1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి.
హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి.
ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు.
విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది .
దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది.
అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది.
ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు .
సర్వే జనా సుఖినోభవంతు !
వాసిరెడ్డి అమర్ నాథ్,
విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment