చుఅవుతాయి. ఇంట్లో ఉండి చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్ రోప్‌ను బెస్ట్ అని చెప్పవచ్చు. 5. మజిల్ స్ట్రన్త్ ఎక్సర్ సైజ్లు: ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మజిల్ స్ట్రన్త్ ఎక్సర్ సైజ్లు చేయడం ఉత్తమం. దీనివల్ల మీరు చాలా ఫిట్‌గా తయారవుతారు. ఇలాంటి వ్యాయామాలతోపాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లాక్డౌన్లో ఉన్న ఈ 21 రోజుల కాలాన్ని మీ ఫిట్ నెస్ కోసం చక్కగా వినియోగించుకోండి. ఇంటి నుంచి బయటకు రాకుండా బాధ్యతయుత పౌరులు అనిపించుకోండి. -
ఒకే ఇంజనీరింగ్ ఎంట్రన్స్!
మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుసరిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తరహాలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు మొదలుపెట్టింది. నీట్ విధానం విజయవంతం కావడంతో ఇంజనీరింగ్‌కు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో జాతీయస్థాయి పరీక్షల నిర్వహణకు ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న అంశం ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఏడాది కిందట ఎన్టీఏను ఏర్పాటు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ ఏర్పాటైన వెంటనే ఇది సాధ్యం కాదన్న ఆలోచనతో గతేడాది ఈ అంశాన్ని పక్కన పెట్టింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షల విధానం, ఇంజనీరింగ్‌లో ప్రవేశాల విధానాలపై ఎన్టీఏ అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్రానికి రానుంది. – సాక్షి, హైదరాబాద్ జేఈఈ పరిధిలోకే అన్ని రాష్ట్రాలు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష విధానం అమల్లోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 యూనివర్సిటీలు ఈ ర్యాంకుల ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని యూనివర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపడుతున్నాయి. గతంలో గుజరాత్, మహారాష్ట్ర కూడా జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టినా 2016లో జేఈఈ మెయిన్ నుంచి వైదొలిగాయి. తాజాగా ఎన్టీఏ ఆలోచనల నేపథ్యంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఒకే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. జనవరిలో నిర్వహించబోయే జేఈఈ మెయిన్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను స్వీకరించినందున 2020–21 నుంచి ఇది అమల్లోకి రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈలోగా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందని భావిస్తున్నామని, ఏదైనా తేడా వచ్చినా 2021–22 నుంచి తప్పనిసరిగా దీని పరిధిలోకి రావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పారు. 40 లక్షల మందికి నిర్వహణ సాధ్యమయ్యేనా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు జేఈఈ మెయిన్ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించిన టాప్ 2.40 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నారు. మొత్తానికి జేఈఈ మెయిన్ పరీక్షకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో తెలంగాణ నుంచి 75 వేల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే జేఈఈ మెయిన్ పరీక్ష ర్యాంకుల ఆధారం గానే అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. అప్పు డు తెలంగాణ, ఏపీ నుంచే 3.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరుకానుండగా దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. అయితే అంత మందికి ఈ పరీక్ష నిర్వహణ ఆచరణ సాధ్యమవుతుందా లేదా అనే అంశంపైనా ఎన్టీఏ ఆలోచనలు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఆ తరువాత ఒకే పరీక్ష విధానాన్ని అమల్లోకి తెస్తే రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రద్దు కానుంది. -
అతిగా వ్యాయాయం చేస్తే..
లండన్ : మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యానికి తగినంత వ్యాయామం అవసరమని, అయితే అతి వ్యాయామంతో మేలు కన్నా చేటు అధికమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఐదు సార్లు, రోజుకు మూడు గంటలు మించి వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం వ్యాయామం అసలు చేయని వారితో పోలిస్తే మెరుగ్గా లేదని 12 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. యేల్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అథ్యయనంలో రోజుకు 45 నిమిషాలు, వారంలో ఐదు రోజులు వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు చేకూరుతాయని, ఇంతకన్నా ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలు దరిచేరవని స్పష్టమైంది. అతి వ్యాయామం అసాధారణ ప్రవర్తనకు దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. అయితే తగిన మోతాదులో వ్యాయామం మెరుగైన ఫలితాలు అందిస్తుందని వారు వెల్లడించారు. నలుగిరితో కలిసి చేసే బృంద వ్యాయామంతో కుంగుబాటు, ఒత్తిడిని దూరం చేయవచ్చని మానసికి ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని యేల్ వర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఆడమ్ చెక్రూడ్ చెప్పారు. రోజు విడిచి రోజు 45 నుంచి 60 నిమిషాల వరకూ వ్యాయామం చేయడం మెరుగైన మానసిక ఆరోగ్యానికి సరిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ సైకియాట్రీ హెడ్ ప్రొఫెసర్ స్టీఫెన్ ల్యారీ తెలిపారు. కాగా ఈ అథ్యయన వివరాలు లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఏ టర్న్?
‘‘నా దృష్టిలో ఫిట్నెస్ అంటే ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు చేసే వర్క్ కాదు. క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఎక్స్‌ర్‌సైజ్ వల్ల ఏర్పడతాయి’’ అంటున్నారు సమంత. ‘హమ్ ఫిట్ తో హై ఇండియా ఫిట్’ కాన్సెప్ట్‌లో భాగంగా సమంత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫిట్‌నెస్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఒకటీ రెండు కాదు ఏకంగా పది కేజీల బరువును వీపుపై ఉంచుకుని ఎక్స్‌ర్‌సైజ్ చేశారు సమంత. సినిమాల విషయంలోనే కాదు... ఫిట్నెస్ విషయంలోనూ ఆమె డెడికేషన్ అదుర్స్ కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇన్సెట్లో ఉన్న ‘యు–టర్న్’ సినిమా ఫొటోను చూడండి. లైఫ్టా, రైటా? ఏ టర్న్ తీసుకోవాలి? అని ఆలోచిస్తున్నట్లున్నారు సమంత. మరి ఫొటోలో కనిపిస్తోన్న సమంత, పాప, భూమిక ఎక్కడికి వెళ్లారు? అనేది ‘యు–టర్న్’ సినిమాలో చూద్దాం. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్ డైరెక్టర్ పవన్ కుమార్‌నే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీసాఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50 పర్సెంట్‌కి పైగా కంప్లీట్ అయిందని సమాచారం. అన్నట్లు ఫోటోలో సమంత, భూమికల మధ్య ఉన్న పాప... సినిమాలో భూమికకు కూతురట. -
ఆరేళ్లు వ్యాయామం చేస్తే..
లండన్ : ఆరేళ్ల పాటు నిత్యం వ్యాయామం చేస్తే గుండె వైఫల్యం ముప్పు మూడో వంతు తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. మధ్యవయస్కుల్లో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలికలు లేకుండా గడిపే వారిలో గుండె జబ్బుల ముప్పు అధికమని పేర్కొంది. 11,000 మంది పెద్దలపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వారిలో అత్యధికులు హైబీపీ, అధిక కొవ్వు, డయాబెటిస్, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల కారణంగానే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ డుములే తెలిపారు. వారానికి 150 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు అవసరమని ఇలా చేస్తే గుండె వైఫల్యం 31 శాతం వరకూ తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. గుండె జబ్బులను నిరోధించేందుకు మధ్యవయస్కులు ఇప్పటికైనా వ్యాయామానికి నడుం బిగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అథ్యయన వివరాలు జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. -
తేలికపాటి వ్యాయామం చేసినా..
లండన్ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్ అథ్యయనం పేర్కొంది. రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోని పేర్కొన్నారు. -
మధుమేహులకు మందుల కంటే ఇవే బెటర్
లండన్ : ఆహార నియమాలు, నిత్యం వ్యాయామం టైప్ టూ డయాబెటిస్ నియంత్రణకు మెరుగ్గా పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మందుల కంటే ఇవే మధుమేహులకు ఉపకరిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి కలిగిన టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 1500 మంది రోగులను శారీరకంగా యాక్టివ్‌గా లేని రోగులతో గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు పోల్చిచూశారు. నిత్యం వ్యాయామం చేస్తూ మెరుగైన మానసిక ఆరోగ్యం కలిగిన వారు తేలిగ్గా బరువు తగ్గినట్టు గుర్తించారు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం మందులు తీసుకోవడం కన్నా సమర్ధవంతంగా పనిచేసినట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 16 వారాల పాటు చురుకైన జీవనశైలి కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు తమ డయాబెటిస్ మందుల మోతాదు మించకపోవడం, మరోవైపు వారు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మూడేళ్లలో వీరిలో బ్లడ్ ఘుగర్ లెవెల్స్ తగ్గినట్టు కూడా గుర్తించారు. మందుల కంటే కూడా మెరుగైన ఆహారపు అలవాట్లతో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచవచ్చని ఈ అథ్యయనంలో వెల్లడైంది. యాక్టివ్ లైఫ్‌స్టైల్ సెషన్లో పాల్గొన్న పలువురికి టైప్ టూ డయాబెటిస్ పూర్తి అదుపులోకి వచ్చింది. మరికొందరు ఇన్సులిన్ తీసుకోవడం కూడా మానివేశారని పరిశోధకులు పేర్కొన్నారు. -
చలికాలంలో చేద్దాం చకచకా
చలికాలం కొన్ని ప్రత్యేకమైన శారీరక ఇబ్బందులకు నిలయం. ముఖ్యంగా కండరాలు బిగువుగా మారడం వలన జాయింట్లు పట్టుకుంటాయి. జీర్ణక్రియ (మెటబాలిక్ రేటు) సహజంగానే తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా, శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీనికితోడు డీ హైడ్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో చెమట ద్వారా ఎక్కువ నీరు బయటకు పోవడం, చలికాలంలో శరీరంలో తగినంత నీరు లేక డీ హైడ్రేషన్‌కు కారణమవుతుంది.. వేసవి కాలంలో నీరుతాగడం ఎంత ముఖ్యమో చలికాలంలో కూడా అంతే అవసరం ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం వలన పెదవులు ఎండిపోవడం, చర్మం పొడి పొడిగా ఉండడం, పగుళ్ల వంటివి నివారించవచ్చు. వీటి వలన జలుబు, దగ్గు గొంతు నొప్పి మంట ఆస్తమా కాళ్లు, చేతులు చల్లబడిపోవడం పొడిచర్మం, గుండెపోటు సమస్యలు ఎక్కువ అవుతాయి. శరీరంలో అన్ని కండరాలతోనూ, జాయింట్స్తోనూ పనిచేయడం ముఖ్యం. అందుకు సంబంధించిన అంగచాలనాలు, అంగ బంధనాలు, ఎక్సర్సైజులు చేయడం ముఖ్యం. ఆసనాలు చేయడానికి ముందు శరీరాన్ని బాగా సిద్ధం చేయాలి. ప్రాణాయామాలలో మూడు రకాల ప్రాణాయామాలు ఉంటాయి. 1. శీతలీకరణ ప్రాణాయామాలు 2. సమశీతోష్ణ క్రియ ప్రాణాయామాలు 3. ఉష్ణక్రియ ప్రాణాయామాలు వీటిలో ఉష్ణం జనింపజేసేటువంటి సూర్యబేధి, భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన ప్రాణాయామాలు చేయాలి. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వలన షుగర్ మెటబాలైజ్ కాదు. అందువలన పాల పదార్థాలు, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు తినడం మంచిది కాదు. ఇక చలికాలపు సమస్యలకు చెక్‌పెట్టేందుకు చేయాల్సిన ఆసనాల గురించి తెలుసుకుందాం. 1. తాడాసన సమస్థితిలో నిలబడి చేతులు రెండూ పైకి తీసుకు వెళ్లి ఇంటర్‌లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మడమలు పైకి తిప్పుతూ ముందరి కాలి వేళ్ల మీద నిలబడి శరీరాన్ని నడుం భాగం నుంచి పూర్తిగా పైకి సాగదీయాలి. శ్వాస వదులుతూ తిరిగి పాదాలు భూమి మీద పూర్తిగా ఆనించి చేతులు ఇంటర్‌లాక్ చేసిన స్థితిలోనే తల మీద పెట్టుకుని కొంచెం రిలాక్స్ అయి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకు... 5 లేదా 10 రిపిటీషన్స్ చేయాలి. తొందరపాటు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా చేయడం చాలా ముఖ్యం. 2. కటి చక్రాసన: ఇందులో ఐదారు రకాల ఆసనాలున్నాయి. కాని ఈ క్రియకు సంబంధించినంతవరకూ ఈ ఫొటోల్లో చూపిన కటి చక్రాసనం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచి, ముందుకు వంగి శ్వాసతీసుకుంటూ కుడి చెయ్యి ఎడమ పాదానికి దగ్గరగా ఎడమచెయ్యి పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమవైపుకు ఎడమ చెయ్యి పైకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ వైపుకు ఎడమచెయ్యి కుడి పాదానికి దగ్గరగా కుడి చేయిపైకి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా కుడికి ఎడమకు 5సార్లు చొప్పున చేయాలి. అవసరమైతే మోకాళ్ళు ముందుకు కొంచెం వంచవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య ఉంటే చేతులు ఎంతవరకు తీసుకువెళ్లగల్గితే అంతవరకే తీసుకువెళ్లండి. 3. ఊర్థ్వ మేరు చాలన (వామ దక్షిణ) ఎడమ వైపునకు చాలనం చేసేటప్పుడు కుడి చేతిని పక్క నుంచి పైకి తీసుకెళ్లి మోచేయి పైకి చూపించే విధంగా కుడి అరచేయి ఎడమ భుజంపైకి, ఎడమ చేయి కింద నుంచి నడుం వెనుకకు వచ్చే విధంగా చేయాలి. ఇదే విధంగా మళ్లీ రెండవవైపు కూడా చేయాలి. ఒక కాలు స్థిరంగా ఉంచి రెండవ కాలి మడమపైకి లేపి చేసినట్లయితే పూర్తి స్థాయిలో ట్విస్టు అయిన అనుభూతి పొందవచ్చు. ఇలా 5 లేదా 10 రిపిటీషన్లు చేయాలి. ఉపయోగాలు: ఊటరితిత్తుల పై భాగాలకు, మెదడులోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీని వలన అల్జీమర్స్, పార్కిన్సన్, బ్రెయిన్ ఎటక్సియా వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. భుజాలు, పై భాగాలకు, మెడకు మంచి వ్యాయామం అందుతుంది. స్టెర్నో క్లెయిడో మస్టాయిడ్ కండరాలకు, డీప్ నెక్ ఫ్లెక్సార్ కండరాలకు వ్యాయామం జరిగి మెడకు సంబంధించిన సమస్యలతో పాటు, సర్వైకల్ స్పాండిలైటిస్, మైగ్రేన్ సమస్యల నుంచి విముక్తికి సహకరిస్తుంది. ముఖ్య గమనిక: అన్ని చాలనములు చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు పనికిరాదు. శ్వాస తీసుకుంటూ, వదులుతూ నిదానంగా చేయడం, చేతుల కదలికల స్థాయి కొంచెం ఎక్కువగా ఉండేట్టు జాగ్రత్తగా చేయడం ముఖ్యం. అప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ మూడు చాలనములు చేయడం వలన వృద్ద్ధాప్యంలో వచ్చే లోడోసిస్, కైపోసిస్, స్కోలియోసిస్ సమస్యలను నివారించవచ్చు. ఒకవేళ ఇప్పటికే అటువంటి డీవియేషన్ ఉన్నట్టయితే వాటి కరెక్షన్కు ఉపకరిస్తుంది. – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: ఈషా హిందోచా, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి -
ఏటా 50 లక్షల మరణాలకు అదే కారణం
లండన్: ఇటీవలికాలంలో బాగా తగ్గిపోతున్న శారీరక శ్రమకు ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా.. సంవత్సరానికి 67.5 బిలియన్ డాలర్లతో పాటు 50 లక్షల మంది ప్రాణాలు. ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ నిర్వహించిన తాజా పరిశోధనలో వ్యాయామం లేకపోవటం మూలంగా 67.5 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం విషయంలో ఖర్చు చేస్తున్నారని తేల్చారు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజనుల్లో 50 శాతం మంది కూడా ఈ మార్క్‌ను చేరుకోవటం లేదని పరిశోధకులు వెల్లడించారు. రోజుకు ఎనిమిది గంటలకు పైగా కూర్చొని పనిచేసేవారిలో సరైన శారీరక శ్రమ లేకపోయినట్లయితే వారిలో అకాల మరణాలు సంభవించే అవకాశం పెరుగుతోందని పరిశోధనలో తేలింది. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం మూలంగా గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎకిలండ్ తెలిపారు. -
అమరేంద్ర బాహుబలి @ 150
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సాహసం చేశాడు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఇప్పటి నటీనటులు ఎంతటి రిస్క్ చేసేందుకు అయినా వెనకడుగు వేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి'లో శివుడు పాత్రలో ఆరడుగల ఎత్తు - కండలు తిరిగిన శరీరంతో బాగా ఆకట్టుకున్న ఈ టాలీవుడ్ రైజింగ్ స్టార్ రెండో భాగంలోని తండ్రి అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ఇపుడు మరింత బరువు పెరిగాడట. 'బాహుబలి ది కంక్లూజన్' అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ ఏకంగా 150 కిలోల బరువు పెరిగాడట. అమెరికా నుంచి తెప్పించుకున్న స్పెషల్ జిమ్ ఎక్విప్మెంట్ సాయంతో మరో 17 కిలోలు బరువు పెరిగాడని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా మెనూను కూడా ఫాలో అవుతున్నాడట. వెజ్ - నాజ్ వెజ్ రెండింటినీ సమతూకంగా తీసుకుంటూ, ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ సమతూకంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 42 ఎగ్ వైట్స్, - పావుకిలో చికెన్ - తాజా పళ్లు.. ఇదీ ప్రభాస్ బ్రేక్ ఫాస్ట్. బ్రౌన్ రైస్ - ఓట్స్ - సలాడ్స్ - బ్రొకలి - పాస్టా.. ఇది లంచ్. వర్కవుట్స్ తర్వాత హాఫ్ స్కూప్ ప్రొటీన్ పౌడర్.. సూప్‌తో గానీ పాలతో గానీ తీసుకుంటాడట ప్రభాస్. వామప్‌తో పాటు.. యోగ - డంబుల్స్ - స్ట్రెచింగ్ - క్రాస్ ఫిట్స్ - ప్లయోమెట్రిక్స్ ఇలా రకరకాల ఎక్సర్ సైజులతో తన బాడీని తీర్చుదిద్దుకుంటున్నాడట. ఇక ప్రతిరోజు ఉదయం - సాయంత్రం గంటన్నరపాటు వ్యాయాయం ఇవన్నీ షరా మామూలే. కాగా ఈశ్వర్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ వర్షం, ఛత్రపతి, బిల్లా తదితర సినిమాల్లో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ చిత్రాలతో క్లాస్, మాస్ ఏదయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత బాహుబలితో ప్రభంజనాన్నే సృష్టించాడు. పూర్తి ఫిట్నెస్ బాడీతో.. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కన్నుకుట్టే రేంజ్లో ప్రభాస్, బాహుబలి-1లోని శివుడు పాత్ర కోసం తన బరువును 130 కిలోలకు పెరిగిన విషయం తెలిసిందే.