Work From Home Back Pain Health Tips: కరోనా వల్ల ఉద్యోగుల్లో మెజార్టీ వాటా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం అయ్యిందని తెలిసిందే. ముఖ్యంగా కార్పొరేట్, టెక్ కంపెనీల ఉద్యోగులంతా ఎక్కువ పని గంటలకు ఫిక్స్ కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగుల గురించి ఆందోళన కలిగించే అంశం ఒకటి వెలుగు చూసింది.
ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన ‘ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్: లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇన్షియేటివ్’.. అధ్యయనం వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్లో ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి’లాంటి జబ్బులు పెరిగిపోవడం గుర్తించింది. ఒత్తిడి, టైంకి తినకపోవడం ఇందుకు కారణాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైంలో అంటువ్యాధుల బారిన సైతం పడుతున్నారని పేర్కొంది. అయితే వీటన్నింటికంటే ప్రధానంగా.. వెన్ను నొప్పి సమస్యగా తయారవుతోందని గుర్తించింది ఈ స్టడీ.
‘వెన్నునొప్పి ఎక్కువ సమస్యగా మారుతోంది యువతలోనే’ అని ఈ స్టడీ గుర్తించింది. ముఖ్యంగా యంగ్ వర్కింగ్ పాపులేషన్(18-25ఏళ్ల లోపువాళ్లు) 25 నుంచి 31 శాతానికి పెరగడం, వాళ్లలోనే ఇది అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని ఈ అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. ‘‘నడుం నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యల కిందే ఉండేవి. కానీ, ఇప్పుడా సినారియో మారింది. యువతకు వస్తున్నాయి. జనరేషన్లుగా మారుతున్న లైఫ్ స్టయిల్, ముఖ్యంగా సరైన పొజిషన్‌లో (సిట్టింగ్ పోశ్చర్స్) కూర్చోకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలాకాలంగా సాగుతున్నా ఎలాంటి అరేంజ్‌మెంట్స్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిపోతోంద’ని జిందాల్ నేచుర్‌క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ యోగా ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ రాజేశ్ చెబుతున్నారు.
‘ఇప్పుడున్న జనరేషన్ హెల్త్ ఇష్యూస్‌ను.. లైఫ్ స్టైల్‌లో భాగంగానే భావిస్తున్నాయి. పైగా సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయడం లేద’ని చెబుతున్నారు రాజీవ్. కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్‌లను సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్‌లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇక మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే పని కానిచ్చేస్తున్నారు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని.. ఇలా రకరకాల పోశ్చర్స్‌లో వర్క్ చేయడం.. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్దతిని పాటించకుండా చేయడం వెన్ను నొప్పికి దారి తీస్తోంద’ని రాజీవ్ అంటున్నారు.
ఇలా చేయొచ్చు
కరోనాకు ముందు చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉండడానికి చెప్పిన కారణం.. ‘టైం లేకపోవడం’. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోంలోనూ అదే సాకును చూపిస్తున్నారు. అందుకే వ్యాయామాలకు కొంత టైం అయినా కేటాయించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కాబట్టి, వ్యాయామాలు, నడకలో ఏదో ఒకటి పాటించాలని చెప్తున్నారు. అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తే సిట్టింగ్‌లోనే కాళ్లు చేతులూ ఆడించడం, వెన్నెముకకు రిలీఫ్ ఇవ్వడంలాంటివి చిన్నచిన్న ఎక్సర్‌సైజులు చేయాలి. మెడ మీద ఒత్తిడి పడని విధంగా హెడ్‌రెస్ట్ ఇస్తుండాలి. చిన్న చిన్న మెడ ఎక్సర్‌సైజులు చేయాలి. వీలైతే నిపుణుల పర్యవేక్షణలో, సలహాలతో యోగా, ఎక్స్‌ర్‌సైజులు చేయొచ్చు.
► సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి.
► చెయిర్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి.
► ఆ చెయిర్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి.
► మనిషి ఎత్తుకు అనుగుణంగా చెయిర్ ను అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం.
► అన్నింటికి మించి ఇబ్బందిగా అనిపించినా ఈ పోశ్చర్స్ పాటించాల్సిందే. చిన్న చిన్న ఎక్సర్‌సైజులతో ఉపశమనం పొందాల్సిందే. లేకుంటే నడుం నొప్పి తీవ్ర సమస్యగా మారి.. ట్రీట్‌మెంట్, సర్జరీలకు దారితీయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment