uk school
-
బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారా?
1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి. హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి. ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు. విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది . దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది. అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది. ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు . సర్వే జనా సుఖినోభవంతు ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
స్కూల్లో అవమానం.. ఎన్నారై విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లో అవమానానికి గురికావడంతో.. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల యువకుడు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ నగరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాండన్ సింగ్ రయత్ అనే ఈ విద్యార్థి ఆగస్టులోనే మరణించినా.. అతడి తల్లి మీనా రయత్ ఆ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టారు. జాతీయ అవమాన వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు. అతడిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలని వైద్యులను తాను ప్రాధేయపడ్డానని ఆమె తెలిపారు. తన కుమారుడికి సాయం అందింది గానీ, అది సరిపోలేదని.. అతడి ఆందోళన మరింత దారుణంగా తయారై చివరకు పూర్తి ఫోబియాలోకి వెళ్లిపోయాడని ఆమె తెలిపారు. స్కూల్లో ఏ ఒక్కరు అతడిని ఆదరించినా ఇల్లు వదిలి ఉండేవాడు కాదని మీనా వాపోయారు. యువకుడి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు జనవరిలో జరగనుంది. ఆగస్టు 9వ తేదీన స్కార్ఫుతో ఉరి వేసుకుని అతడు తన బెడ్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కూడా పలుమార్లు అతడు ఆత్మహత్యాప్రయత్నాలు చేశాడు. మణికట్టు కోసుకోవడం, బ్లీచింగ్ తాగడం లాంటి పద్ధతులతో ప్రయత్నించి, విఫలమయ్యాడు. స్కూల్లో తోటి విద్యార్థులు అతడిని తీవ్రంగా అవమానించేవాళ్లని, విపరీతంగా తిట్టేవారని మీనా అన్నారు. దాంతో గత నవంబర్ నెలలోనే అతడు స్కూలుకు వెళ్లడం మానేశాడు. మీనా బ్యుటీషియన్ కాగా, ఆమె భర్త రాజ్ ఒక దుకాణంలో పనిచేస్తాడు. స్కూల్లో విద్యార్థులతో పాటు డాక్టర్లు కూడా తన కొడుకును సరిగా పట్టించుకోలేదని, వాళ్లంతా కలిసే తమ కొడుకును చంపేసి, తమ జీవితాలను సర్వనాశనం చేశారని ఆమె వాపోయారు. తమ హృదయాలు తీవ్రంగా గాయపడ్డాయని.. అతడికి తగిన మానసిక చికిత్స అందించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు.