చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్‌లతో చనిపోయే వారు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. కొద్దిరోజుల ముందు ప్రఖ్యాత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను మరవకముందే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఘటన అందరినీ కలచివేసింది. ఇద్దరిదీ చిన్న వయసే. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ, మంచి ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నవారే. వీళ్లకే ఇలా జరుగుతుంటే... సాధారణ ప్రజల పరిస్థితేమిటి అన్న ఆందోళన చాలామందిని వేధిస్తోంది. ఇలాంటి హార్ట్‌అటాక్‌లను సరిగ్గా గుర్తిస్తే.. వీలైనంత త్వరగా వైద్యసహాయం అందేలా జాగ్రత్త పడవచ్చు. మరణాలనూ నివారించవచ్చు. వాటిని గుర్తించడం ఎలాగో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలిపే కథనమిది.
చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు ఆందోళన వద్దు... అప్రమత్తత మేలు!
గతంలో 35 లోపు వయసున్న వారిలో గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్‌లు) అరుదు. నిజానికి కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌నూ సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఇవి సన్నబడతాయి. కొన్నిసార్లు మూసుకుపోతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గడం లేదా ఒక్కోసారి పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఆ సమయాల్లో ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను ‘యాంజినా/యాంజైనా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తసరఫరా జరగనప్పుడు గుండె కండరాలు చచ్చుపడిపోవడం మొదలవుతుంది. దాన్నే హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ – ఏఎమ్‌ఐ) అంటారు. అప్పుడు వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ కారణంగా... యాంజినల్ చెస్ట్ పెయిన్ (ఛాతీ నొప్పి) నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా సంభవించవచ్చు. ఇటీవల మన దేశంలోనూ 35 – 40 ఏళ్లలోపు వారికి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ బాగా పెరిగాయి.
లక్షణాలు : గుండెపోటు లక్షణాలు పెద్దవయసు వారిలోనూ, చిన్నవయసు వారిలోనూ ఒకేలా ఉంటాయి. దీనిలో ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి. గమనించాల్సిన అంశమేమిటంటే.. చిన్నవయసు వారిలో నొప్పి తీవ్రత కాస్త ఎక్కువ. ఈ నొప్పినే ‘యాంజినా’ అంటారు.
గుండెపోటు మరికొన్ని రకాలుగా కూడా వ్యక్తం కావచ్చు. ముఖ్యంగా ఈ నొప్పి మన ఒంట్లో...
►కింది దవడ మొదలుకొని... బొడ్డు వరకు ఎక్కడైనా కనిపించవచ్చు. ∙ఇది ఛాతీపై నొక్కిపట్టుకుంటున్నట్లుగా (స్క్వీజింగ్) వస్తుంటుంది. ∙ఛాతీపై పెద్ద బరువు ఉన్నట్లుగా, పాకుతున్నట్లుగా వస్తుంది. ∙ఒక్కోసారి ఛాతీలో మంటగా అనిపిస్తుంది. అందువల్లనే బాధితులు దాన్ని ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతుంటారు.
త్వరగా గుర్తించేందుకు తోడ్పడే అంశాలు...
►ఛాతీపై ఒత్తిడి కలుగుతున్నట్లుగా / పట్టేసినట్టుగా / నొక్కినట్టుగా / మంటతో వచ్చే నొప్పి. ∙ఐదు నిమిషాల్లో నొప్పి తీవ్రత క్రమంగా పెరగడం. ∙నొప్పి విస్తరిస్తున్నట్లుగా రావడం. (కొందరిలో ఛాతీ ఎడమవైపు నొప్పి ఉంటేనే గుండెనొప్పిగా భావిస్తుంటారు. ఇది ఛాతీ మధ్యలోనూ వచ్చి, అన్ని వైపులకూ విస్తరించవచ్చు).
►ఛాతీ నొప్పి ప్రధానంగా ఎడమ భుజంలోకి, మెడలోకి, వీపులోకి పాకుతూఉండవచ్చు.
►నొప్పితో పాటు మరికొన్ని లక్షణాలూ కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది, చల్ల చెమటలు, అకస్మాత్తుగా నోరంతా వికారం.
►శారీరక శ్రమ తర్వాత నొప్పి పెరగడం లేదా ఛాతీ పట్టేసినట్టుగా కావడం.
►తీవ్రమైన ఉద్వేగానికి లోనైనప్పుడు లేదా విశ్రాంతి సమయంలో కూడా ఛాతీనొప్పి.
►చాలా అరుదుగా దవడ పై భాగంలోనూ నొప్పి రావచ్చు. కానీ ఈ లక్షణాన్ని చూసిన వెంటనే డాక్టర్లు దాన్ని గుండెపోటుగా పరిగణించకపోవచ్చు. ఇది అరుదు కావడంతో కొన్ని పరీక్షల తర్వాతే గుండెపోటును నిర్ధారణ చేస్తారు.
కారణాలు :
► శారీరక శ్రమ లేకుండా కూర్చుని చేసే పనులు పెరగడంతో కొవ్వులు పేరుకుపోయి రక్తప్రవాహానికి అడ్డుపడే అవకాశాలు పెరుగుతున్నాయి.
►మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో 40 ఏళ్ల తర్వాతే కనిపించే ఈ ముప్పు ఇటీవల 25 నుంచి 30 ఏళ్లప్పుడే జరుగుతోంది.
►మారుతున్న ఆహారపు అలవాట్లు యువతను ప్రభావితం చేస్తున్నాయి. గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ తగ్గి, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వులైన ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగింది.
►యువతలో మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు అథెరో స్కి›్లరోసిస్‌కు దారితీస్తాయి.
►హైబీపీ కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది.
గుండెపోటు ముప్పును పెంచే అంశాలు
►యువతలోనూ ఊబకాయుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. పైగా మన సమాజంలో పొట్ట దగ్గర ఊబకాయం మరీ ఎక్కువ. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ / సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మామూలు ఊబకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీ వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువ.
►ఇటీవల డయాబెటిస్ చిన్నవయసులోనే కనిపిస్తోంది. గుండెపోటుకు ఇదో స్పష్టమైన ముప్పు.
►ఆహారాల్లో ఎక్కువగా వాడుతున్న ఉప్పు, కొవ్వు పదార్థాలు (ట్రాన్స్‌ఫ్యాట్స్)... రక్తనాళాల్లో కొవ్వులు చేరేలా, సన్నబడేలా చేస్తున్నాయి.
►యువతలో శారీరక శ్రమ / వ్యాయామం లేకపోవడమూ ఓ ప్రధాన ముప్పే. వ్యాయామం చేసే యువత కూడా... కొవ్వు కరిగేలా చేసుకోవడం కంటే కండరాల నిర్మాణం, మంచి ఆకృతిపైనే ఆసక్తి చూపుతున్నారు. తీవ్రమైన శ్రమ కలిగించే వ్యాయామాల కంటే శ్రమలేనివే మంచివన్న అంశాన్ని విస్మరిస్తున్నారు.
►కుటుంబ చరిత్రలో గుండెజబ్బులుండ టమూ గుండెపోటుకు దారితీసే అంశమే. దాదాపు 25 శాతం మందిలో ఈ ఫ్యామిలీ హిస్టరీయే గుండెపోటుకు ఓ కారణం.
►యువతలో ఎక్కువ గంటల పాటు, రాత్రుళ్లు నిద్రలేకుండా పనిచేసే వృత్తులో ఉండటం బాగా పెరిగింది. శారీరక/మానసిక ఒత్తిడి కూడా. ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అంశాలే.
పైన పేర్కొన్న కారణాలను గుర్తించి, వాటిలో వీలున్నవి సరిదిద్దుకుని, లక్షణాలను శ్రద్ధగా గమనించి, యువకుల్లో అవి కనిపించగానే తక్షణం ఆసుపత్రికి తరలించడం వల్లవారి ప్రాణాలను కాపాడవచ్చు.
జాగ్రత్తగా గమనించాల్సిందే...
చిన్న... పెద్ద వయసు వారిలో గుండెపోటును స్పష్టంగా గుర్తించడం అవసరం. పెద్దవయసు వారిలో నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నందున మరింత శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే ఆ వయసు వారిలో ఉండే ముప్పు (కో–మార్బిడిటీస్) వల్ల ఈ అప్రమత్తత అవసరం. అయితే ఇప్పుడు చిన్నవయసు వారిలో సైతం ఇవే లక్షణాలను ఇంకా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే చిన్నవయసులో గుండెపోటుకు పెద్దగా అవకాశం ఉండదన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవలి ఘటనల తాలూకు హెచ్చరికల నేపథ్యంలో చిన్నవయసువారి విషయంలోనూ అప్రమత్తత అవసరమవుతోంది. ఇక చిన్నవయసువారిలో గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటివి గుండెపోటు లక్షణాల మాదిరిగానే వ్యకమవుతూ ఉండటం వల్ల... రిస్క్ తీసుకోకుండా ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.
- డాక్టర్ ఎ. శరత్ రెడ్డి
సీనియర్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment