vasireddy amarnath
-
చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..
మా అమ్మాయి పసికూన" .. "అబ్బాయి బుడ్డోడు" .. "ఇంకా ఏమీ తెలియదు" . ఇదే తల్లితండ్రుల ఆలోచనలు . మీ ప్రేమ చల్లగుండా. పిల్లలు దేవుడు చల్లని వారే .. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. కానీ ..మధ్యలో స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ టీవీలు దురాయి స్వామి. అమాయకత్వం అర్హత కాదు. గురువు / తల్లితండ్రి సరైన రీతిలో ఎడ్యుకేట్ చెయ్యకపోతే పిల్లలు బయటి సమాజం నుంచి నేర్చుకొంటారు . చెడుదారిలో వెళ్లి పోతారు ." అయ్యో .. అప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా చేస్తుందని అనుకోలేదు" అని అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి ? దీని గురించి మానసిక శాస్త్ర పరిశోధకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్ధాం. ఒకసారి నేను హైస్కూల్ పిల్లలకు ఇచ్చిన హోం టాస్క్‌లో..ఐఐటీ విద్యార్థులు కూడా, ఆత్మ హత్యలు చేసుకొంటున్న ఘటనలు జరుగుతున్నాయి . దీనికి గల కారణాలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించండి. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య చదివిన కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణాలను, పరిష్కార మార్గాలను చర్చించండి, తదితరాల గురించి ఇచ్చాం. వారు ఇంట్లో తల్లిదండ్రులతో అవసరమయితే బంధువులతో చర్చించి సమాచారం సేకరించి చర్చకు సిద్ధం కావాలి. అటుపై క్లాస్ రూమ్ లో మెంటార్ పర్యవేక్షణలో డిబేట్ జరుగుతుంది. కొంతమంది తల్లితండ్రులు ఈ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. "మా పిల్లలు ఇంకా పసివారు. వారికి ఆత్మ హత్యలు, ప్రేమలు- పెళ్లిళ్లు వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం, వయసు రాలేదు. అనవసరంగా పసి మనుసుల్లో నెగటివ్ విషయాలు చొప్పించకండి. వీటిని మేము పిల్లలతో చరించడానికి రెడీగా లేము ", "తలితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నల్ని మార్చండి ."-- నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి ఇచ్చిన ఆదేశం. నిన్న నా క్లాస్. క్లాస్ తరువాత క్వశ్చన్- ఆన్సర్ సెషన్. ఆ సెషన్లో ఏడవ తరగతి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలు కొన్ని . 1 . మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్నాప్ చాట్‌లో ఇంకో అమ్మాయితో చాట్ చేస్తోంది. నేను చూసి అది అమ్మాయి కాదు అని చెప్పాను. ముందుగా నా మాట నమ్మలేదు . తరువాత అది నిజమని తేలింది. ఇప్పుడు వాడు, మా ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు . తాను డిప్రెషన్ లో ఉంది. సూసైడ్ చేసుకుంటానంటోంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి ? 2 . మేము మా అపార్ట్మెంట్ బయట ఆడుకొంటాము. ఆ టైంలో ఎక్కడినుంచో ఒక గ్యాంగ్ అబ్బాయిలు వస్తారు. మమ్మల్ని టీజ్ చేస్తారు. వల్గర్ మాటలు మాట్లాడతారు . ఒక అంకుల్‌కి చెప్పాము . అయన అక్కడ ఉన్నప్పుడు వారు రారు. అయన వెళ్ళిపోగానే మళ్ళీ వస్తారు . ఏమి చెయ్యాలి ? ౩. మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు మాకు నిక్ నేమ్ పెడుతున్నారు. మమల్ని వేరే అబ్బాయిలతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. మన స్కూల్ ఇది తక్కువ. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే, వారి స్కూల్లోఇది ఇంకా ఎక్కువ తట్టుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏమి చెయ్యాలి. 4 . అబ్బాయి తప్పు చేసినా, పెద్దలు అమ్మాయినే నిందిస్తారు . ఎందుకు ? 5 . పొట్టి బట్టలు వేసుకొంటే పెద్దలు అమ్మాయిని తప్పుపడుతారు . అబ్బాయికి సంస్కారం చెప్పారా ?. 6 . తన బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు . నేనేమి చెయ్యాలి ? 7 . ఏదో తరగతిలో ప్రేమ లో పడడం తప్పు . కానీ అబ్బాయిలను బెస్ట్ ఫ్రెండ్ చేసుకొంటే తప్పు అవుతుందా ? 8 . మా బంధువుల అమ్మాయి ... 25 ఏళ్ళు వుండొచ్చు. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని హుస్బేండ్స్ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. లేదా బ్రేక్ అప్ అయిపొయింది. కాబట్టి పెళ్లి చేసుకోనటోంది. ఏమి చెయ్యాలి ? సునామిలా ఇలా ప్రశ్నలు వరుసగా దూసుకొస్తూనే వున్నాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఉదాహరణకు ఎనిమిదో ప్రశ్న కు .. ఔటర్ రింగ్ రోడ్డు పై... హైదరాబాద్ - విజయవాడ హై వే ప్రతి రోజు కొన్ని ప్రమాదాలు - మరణాలు జరుగుతున్నాయి . కాబట్టి నేను రోడ్డుపై ట్రావెల్ చెయ్యను . మలేసియా విమానం, నేపాల్ విమానం కూలిపోయాయి . కాబట్టి నేను విమానం ఎక్కను - హాల్లో నవ్వులు . గుండెపోట్లు ఎక్కువగా వ్యక్తి నిద్రపోతున్న సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇక నిద్రే పోను ... ఇంకా పెద్ద పెట్టున నవ్వులు. అసలు గుండె ఉంటేనే గుండెపోటు. కాబట్టి నేను గుండెను తీసేస్తాను .. పగల బడి నవ్వులు. ప్రతి సంవత్సరం టీచర్లను ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌ను ఎంపిక చేస్తుంటాను. నిజానికి ఒక తప్పు చేస్తే .. పిల్లల్ని చెరపట్టే ఫెడోఫిలిస్ట్ని ఎంపిక చేస్తే ? రిస్క్ ఉంది కదా ? అవతలివారి సైకాలజీని అర్థం చేసుకొనే సామర్థ్యము అంటే సామజిక తెలివి తేటలు పెంచుకొని ముందుకు సాగుతున్నాను . జీవితంలో తన పెర్సనాలిటీ ఏంటో తెలుసుకొని తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో నిర్ణయించాలంటే మానసిక పరిణతి కావాలి . ఏదో ఎర్రగా బుర్రగా వున్నాడు. స్వీట్ మాటలు చెబుతున్నాడు. మహేష్ బాబులా వున్నాడు అని ట్రాప్ లో పడితే లైఫ్ నాశనం. పెద్ద చదువులు చదివినా.. మంచికి చెడుకి తేడా తెలియని బేలతనంతో ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి మంచిగా చదువుపై దృష్టి పెట్టి .. మీరు స్లెటర్స్, కాబోయే లీడర్స్‌గా, అలాగే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ ఎంపతీ, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటలిజెన్స్-- మీలో పెంపొందాలే చూసుకోండి. ఈ క్లాస్ అందుకే . దయచేసి తల్లిదండ్రుల్లారా ముందుగానే మేల్కోండి వారికి పెద్దయ్యాక మంచి చెడు చెబుదామని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీకి వారికి అన్ని తొందరగానే అర్థమైపోతున్నాయన్న విషయం ఈ సెషన్లో వారడగిన్న ప్రశ్నల తీరే నిదర్శనం. సో ముందుగానే పిల్లలని గమనించి మంచి చెడు చెప్పి పక్కదోవ పట్టకుండా కాపాడుకోండి. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న యూత్.. ఇలా తయారయ్యారేంటి?
నేటి తరం.. ఒక కన్ఫ్యూజన్. తానేంటో తనకే తెలియదు. తనకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలో తెలియదు. అవతలి వ్యక్తి పర్సనాలిటీని కనిపెట్టలేరు. ఉద్రేకంతో మోహించి , అదే ప్రేమ అని భ్రమించి పెళ్ళాడి , మోజు తీరగానే కొట్లాడి పెటాకులు తెచ్చుకొని, ఇక పెళ్లి యుగం అయిపోయిందని తీర్పులు ఇస్తున్న చదువుకొన్న నాగరికులు. అయినా తప్పు వీళ్లది కాదు వీళ్ల చదువులది. అది అమెరికాలో ఉద్యోగం అయితే ఇప్పించింది. కానీ ఎలా బతకాలో చెప్పలేదు. ఇంకేముంది బతుకు బస్టాండ్ ,ఆపై డిప్రెషన్లు, సూసైడ్లు... పెళ్ళయితే ?.. భార్య భార్య / భర్త , పిల్లలే సంసారం. పెళ్లికి లీవ్, హనీమూన్‌కి లీవ్, మెటర్నిటీ లీవ్.. పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే రెండు, మూడు రోజులు లీవ్. భార్య,భార్తల్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా మరొకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదేమంటే, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే ఉద్యోగం అంటారు. ఇప్పుడప్పుడే పెళ్లి గట్రా వద్దంటున్నారు ఈ బ్రహ్మచారులు. 30దాటినా.. అప్పుడే పెళ్లికి, లివ్ఇన్కి తొందరేముంది? అంటూ నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఆపై ఉద్యోగమే సర్వస్వం అనుకొని కంపెనీ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఆఫీస్ జిందాబాద్, పెళ్లి, కుటుంబం డౌన్డౌప్ అంటూ పిచ్చి వాగుడు వాగేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి కుటుంబం ఛిన్నాభిన్నమేనా? మావోయిస్టుల కాలంలో చైనాలో.. “కుటుంబ వ్యవస్థ మనిషిలో స్వార్థాన్ని పెంపోందిస్తుంది.. కానీ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తేనే అసలుసిసలు కమ్యూనిజం వస్తుంది” అని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ కొన్నాళ్లకే అది తస్సుమంది. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కాపిటలిస్ట్ అమెరికాలో బహుళ జాతి కంపెనీలు.. కంపెనీ బానిసలను తయారుచేయడం కోసం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి. మన దగ్గర్నుంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మనోళ్లు(కొత్తతరం) ఈ ట్రాప్‌లో పడిపోయి పెళ్లి శకం ముగిసింది అని బ్రహ్మచారి జీవితానికి సిద్ధమయిపోతున్నారు. -ఈ వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు మన దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇంకా ఈ ట్రెండ్ ముదిరిపోక ముందే వేకప్ కాల్ అనుకొని పరిస్థితులను సమీక్షిస్తే మంచిది. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
''మాకు పెళ్లి అవసరం లేదు'' అనుకునేవారు ఇది చదవాల్సిందే..
దమ్మారో ధం... జీనత్ అమన్ నటించిన హరే రామ హరే కృష్ణ సినిమా లోని పాట. హిప్పీలు గంజాయి కొడుతూ ఎంజాయ్ చేసే సీన్ ఇది. వాసిరెడ్డి సీత రచించిన మారీచిక నవలను, కొంతకాలం ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.ఇందులో ఒక అమ్మాయి హిప్పీగా మారిపోతుంది.. మరో అమ్మాయి నక్సల్స్‌లో చేరిపోతుంది. కోర్టు ఆదేశాల మేర ఆ నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పుడు ఆ నవలను చదివాను. అసలే చిన్న వయసు. రెండు రోజులు పిచ్చెక్కిపోయింది.హిప్పీ ఉద్యమం..1965లో అమెరికాలో మొదలయ్యింది. 1970 కల్లా ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. సమాజం ధోరణి నచ్చని యువత చేసిన ఒక రకమయిన తిరుగుబాటు ఇది. తిరుగుబాటు అనడం కన్నా దారి తప్పిన పెడధోరణి అనడం సబబు. పొడవాటి చింపిరి జుట్టు .. బెల్ బాటమ్ పాంట్స్ .. ఇల్లు వదలి పెట్టి తనలాంటి తిక్క సన్నాసులతో చేరి గ్రూప్ లు గ్రూప్ లుగా దిమ్మరిలా ఊరూరా తిరగడం. నీది నాది అనేది లేదు. అంతా మనదే అనే ఫిలాసఫీ. సామూహిక జీవనం, నచ్చిన వారితో సెక్స్, మాదక ద్రవ్యాలు... 1970లలో తెగ నడిచింది. అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. గోవాలో అయితే ఆరంభోల్ బీచ్ అంతా వీరే ఉండేవారట. వీరు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం అంజునా మార్కెట్ ఉండేది. ఇక భవిషత్తు అంతా ఇలాగే ఉంటుంది అని అప్పట్లో మేధావుల అంచనా. ఏమయ్యింది? 1980 వచ్చేటప్పటికి హిప్పీ ఉద్యమం మాయమయింది. ఆ నాటి హిప్పీ హీరోలు హీరోయిన్లు మాయమయిపోయారు. మాదక ద్రవ్యాలు తిని అప్పుడే ఎంతో మంది పోయారు. ఎవరైనా బతికున్నా వృద్ధాప్యంతో పోయుంటారు. యాభై ఏళ్ళ నాడు వారు 25 ప్లస్ వయసు వారు.. అంటే ఇప్పుడు 75 ప్లస్. ఏ వెర్రి అయినా కొంత కాలం ట్రెండింగ్ కావొచ్చు. కానీ అదే భవిషత్తు కాదు. ఇక పై పెళ్లిళ్లు వుండవు .. కుటుంబాలు ఉండవు అనుకొనే వారు ఈ నిజాన్ని గమనించాలి.ఆ నాటి హిప్పీలు శారీరక సమస్యలు, వివిధ రోగాలతో పోయారు. నేటి వివాహ కుటుంబ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కొత్త తరం హిప్పీలు మానసిక రోగాలతో పోతారు. ప్రకృతి అనేది ఒకటుంటుంది. అన్ని విషయాలను అది చూసుకొంటుంది. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. సొంత అనుభవంతో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాడు వెబ్ పేజీలలో కేసు స్టడీ కీర్తి శేషుడిగా మిగిలిపోతాడు. మిగతా వారి అనుభవం నుంచి నేర్చుకొనేవాడు తెలివయినవాడు. బతకడం తెలిచినవాడు. మీరు కేస్ స్టడీ అవుతారా? తెలివిగా బతుకుతారా? తేల్చుకోండివాసిరెడ్డి అమర్ నాథ్మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
లివ్ఇన్ రిలేషన్స్ పేరుతో అడ్డదారులు..వెస్ట్రన్ కల్చర్ మనకవసరమా?
రెండు కాళ్లపై నడిచే, ఏకైక జీవి మనిషే. తల్లిపై, ఎక్కువ కాలం పాటు .. అదీ ఎక్కువ స్థాయిలో ఆధారపడే జీవి మనిషి ఒక్కడే. రెండింటికీ సంభందం ఉందా?ఎన్నో లక్షల ఏళ్ళ క్రితం మానవ పూర్వీకులు దట్టమయిన అడవుల నుంచి సవన్నా (పచ్చ గడ్డి మైదానాలు)లకు వలసపోయారు. ఇలాంటి స్థితిలో నాలుగు కాళ్లపై నడవడం కన్నా ముందు కాళ్ళు ఎత్తి, రెండు కాళ్లపై కాసేపు నిలబడి చూడగలిగితే ? ఆ జీవి ఎత్తు దాదాపుగా రెండు రెట్లయినట్టే కదా..శత్రువుల / క్రూర జంతువుల జాడను దూరం నుంచే పసిగట్టవచ్చు. ఇలాంటి స్థితిలో ప్రకృతి వరణం వల్ల నాలుగు కాళ్ళ పూర్వీకుల నుంచి క్రమంగా రెండు కాళ్ళ జీవి ఆవిర్భవించింది. రామాపితేకాస్,ఆస్ట్రలో పితికాస్.. హోమో ఎరెక్ట్స్ .. హోమో హాబిలిస్ .. హోమో సేపియన్స్ .. ఇలా సాగింది మానవ పరిణామం. శిశువుకు జననం ఇచ్చేటప్పుడు నాలుగుకాళ్ల జీవి అయితే వెనుక కాళ్ళు రెండు బాగా సాచేందుకు వీలుంటుంది. రెండు కాళ్ళ మానవ పూర్వీకుల్లో ద్విపాద గమనాన్ని (రెండు కాళ్ళ పై నడవడం) సాధ్యం చేసేందుకు , కాళ్ళు రెండు బాగా దగ్గరగా అమరిక పొందాయి . దీనితో జనన రంద్రం చిన్నదయ్యింది . దీనితో పుట్టుక సమయం లో శిశువు కపాలం, దానిలోపల ఉన్న మెదడు చిన్నదయింది. అంటే మానవ శిశువు పుట్టేటప్పటికి మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉంటుంది . చేప పిల్లకు తల్లి సంరక్షణ అనేదే ఉండదు. పాలిచ్చే జంతువుల్లో తల్లిపై ఆధారపడడం కాస్త ఎక్కువ. ఆవుదూడ పుట్టిన అరగంటలో లేచి చెంగున పరుగెడుతుంది. కానీ మానవ శిశువు ? తల్లి పై పూర్తి స్తాయిలో ఆధార పడక తప్పద. దీనికి కారణం రెండు కాళ్ళు. పుట్టినప్పుడు మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉండడ. పుట్టిన రెండేళ్లలో మెదడు- కపాలం బాగా పెరుగుతాయి. చిన్న పిల్లల డాక్టర్లు బిడ్డ కపాలం కొలతలు తీసి నోట్ చేస్తారు . తల పెరుగుదల ఎలా ఉందొ గమనిస్తారు. ఇలా తల్లిపై ఎక్కువ కాలం ఆధారపడడం, మానవ జాతికి ఒక చక్కటి అవకాశం అయ్యింది. తల్లి ఒడిలోనే బిడ్డ భాషను నేర్చుకుంటుంది. అందుకే మాతృభాష అన్నారు. కేవలం భాషేనా ? ఆ సమాజపు అలవాట్లు , మంచి చెడు- విలువలు , నమ్మకాలు, కట్టుబాట్లు , ఆచారాలు - వ్యవహారాలు .. ఇలా సమస్తం తల్లి ఒడిలోనే బిడ్డ నేరిస్తుంది . ఈ ప్రక్రియనే సామాజీకరణ అంటారు.. అంటే ఆ సమాజంలో ఎలా నడవాలి? ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో... ఈ బడిలోనే బిడ్డ నేరుస్తుంది. సమాజం దేహం అయితే దాని సంస్కృతి ప్రాణం.అలాగే సంస్కృతి లేకుండా ఏ సమాజమూ మనలేదు. ఈ సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందించే అవకాశం తల్లి బిడ్డ బంధం వల్లే సాధ్యం అయ్యింది. బిడ్డను కన్న తల్లికి డోపామైన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ బిడ్డను పాలిచ్చి లాలించేటప్పుడు ఇదే డోపామైన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే బిడ్డను పెంచడాన్ని అందరు తల్లులూ ప్రేమిస్తారు. అదో అనిర్వచనీయమయిన అనుభూతి . ఒకప్పుడు మానవ పూర్వీకులు కూడా.. జంతువుల్లా వావీ వరుసలు లేకుండా సంభోగించేవారు.జంతువులకైతే లైంగిక వాంఛ సంవత్సరంలో ఏదో ఒక సీజన్లో మాత్రమే. చిత్త కార్తె కుక్కలు అనే మాట విన్నారు కదా ? కానీ మనిషికి సంవత్సరం పొడవునా ఆ అవసరం ఉంటుంది. అందుకే వివాహం .. కుటుంబం అనే వ్యవస్థలు వచ్చాయి . భార్య - భర్త - పిల్లలు .. కుటుంబం .. క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక ఆర్థిక , సామాజిక, భావద్వేగ బంధం. కుటుంబం లేకపోతే మన సమాజమే లేదు. టెక్నాలజీ మారితే హార్మోన్లు, శరీర నిర్మాణం మారుతుందా ? వేషము మార్చినా మనిషి మారలేడు. ఆతని జైవిక నిర్మితి మారబోదు. మిడిమిడి జ్ఞానం అంటే ప్రకృతికి అడ్డంగా నడవడం. లివ్ ఇన్ అట.. దానికి చట్టబద్ధత కావాలట ! సోషల్ మీడియా లో చర్చలు, డిమాండ్లు. అజ్ఞానికి అంతు ఉండొద్దూ !! చట్టబద్దత ఇస్తే... అదే వివాహం కదా ? మనిషికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగం 25 ఏళ్లకు గానీ డెవలప్ కాదు . అంటే కనీసం ఇరవై వయసు వస్తేనే తానేంటో, తన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది .తానేంటో తెలియని వయసులో తనకు ఎలాంటి బాయ్ / గర్ల్ ఫ్రెండ్ కావాలో ఎలా నిర్ణయించుకొంటారు? టీనేజ్లోలో పుట్టేది ప్రేమ కాదు.వ్యామోహం. హార్మోన్ డ్రైవ్ . కొన్నాళ్లు కలిసుంటారు, తర్వాత.. బ్రేక్ అప్ అయ్యాక ? ఇంకో బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్ .అదిగో అప్పుడు పోలిక మొదలవుతుంది . అరే నా ముందు వాడు / ఆమె బెటర్ . సరిగ్గా పెంచకపోవడం వల్లే అమెరికాలో, సందుకో సైకో. వాడి చేతిలో గన్. ఎప్పుడు ఎవరిని ఏసేస్తారో తెలియదు . ఇప్పటి దాకా మానవీకరణ జరిగింది . మెల్లగా అమెరికా లాంటి చోట్ల దానవీకరణ జరుగుతోంది.అమెరికా కార్లు,రోడ్లు చాక్లెట్లు బాగుంటాయి. సరే, దానివీకరణలో కూడా భారత నగర జీవులు అమెరికాను ఆదర్శంగా తీసుకొంటే ఇక్కడ దానవీకరణ జరిగితే .. జరిగితే ఏంటి ? పదో క్లాసులోనే హత్యలు. ఆత్మ హత్యలు. కొత్తొక వింతా కాదు . పాతొక రోతా కాదు.మనిషి ఒక జీవి.పరిణామ క్రమంలో వచ్చాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోకుండా అడ్డదారిలో నడిస్తే మన జాతి విలుప్తం తప్పదు. వాసిరెడ్డి అమర్ నాథ్ - మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త -
US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు
అమెరికా అనగానే.. చాలా మంది మన వాళ్లకు ఒక్కసారయినా చూసి రావాలని కలగంటారు. రోజూ వేల మంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ చూసి అంతా గొప్పే అనుకోవడంలో తప్పులేదు కానీ.. అక్కడ బయటికొస్తున్న వీపరీత మనస్తత్వాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. తుపాకీ సంస్కృతి, విచ్చలవిడిగా డ్రగ్స్, పతనమవుతున్న కుటుంబ విలువలు, మానసిక ఉన్మాదులు.. వీటన్నింటిని అవలోకనం చేసుకుంటే.. అమెరికాను నిజంగా అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ ఇచ్చిన కొన్ని ఉదాహారణలు, వాటి వెనక ఆయన విశ్లేషణలు తప్పక పరిశీలించాల్సిందే. సంఘటన 1 అవతల అగ్ర దేశపు అధ్యక్షుడు. ప్రపంచం లో అత్యున్నత స్థాయి రక్షణ వ్యవస్థ. లింగులిటుకు మంటూ మనోడు. విమానం దిగి ఒక ట్రక్ తీసుకొని కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి హిట్లర్ రాజ్యాన్ని స్థాపిస్తాడట. పిచ్చికి పరాకాష్ట. కాదా ? కానీ ఇలాంటి పిచ్చోళ్ళు ఆ సమాజంలో చెట్టుకొకరు .. పుట్టకొకరు.. మంచు గడ్డ కొకరు. ఎందుకు పుట్టుకొని వస్తున్నారో పరిశోధిస్తే.. చర్చిస్తే.. తెలుసుకొంటే .. ఆ సమాజపు డొల్ల పునాది బయటపడుతుంది. సంఘటన 2 అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం.! ఒక 18 ఏళ్ళ యువకుడు.. తన తల్లితండ్రులను, ఇద్దరు సోదరులను ఇంటిలో కాల్చి చంపేశాడు. “వారు నరమాంస భక్షణకు అలవాటు పడ్డారు. నన్ను చంపి తినేయాలని ప్లాన్ చేశారు. అందుకే చంపేసాను, అని పోలీసులకు చెప్పాడు. ఇంకో ఘటన చూద్దాం. పాఠశాలల్లో కాల్పుల ఘటనలు జరగకుండా ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టనుంది. అవి ఏంటంటే.. పాఠశాల సిబ్బంది స్కూల్‌కు వచ్చేప్పుడు వెంట గన్స్ తీసుకొని పోవడం రెండోది మానసిక ఉన్మాదులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వెయ్యాలి .. అనేది ఒక సామెత. అమెరికాలో రివర్స్.. చంపినోడికి పిచ్చోడు అని ముద్ర వేస్తారు. అక్కడితో ఆ సమస్య తీవ్రతను అక్కడి జనాలు వెంటనే/సాధ్యమైనంత త్వరగా మరిచిపోతారు. ఎవడో పిచ్చోడు చేసినదానిపై చర్చ ఎందుకులే అని వదిలేస్తారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు చంపాలనుకునే పిచ్చోళ్ల సంఖ్య ఎందుకు రానురాను పెరిగిపోతోంది ? పిచ్చోడి చేతిలో రాయే ప్రమాదం .. అలాంటిది పిచ్చోడి చేతికి పిస్టల్ వెళ్లే దౌర్భాగ్య స్థితిలో ఆ దేశం ఎందుకుంది ? పిచ్చి వెనుక కారణాలు ఏంటి ? ఎవరూ అడగరు .. అడిగినా సమాధానాలు రావు. వాసిరెడ్డి అమర్నాథ్ ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి?
మూడేళ్ళ వయసులో పిల్లల్ని బడిలో చేర్పిస్తారు. అప్పటిదాకా , ఆ మాటకొస్తే ఆ తరువాత కూడా పిల్లల్ని పెంచడం లో చేయాల్సినవి .. చేయకూడనివి ఏంటి.? పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి. 1 . పిల్లల చేతికి ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఇవ్వొద్దు. అది వారి మెదడు ఎదుగుదలను దెబ్బ తీసి, వర్చ్యువల్ ఆటిజం (బుద్ధి మాంద్యత)ను కలిగిస్తుంది. సెల్ ఫోన్ కు అలవాటు పడిన పిల్లలకు మాటలు సరిగా రావు . చికాకు , అసహనం , కోపం , హింసాప్రవృత్తి , తిరుగుబాటు ధోరణి... నెలల్లో వచ్చేస్తుంది . అటు పై సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్లి, వేలల్లో ఖర్చు పెట్టినా, ఫలితం దక్కక పోవచ్చు. 2. పిజ్జా బర్గర్ , కోక్ , పెప్సీ, ప్యాకెట్లలో దొరికే పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్ కు పిల్లల్ని అసలు అలవాటు చేయకండి . చాకోలెట్లు, బిస్కెట్ లు లాంటివి కూడా ఎక్కువగా ఇవ్వొద్దు. పళ్ళు , వేరుశనిగ గింజెలు , బెల్లం తో చేసిన చిక్కీలు (వేరుశనిగె చిక్కి ,నువ్వుల చిక్కి), డ్రై ఫ్రూట్ లడ్డు తాటి నుంజెలు , పొత్నాలు (శనిగెలు) బటానీలు లాంటి వాటిని చిరు తిళ్ళుగా అలవాటు చేయండి . ఆకుకూరలు కాయగూరలు బాగా తినేలా చూడండి . 3. పిల్లలు ఆకలి వేస్తె అన్నం తింటారు. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయకండి. బాగా నమిలి తినేలా ప్రోత్సహించండి. 4 . ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి. మాటలు నేర్పించండి . దీనికి ఎంతో ఓర్పు - నేర్పు కావాలి . నిద్ర పోయేటప్పుడు తప్పించి వారితో, ఎవరో ఒకరు , ఎప్పుడూ, మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఎక్కువ వారితో మాట్లాడితే, వారి మెదడు (న్యూరల్ కనెక్షన్స్) అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. 5. మూడేళ్ళ లోపు, అంటే పిల్లలు బడికి వెళ్లేంత వరకు, ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉండాలి . వారు ఎప్పుడూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి . కేవలం భార్య- భర్త ఉన్న కేంద్రక కుటుంబాలలో పిల్లల ఎదుగుదల కుంటుబడుతుంది . నిజం నిష్ఠూరంగా ఉంటుంది . కానీ చెప్పక తప్పదు. తల్లి ఒక్కతే అస్తమానమూ, చంటి పిల్లలతో వ్యవహరించలేదు. మేలుకొన్నంత సేపు పిల్లలు , ముఖ్యంగా ఒకటి నుంచి మూడేళ్ళ లోపు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వుంటారు. తల్లి తాను చేస్తున్న పనికి లీవ్ పెట్టినా , ఇంత సమయం వెచ్చించ లేదు. బడికి వెళ్లే వయసు వచ్చే వరకు పిల్లలతో ఎవరో ఒకరిద్దరు తోడు ఉండాలి. వారు పిల్లలతో ఆడుతూ పాడుతూ మాట్లాడిస్తూ ఉండాలి . 6 . కదులుతున్నది , సౌండ్ వచ్చేది , రంగురంగుల్లో ఉండేది... ఇలాంటి వాటి పట్ల పిల్లలు సహజంగా ఆకర్షితులు అవుతారు. ఇది మానవ పరిణామ క్రమంలో పిల్లలకు సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం. పిల్లల్ని వీలైనంత ఎక్కువగా బయటకు తీసుకొని వెళ్ళాలి . ఆకాశం , చందమామ , నక్షత్రాలు , పక్షులు జంతువులు ఇలా ప్రకృతికి , చుట్టూరా ఉన్న మానవ ప్రపంచానికి ... ఎక్సపోజ్ చెయ్యాలి. నాలుగు గోడలకే పరిమితం చేస్తే వారి బుద్ది వికాసం మందగిస్తుంది . ఇంట్లో కదిలేది రంగురంగుల ను చూపేది సౌండ్ నిచ్చేది .. ఏది ? టీవీ . వారిని నాలుగు గోడలకు పరిమితం చేస్తే వారు ముందుగా టీవీకి, అటు పై సెల్ ఫోన్‌కు ఆకర్షితులు అవుతారు. ఈ కాలం పిల్లలు టెక్నాలజీ ని బాగా వాడేస్తారు అని మీరు మురిసి పోయే లోగా, వారికి సెల్ ఫోన్ అడిక్షన్ వచ్చేస్తుంది. ఆ తరువాత వారి జీవితం, మీ జీవితం నరకం. 6 . పిల్లలకు కథలు చెప్పండి . దీని వల్ల వారు మీ మాట వినడానికి చిన్నపటి నుంచే అలవాటు పడుతారు. కథల ద్వారా పిల్లల్లో క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్, సహానుభూతి లాంటి స్కిల్స్ పాదుగొలపవచ్చు. శ్రవణ, గ్రహణ శక్తి కూడా పెంపొందుతుంది . లాలి పాటలు, జోల పాటలు పాడండి. చంటి బిడ్డ దగ్గర పాటలు పాడడానికి మీరేమీ సుశీల లేదా జానకి కానక్కర లేదు . ప్రతి తల్లిలో ఒక సుశీల, జానకి , లతా మంగేష్కర్ ఉన్నారు. తండ్రులు కూడా పాడొచ్చు. పిలల్లకు బెడ్ టైం స్టోరీస్ చెప్పొచ్చు . పిల్లల పెంపకం ఉమ్మడి భాద్యత . 7. చంటి పిల్లలు ముఖ్యంగా నడవడం నేర్చిన తరువాత, చుట్టూరా ఉన్న వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు . వాటిని తీసి పరిశీలించడం మొదలు పెడుతారు. కరెంటు వైర్, ప్లగ్ లాంటి ముట్టుకోకూడని వస్తువులు తప్పించి మిగతా వస్తువులను వారిని ముట్టుకోనివ్వండి. పరిశీలించనివ్వండి . వస్తువులను ఎలా హ్యండిల్ చేయ్యాలో, ఏమి చేయకూడదో వివరించండి . ఉదాహరణకు గాజు గ్లాస్.. " ఆమ్మో ! కింద పడితే పగిలి పోతుంది " అని వారికి అర్థం అయ్యేలా చెప్పండి . కరెంటు వైర్ కన్నా ... గ్యాస్ స్టవ్ కన్నా... వారు ముట్టుకోకూడని డేంజరస్ వస్తువు ఒకటుంది . అదే సెల్ ఫోన్ . " ఇది పెద్దలకు మాత్రమే . నువ్వు అసలు తాకకూడదు" అని కచ్చితంగా చెప్పండి. నిక్కచ్చిగా వ్యవహరించండి. 8. నెమ్మదిగా రెండేళ్ల వయసు నుంచి వారికి పుస్తకాల పట్ల మక్కువ పెంచండి. ముందుగా బొమ్మల పుస్తకాలు. బొమ్మల్ని చూపుతూ దాని గురించి వారితో మాట్లాడండి . ఈ ఫర్ ఎలిఫెంట్ .. చెప్పండి. E..L..E..P..H..A..N..T అని వారికి స్పెల్లింగ్ నేర్పడం కాదు. పాయింట్లు బట్టి కొట్టించడం కాదు. ఏనుగు ఏనుగు నల్లంగా .. ఏనుగు కొమ్ములు తెల్లంగా అని పాట పాడడం .. ఏనుగు అడవిలో ఉంటుంది . అడవంటే ఏంటి ? ఇలా బాతాఖానీ టైపు లో మాటలు ఉండాలి. పెద్ద వారు పక్కనున్న వారికి వినబడేలా కాస్త బిగ్గరగా పుస్తకాలు చదివితే మంచిదని, ఈ పద్దతి బిడ్డ గర్భం లో వున్నప్పుడే మొదలు కావాలని అమెరికన్ వైద్యులు గర్భిణీ స్త్రీలకు రెకమెండ్ చేస్తారు . 9 . పిల్లలు మనల్ని చూసి అనుకరిస్తారు . వారికెదురుగా బిగ్గరగా కొట్లాడుకోవడం , కోపం, అసహనం, ద్వేషం లాంటి నెగటివ్ ఎమోషన్స్ ను ప్రదర్శించడం , అదే పనిగా టీవీ చూడడం సెల్ ఫోన్ కు అంటుకొని ఉండడం లాంటివి చేయకూడదు. 10 . మీ ముద్దు మురిపెంతో పిల్లల్ని ఆటపట్టించడం , గేలి చెయ్యడం లాంటివి చెయ్యకండి . నవ్వుతూ వారితో సంయమనంతో వ్యవహరించండి. పిల్లల్ని పెంచడం ఒక కళ. ఒక సైన్స్ . పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు, గ్రామీణ జీవితాల వల్ల పైన చెప్పినవన్నీ సహజంగా జరిగి పోయేవి. నలభై లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి ఇలాగే ఎదిగాడు. అది ప్రకృతి ధర్మం. మానవ శరీర నిర్మాణం ఇలాగే జరిగింది . జంక్ ఫుడ్ , వాటిని ప్రమోట్ చేసే సినీ హీరోలు, క్రికెటర్లు.. సెల్ ఫోన్ .. ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం .. ఇదీ నేటి పిల్లల పెంపకం లో ఎదురయ్యే సవాళ్లు . సరైన రీతిలో పిల్లల్ని పెంచితే అదే కోట్ల ఆస్తి. ఇంట్లో బిడ్డ వర్చ్యువల్ ఆటిజం తో నో ADHD తో నో బాధ పడుతుంటే కోట్ల ఆస్తి ఉన్నా జీవితం నరకం . తస్మాత్ జాగ్రత్త. వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
కొవ్వు ఎందుకు పెరుగుతుంది? తగ్గించాలంటే ఏమి చేయాలి?
మానవ శరీరంలో కొవ్వు కణాలను ఆడిపోసైట్స్ అంటారు. కొవ్వు కణాల సంఖ్య, బాల్యం , టీనేజ్ లో నిర్ధారణ అయిపోతుంది . అటుపై ఆ కణాల సంఖ్య పెరగదు .. తగ్గదు. కొవ్వు కణాలు తమ ఒరిజినల్ సైజు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పెరుగగలవు. అంటే ఊబకాయం ఉన్నవారిలో కొవ్వుకణాలు ఎక్కువగా వుండవు ; పెద్దవిగా ఉంటాయి . ఒక వ్యక్తి వ్యాయామం చేసి కండలు పెంచాడు . మరో వ్యక్తి బాగా తిని కొవ్వు పెంచాడు . అప్పుడు సైజు లో తేడా ఎలా ఉంటుంది ? ఒక కిలో కండ కన్నా, ఒక కిలో కొవ్వు అయిదు రెట్లు భారీగా ఉంటుంది. కండలు పెంచిన వారెవరూ భారీగా వుండరు . కొంత మంది కండలు, కొవ్వు రెండూ పెంచుతారు. అంటే.. విపరీతంగా తినడం అలాగే వీపరీతంగా వర్కవుట్ చేయడం. ఇలాంటి వారు కనిపించడానికి భారీగా వుంటారు. కేవలం కొవ్వు పెంచిన వారు మాత్రం దూది కొండలా వుంటారు. పురుషుల్లో కొవ్వు ఎక్కువగా కడుపు భాగంలో, స్త్రీలలో తుంటి, తొడలపై నిలువ ఉంటుంది. పశ్చిమ దేశాలలో ఎక్కువగా శ్వేత జాతి ప్రజలుంటారు, వారిలో అధిక తిండి తినే వారికి ఒళ్ళంతా కొవ్వే. అంటే అధిక కొవ్వు చర్మం కింద ఉంటుంది. దాంతో పాటు ఒళ్ళంతా కొవ్వు నిల్వ ఉంటుంది. అందుకే అమెరికన్లలో ఊబకాయం ఎక్కువ. ఊబ కాయస్థుల సంఖ్య కూడా ఎక్కువ. అదే భారతీయుల్లో కొవ్వు ఎక్కువగా ఉదరభాగంలో అంతకు మించి గుండె లాంటి అవయవాల చుట్టూరా పేరుకొని పోతుంది. దీన్ని విసెరల్ ఫాట్ అంటారు . ఇది ప్రమాదకరం. గుండెపోట్లకు దారి తీస్తుంది. వ్యాయామం లేకుండా కేవలం క్రాష్ డైట్ తో బరువు తగ్గించాలనుకొనే వారి కండరాలు బలహీనం అవుతాయి. ఇది మెటబాలిజం (జీవన చర్యలు) వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందువల్లే అలాంటి వారు కొన్నాళ్ల పాటు డైట్ నియమాలు పాటించి, అవి మానేసాక సులభంగా బరువు పెరిగిపోతారు. అనేక మంది హీరోయిన్ ల విషయం లో ఇదే జరుగుతోంది. బరువు తగ్గాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయడం అవసరం. ఇలాంటి శిక్షణ వల్ల గుండె కూడా దృఢం అవుతుంది. శరీరం లో ఒక భాగం లో కొవ్వు ఎక్కువ ఉందనుకొందాము. ఉదాహరణకు పొట్ట భాగంలో. నూటికి తొంబై మంది ఏమనుకొంటారంటే "పొట్ట కు సంబదించిన వర్కౌట్స్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరిగి పోతుంది". కానీ ఇలా ఒక భాగానికి సంబంధించిన వర్కౌట్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరగడం అంటూ ఉండదు. ఎప్పుడయితే వ్యాయామం ప్రారంభించామో ఒక పద్దతిలో శరీరం మొత్తం లోని కొవ్వు కరిగిస్తూ వస్తుంది. ఏ విధంగానయితే కొవ్వు కొద్దికొద్దిగా పెరుగుతుందో.. అదే విధంగా వ్యాయామం చేస్తున్న కొద్ది రివర్స్‌లో తగ్గుతూ వస్తుంది. కేవలం ఒక భాగంలోనే కొవ్వు హఠాత్తుగా తగ్గడం అంటూ ఉండదు. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కావాలి . శక్తి అవసరంలో యాబై శాతం మాత్రం కార్బ్స్ ద్వారా తీర్చాలి. కానీ మన సమాజం లో నూటికి తొంబై మంది ... 90 శాతం దాక శక్తి అవసరాలను కార్బ్స్ ద్వారా తీరుస్తున్నారు. ఇలా అధిక పిండి పదార్థాలు తినడం ఒక రకమైన అడిక్షన్ (వ్యసనం). కార్బ్స్ అంటే జంక్ ఫుడ్. మైదా పిండితో చేసే వస్తువులు, పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింక్స్, చాకోలేట్స్, కుకీలు, బ్రెడ్ ఇలా నోటికి రుచికరంగా ఉండే ఏవైనా వీటికిందకే వస్తాయి. తాగుబోతును మద్యం మానమంటే ఆ వ్యక్తికి కోపం వచ్చినట్టే ఈ అధిక పిండిపదార్థాలు తీసుకునే వ్యసన పరులకు అవి తినొద్దని చెబితే నచ్చదు. పైగా కోపం కూడా వస్తుంది. తాగుబోతు కనీసం తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకొంటాడు. కానీ అధిక కార్బ్స్ పోతులు తాము వ్యసనపరులు అని కూడా గ్రహించరు. పాపం. వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారా?
1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి. హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి. ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు. విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది . దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది. అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది. ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు . సర్వే జనా సుఖినోభవంతు ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
H3N2: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..
ఏంటీ H3N2 వైరస్ ? ఇది వందేళ్ల నాటి వైరస్. H1N1 వైరస్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి వైరస్. ఇప్పుడు కొత్తగా మ్యుటేట్ అయ్యిందా ? లేదు.. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా సోకుతోందా? ప్రతి ఒక్కరికి అనేక సార్లు సోకింది. మరి ఇప్పుడు కొత్తగా భయపెడుతున్నారేంటి ? గతంలో మాస్క్‌లు లేవు. మ్యుటెంట్లకు కొత్త పేర్లు పెట్టి భయపెట్టి బిజినెస్ చేయడం గతంలో లేదు. ఇప్పుడు భయమే ఫార్మా కంపెనీల బిజినెస్. కోవిడ్ రెండో వేవ్‌లో గల్లా పెట్టెలు దాటి గోడౌన్లు నోట్ల కట్టలతో నిండాయి. ఓమిక్రాన్ వేవ్ వారిని నిరాశ పరిచింది. వాక్సీన్ల పుణ్యమా అంటూ సైడ్ ఎఫెక్ట్స్ వారు చికిత్స కోసం వెళుతుంటే బిజినెస్ బాగానే సాగుతోంది ! తిరిగి మాస్క్ లు నిభందనలు అలెర్ట్ అంటూ జనాల్లో భయం నింపి బిజినెస్ చేయాలనే ప్రయత్నం. గతం కంటే ఇప్పుడు ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకని ? రెండేళ్లు మాస్క్‌లు పెట్టుకొని వాక్సీన్లు వేసుకొని ఇమ్మ్యూనిటి ని బలహీనం చేసుకొన్నారు. ఇదే కారణం. మరి ఇప్పుడేమి చెయ్యాలి? దొంగలు దూరిన ఆరు నెలలలకు అన్నట్టు వున్నాయి కొందరి కూతలు. ఇది జనవరిలోనే మొదలయ్యింది. లక్షలాది మంది దీని బారిన పడి కోలుకున్నారు. దగ్గు రెండు మూడు వారాలు కొనసాగి తగ్గి పోయింది. ఇక ఎవరికీ రాదా? ఎవరో కొంతమందికి . రెండు నెలల్లో సోకకుండా మిగిలి పోయిన వారికి సోకుతుంది. మరి ఏమి చేయాలి? డి ,సి, బి విటమిన్ టాబ్లెట్స్ నాలుగు రోజులు( సోకినప్పుడు మాత్రం ) జింక్ టాబ్లెట్, వేడి నీరు తాగడం, వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని పుకిలించడం, పసుపు అల్లం కాషాయం టీ కప్పులో మూడు నాలుగు రోజులు వేసుకోవడం. తగినంత నీరు తాగడం. రెండు రోజులు రెస్ట్. పాత రోగానికి కొత్త మోత వద్దు. కొందరి విష ప్రచారానికి మోసపోవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి! -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్యానిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు (నోట్: ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు! -
సోషల్ మీడియా ఎఫెక్ట్: మెదడులో డోపమైన్ హార్మోన్ రిలీజ్.. అనర్ధాలు ఇవే..
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు రిప్లయ్ ఇవ్వలేదని తను ప్రేమించిన యువతిపైనే బహిరంగంగా దాడి చేశాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 2.30 గంటలకు మించి సోషల్ మీడియా సైట్లలో గడిపేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, వారు మరో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు తమ చదువు, వృత్తి కోసం కేటాయించిన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నట్టు గుర్తించారు. సాక్షి, అమరావతి: స్మార్ట్‌ఫోన్‌లో నెట్ రాకుంటే చిరాకు.. గంటపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే విసుగు.. పోస్టులకు లైక్‌లు, షేర్లు చేస్తూ కామెంట్లకు రిప్లయ్ ఇవ్వాలన్న కోరిక.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అదో మానసిక వ్యసనమే అంటున్నారు మానసిక వైద్యులు. ఇది మద్యపాన, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటిదేనంటున్నా రు. ఈ వ్యసనంపై చికాగో యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. మన దేశంలోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు తేల్చింది. ఆన్లైన్లో విహరించేవారి మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుందని, చేస్తున్న పని పదేపదే చేసేలే ఆ హార్మోన్ ఉత్తేజపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లనే ఒక్కసారి సో షల్ మీడియా సైట్లకు అలవాటుపడ్డవారు వదలలేకపోతున్నారు. ఇది ఒకస్థాయి వరకు ఇబ్బంది లేకున్నా పరిమితి మించినప్పుడు అనర్థాలకు దారితీస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు.. అలాంటివారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెనకకు వెళ్తేనే.. ముందుకు ఆన్లైన్ సెర్చింగ్ వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ ప్రకటించకున్నా వీరికి చికిత్స అందించే థెరపిస్టులు మాత్రం పెరుగుతున్నారు. అమెరికాలో సోషల్ మీడియా వ్యసనం 20 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. మన దేశంలోనూ ఈ సంఖ్య 4.7 శాతంగా ఉండగా, ఇది వచ్చే రెండేళ్లలో మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత పిల్లల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం అధికమైంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు సైకియాట్రిస్టులకు చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమం వ్యసనానికి చికిత్స కోసం అమెరికా, యూకేల్లో డి–అడిక్షన్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కాలిఫోర్నియా న్యూపోర్టు బీచ్‌లోని మీడియా సైకాలజీ రీసెర్చ్ సెంటర్లో డ్రైవింగ్, స్విమ్మింగ్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు ముందున్న పరిస్థితికి వెళ్లాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫోన్ ను పక్కనబెట్టి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ప్రత్యేక కోర్సు డిజైన్ చేశాం.. స్మార్ట్‌ఫోన్ వ్యసనం టీనేజ్ పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అదికూడా ఇంట్లో పెద్దవారే అలవాటు చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మరీ ఎక్కువైంది. చాలామంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడే అవకాశం ఉండదని స్కూళ్లకు కూడా వెళ్లడం లేదు. నావద్దకు వచ్చే పిల్లల్లో కొందరు 7 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారున్నారు. పిల్లల్లో కార్పెల్ టెన్నల్ సిండ్రోమ్‌తో మణికట్టు దెబ్బతింటుంది. అధిక సమయం తలను వంచి ఉంచడం వల్ల డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్ వస్తోంది. ఇటీవల పిల్లల్లో కొత్తగా వర్చువల్ ఆటిజం గుర్తించారు. గత పదేళ్లలో అమెరికాలో ఏడీహెచ్‌డీ బారిన పడుతున్న పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏకాగ్రత తగ్గిపోతోంది. హింసాతత్వం పెరుగుతోంది. భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. స్కూల్ పిల్లలను స్మార్ట్‌ఫోన్ నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిల్లలకు చూపిస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ పిల్లల్లో నూరు శాతం మార్పు వచ్చింది. హైస్కూల్ స్థాయి పిల్లల్లో కొందరు తీవ్రంగా ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. అలాంటి వారిని సైకియాట్రిస్టులకు చూపించాలని తల్లిదండ్రులకు సిఫారసు చేస్తున్నాం. – వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త. తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్ వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని సులువుగా తగ్గించుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. - మొదట మన స్మార్ట్ ఫోన్లో అతిగా వినియోగిస్తున్న యాప్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమ మార్గం. - పని సమయంలో, భోజనం, వినోద కార్యక్రమాల సమయాల్లో ఫోన్‌ను ఆఫ్ చేయాలి. - సోషల్ మీడియా యాప్స్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను ఆఫ్ చేయాలి. - పడకగదిలో ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను ఉంచకూడదు. - సాంకేతికతతో సంబంధం లేని కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలి. - సాధ్యమైనప్పుడుల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
Health: నీరసం, నిస్సత్తువ.. ఛాతిలో నొప్పి ఉందా? ఇవి తిన్నా, తాగినా...
Hemoglobin Count: నీరసం.. నిస్సత్తువ.. కళ్ళు తిరిగినట్టుండడం.. చర్మం పాలినట్టుండడం.. ఊపిరాడక పోవడం.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరి చేతులు చల్లగా ఉండడం.. తలనొప్పి... వీటిలో రెండు అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయా? అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్టే? ఏంటిది? హీమోగ్లోబిన్ ఇది ఎర్రరక్త కాణాల్లోని ప్రోటీన్. ఇది కొరియర్లా పని చేస్తుంది. శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హీమోగ్లోబిన్ శాతం పురుషుల్లో 13 - 16.6 మధ్యలో ఉండాలి. స్త్రీలలో 11.6 - 15 మధ్యలో ఉండాలి. మన దేశంలో సుమారుగా అరవై కోట్లమంది అనీమియాతో అంటే తక్కువ హీమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నారు. తక్కువ హీమోగ్లోబిన్‌కు ప్రధాన కారణం తీసుకొనే ఆహారంలో ఇనుము తక్కువగా ఉండడం. టెస్టులొద్దు .. ఇటీవల అయినదానికీ కానిదానికి డియాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగెత్తడం... టెస్ట్‌లు చేసుకోవడం ఒక రివాజుగా మారింది. మన హీమోగ్లోబిన్ శాతమెంత? అని ఈ మెసేజ్‌ని చదివిన వారు టెస్టులకు పరుగెత్తొద్దు. ఇవి సమృద్ధిగా ఉండాలి పై లక్షణాల్లో ఒకటో రెండో కనిపించినా ... కనిపించకపోయినా... హీమోగ్లోబిన్ను తగినంతగా ఉంచుకొనేలా చేయండి . నేను చెప్పిన పద్ధతుల్లో హీమోగ్లోబిన్ పెరుగుతుంది . దీనికి అదనపు ఖర్చుండదు. ఒకవేళ మీకు హీమోగ్లోబిన్ ఇదివరకే తగినంతగా ఉన్నా ఇలా చెయ్యడం వల్ల నష్టం జరగదు. సైడ్ రియాక్షన్లు ఉండవు. మీరు తీసుకొనే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి . 1.పాల కూర 2. క్యాబేజీ 3.బీన్స్ 4. పన్నీర్ ఇక మాంసాహారులకు అనీమియా అరుదుగా మాత్రమే వస్తుంది. కారణం మటన్ ముఖ్యంగా మటన్ కు సంబందించిన లివర్ కిడ్నీ మొదలైనవి ఐరన్ రిచ్ ఫుడ్స్. వేగంగా పెరగాలా మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నపుడు { చాల మందిలో ఇది 8 కంటే తక్కువగా ఉంటుంది. 5 కంటే తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది) ఏం చేయాలంటే? ►ఆపిల్ పండును తొక్క తీయకుండా అదేనండి ఎర్రటి పై పొట్టును సోకు కోసం తీసేయకుండా తినండి . ఇంకా ద్రాక్ష , అరటిపండు , పుచ్చకాయ కూడా ఉపయుక్తం. ►బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. మీకు ఇది వరకే షుగర్ ఉంటే మీరు ఇతర ఆహార నియమాలు పాటించకుండా ఉంటే పళ్ళు తీసుకోలేరు. ఇవి మానేయండి ►పళ్ళు తీసుకొంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. పళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది. రెండూ పరస్పర విరుద్ధ మాటలు కదా? కానీ రెండు సరైనవే . అది వేరే టాపిక్. మీకు ఇదివరకే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, ఇవి వాడకండి { తినడం / తాగడం } 1 . టీ 2 కాఫీ 3. పాలు 4. కోడి గుడ్లు .. ముఖ్యంగా తెల్ల సొన. 5 . సొయా ప్రోటీన్ { సొయా పచ్చి విషం . హీమోగ్లోబిన్ బాగున్నా వాడొద్దు . వాడితే థైరాయిడ్ లాంటివి వచ్చే ప్రమాదం} ఇవి మంచి మార్గాలు ►వ్యాయాయం ►తగినంత నీరు తాగడం ►తగినంత నిద్ర .. అనీమియా రాకుండా ఉండడానికి మంచి మార్గాలు . పోలీసైతేమియా అంటే? గత ఆరునెలల్లో వేర్వేరు ఘటనల్లో కనీసం డజను మంది తమ బ్లడ్ రిపోర్ట్స్ మెసెంజర్ ద్వారా నాకు పంపించారు. వారి హీమోగ్లోబిన్ 17 కంటే ఎక్కువ ఉంది. ఇలా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం పోలీసైతేమియా కావొచ్చు. వారందరూ నాకు రిపోర్ట్స్ పంపించడానికి 2- 5 నెలల ముందు వాక్సిన్ వేసుకొన్నవారే. అంటే వాక్సీన్ కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది కూడా ఒకటి .దీనికి మరో పేరు బ్లడ్ కాన్సర్. చైనా లో అయితే లక్షలాది మంది ఇదే సమస్య తో బాధపడుతున్నారు . హీమోగ్లోబిన్ బాగా ఎక్కువగా ఉంటే అంటే పోలీసైతేమియా ఉంటే 1 . విపరీతంగా చెమటలు పడుతాయి 2 . నీరసం తలనొప్పి { హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నా ఇవి ఉంటాయి } ౩. కీళ్ల నొప్పులు 4 . ఉన్నట్టుండి బరువు తగ్గడం 5 . పచ్చ కామెర్లు వచ్చిన్నట్టు కళ్ళు యెల్లోగా మారడం ఒకటి గుర్తు పెట్టుకోండి . ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తిన్నా పోలీసైతేమియా రాదు. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు (ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
కీర్తనలు, భజనలతో సంస్కృతి రక్షణ
మారిషస్ తెలుగువారికి వక్తల ప్రశంసలు తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు పోర్ట్ లూయిస్: భారతదేశంలో కీర్తనలు, భజనలు మరిచిపోతున్న ఈ రోజుల్లో వాటి ద్వారానే భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్న ఘనత మారిషస్ తెలుగు ప్రజలదేనని వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు. మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ ఈ 27న ప్రారంభించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. మారిషస్ ఒక మినీ ఇండియా అయినా ఇక్కడ కులాల ప్రస్తావన మచ్చుకైనా కనిపించని తెలుగు జాతిని చూశానని అమర్నాథ్ పేర్కొన్నారు. మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 150కు పైగా పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు రాష్ట్రాల విద్యావేత్త, స్లేట్ స్కూలు వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డిని మారిషస్ కేంద్రమంత్రి శాంతారామ్ సన్మానించారు. మంత్రి శాంతారామ్ మాట్లాడుతూ.. వాసిరెడ్డి అమర్నాథ్ మారిషస్ విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులను సూచించారని, వాటిని మనం తప్పకుండా ఆచరిస్తామని చెప్పారు. స్లేట్ ద స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమానికి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీరామస్వామి, మహాత్మాగాంధీ సంస్థ, రవీంద్రనాథ్ ఠాగూర్ సంస్థల డైరెక్టర్ గయన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
పోర్ట్ లూయిస్: మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ వారు ఈ 27, 28, 29 తేదీలలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెలుగు భాషా బోధన, పిల్లల్లో తెలుగు భాషాపై ఇష్టాన్ని పెంచడానికి ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, స్లేట్ ద స్కూల్ వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ మట్లాడుతూ.. ఇక్కడి తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతిని ఏళ్ల తరబడి సజీవంగా కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతిని కాపాడటానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన మారిషస్ తెలుగు మహాసభ వారు 'మారిషస్ తెలుగు మిత్ర' అన్న బిరుదునిచ్చి అమర్నాథ్ గారిని ఈ సందర్భంగా సత్కరించారు. బాలబాలికలు దీన్ని గర్వపడాల్సిన విషయంగా చూడాలని, కానీ వాళ్లు తెలుగులో మాట్లాడటానికి, భాష నేర్చుకోవడాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి 20 రోజుల పాటు వారికి తెలుగు భాషపై అవగాహన పెంచి, అనర్గళంగా మాట్లాడేటట్లు చేస్తామని చెప్పారు. ఇందుకై ప్రయాణ ఖర్చులు విద్యార్థులు భరిస్తే, వసతి, బస తాను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. -
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్: తెలుగు భాషను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగష్టు 27 వ తేదీ నుంచి 29 వరకు ఈ ఉత్సవాలను జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ పాల్గొననున్నారు. ఈ మేరకు మారిషస్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వివిధ దేశాలకు చెందిన వారందరినీ ఒక తాటిపై తెచ్చేందుకు ఏర్పాటు చేసిన 'తెలుగు డయాస్పోరా ఇంటర్నేషనల్ ' అనే సంస్థను ఈ సందర్భంగా అమర్ నాథ్ ప్రారంభిస్తారు. అదేవిధంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మారిషస్ లోని వేంకటేశ్వర ఆలయంలో తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా భజనలు, కోలాటాలు, అన్నమాచార్య కీర్తనలు, సామూహిక పూజలు, తెలుగులో పోటీల వంటి పలు కార్యక్రమాలను దేశమంతటా వైభవంగా నిర్వహించనున్నారు.