మానవ శరీరంలో కొవ్వు కణాలను ఆడిపోసైట్స్ అంటారు. కొవ్వు కణాల సంఖ్య, బాల్యం , టీనేజ్ లో నిర్ధారణ అయిపోతుంది . అటుపై ఆ కణాల సంఖ్య పెరగదు .. తగ్గదు. కొవ్వు కణాలు తమ ఒరిజినల్ సైజు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పెరుగగలవు. అంటే ఊబకాయం ఉన్నవారిలో కొవ్వుకణాలు ఎక్కువగా వుండవు ; పెద్దవిగా ఉంటాయి . ఒక వ్యక్తి వ్యాయామం చేసి కండలు పెంచాడు . మరో వ్యక్తి బాగా తిని కొవ్వు పెంచాడు . అప్పుడు సైజు లో తేడా ఎలా ఉంటుంది ? ఒక కిలో కండ కన్నా, ఒక కిలో కొవ్వు అయిదు రెట్లు భారీగా ఉంటుంది.
కండలు పెంచిన వారెవరూ భారీగా వుండరు . కొంత మంది కండలు, కొవ్వు రెండూ పెంచుతారు. అంటే.. విపరీతంగా తినడం అలాగే వీపరీతంగా వర్కవుట్ చేయడం. ఇలాంటి వారు కనిపించడానికి భారీగా వుంటారు. కేవలం కొవ్వు పెంచిన వారు మాత్రం దూది కొండలా వుంటారు. పురుషుల్లో కొవ్వు ఎక్కువగా కడుపు భాగంలో, స్త్రీలలో తుంటి, తొడలపై నిలువ ఉంటుంది. పశ్చిమ దేశాలలో ఎక్కువగా శ్వేత జాతి ప్రజలుంటారు, వారిలో అధిక తిండి తినే వారికి ఒళ్ళంతా కొవ్వే. అంటే అధిక కొవ్వు చర్మం కింద ఉంటుంది.
దాంతో పాటు ఒళ్ళంతా కొవ్వు నిల్వ ఉంటుంది. అందుకే అమెరికన్లలో ఊబకాయం ఎక్కువ. ఊబ కాయస్థుల సంఖ్య కూడా ఎక్కువ. అదే భారతీయుల్లో కొవ్వు ఎక్కువగా ఉదరభాగంలో అంతకు మించి గుండె లాంటి అవయవాల చుట్టూరా పేరుకొని పోతుంది.
దీన్ని విసెరల్ ఫాట్ అంటారు . ఇది ప్రమాదకరం. గుండెపోట్లకు దారి తీస్తుంది. వ్యాయామం లేకుండా కేవలం క్రాష్ డైట్ తో బరువు తగ్గించాలనుకొనే వారి కండరాలు బలహీనం అవుతాయి. ఇది మెటబాలిజం (జీవన చర్యలు) వేగాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇందువల్లే అలాంటి వారు కొన్నాళ్ల పాటు డైట్ నియమాలు పాటించి, అవి మానేసాక సులభంగా బరువు పెరిగిపోతారు. అనేక మంది హీరోయిన్ ల విషయం లో ఇదే జరుగుతోంది. బరువు తగ్గాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయడం అవసరం. ఇలాంటి శిక్షణ వల్ల గుండె కూడా దృఢం అవుతుంది.
శరీరం లో ఒక భాగం లో కొవ్వు ఎక్కువ ఉందనుకొందాము. ఉదాహరణకు పొట్ట భాగంలో. నూటికి తొంబై మంది ఏమనుకొంటారంటే "పొట్ట కు సంబదించిన వర్కౌట్స్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరిగి పోతుంది".
కానీ ఇలా ఒక భాగానికి సంబంధించిన వర్కౌట్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరగడం అంటూ ఉండదు. ఎప్పుడయితే వ్యాయామం ప్రారంభించామో ఒక పద్దతిలో శరీరం మొత్తం లోని కొవ్వు కరిగిస్తూ వస్తుంది. ఏ విధంగానయితే కొవ్వు కొద్దికొద్దిగా పెరుగుతుందో.. అదే విధంగా వ్యాయామం చేస్తున్న కొద్ది రివర్స్‌లో తగ్గుతూ వస్తుంది.
కేవలం ఒక భాగంలోనే కొవ్వు హఠాత్తుగా తగ్గడం అంటూ ఉండదు. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కావాలి . శక్తి అవసరంలో యాబై శాతం మాత్రం కార్బ్స్ ద్వారా తీర్చాలి. కానీ మన సమాజం లో నూటికి తొంబై మంది ... 90 శాతం దాక శక్తి అవసరాలను కార్బ్స్ ద్వారా తీరుస్తున్నారు. ఇలా అధిక పిండి పదార్థాలు తినడం ఒక రకమైన అడిక్షన్ (వ్యసనం). కార్బ్స్ అంటే జంక్ ఫుడ్.
మైదా పిండితో చేసే వస్తువులు, పిజ్జాలు, బర్గర్‌లు, సాఫ్ట్ డ్రింక్స్, చాకోలేట్స్, కుకీలు, బ్రెడ్ ఇలా నోటికి రుచికరంగా ఉండే ఏవైనా వీటికిందకే వస్తాయి. తాగుబోతును మద్యం మానమంటే ఆ వ్యక్తికి కోపం వచ్చినట్టే ఈ అధిక పిండిపదార్థాలు తీసుకునే వ్యసన పరులకు అవి తినొద్దని చెబితే నచ్చదు. పైగా కోపం కూడా వస్తుంది. తాగుబోతు కనీసం తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకొంటాడు. కానీ అధిక కార్బ్స్ పోతులు తాము వ్యసనపరులు అని కూడా గ్రహించరు. పాపం.
వాసిరెడ్డి అమర్‌నాథ్,
విద్యావేత్త, మానసిక పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment