స్కూల్లో అవమానం.. ఎన్నారై విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లో అవమానానికి గురికావడంతో.. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల యువకుడు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ నగరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాండన్ సింగ్ రయత్ అనే ఈ విద్యార్థి ఆగస్టులోనే మరణించినా.. అతడి తల్లి మీనా రయత్ ఆ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టారు. జాతీయ అవమాన వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు. అతడిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలని వైద్యులను తాను ప్రాధేయపడ్డానని ఆమె తెలిపారు. తన కుమారుడికి సాయం అందింది గానీ, అది సరిపోలేదని.. అతడి ఆందోళన మరింత దారుణంగా తయారై చివరకు పూర్తి ఫోబియాలోకి వెళ్లిపోయాడని ఆమె తెలిపారు. స్కూల్లో ఏ ఒక్కరు అతడిని ఆదరించినా ఇల్లు వదిలి ఉండేవాడు కాదని మీనా వాపోయారు. యువకుడి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు జనవరిలో జరగనుంది.
ఆగస్టు 9వ తేదీన స్కార్ఫుతో ఉరి వేసుకుని అతడు తన బెడ్‌రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కూడా పలుమార్లు అతడు ఆత్మహత్యాప్రయత్నాలు చేశాడు. మణికట్టు కోసుకోవడం, బ్లీచింగ్ తాగడం లాంటి పద్ధతులతో ప్రయత్నించి, విఫలమయ్యాడు. స్కూల్లో తోటి విద్యార్థులు అతడిని తీవ్రంగా అవమానించేవాళ్లని, విపరీతంగా తిట్టేవారని మీనా అన్నారు. దాంతో గత నవంబర్ నెలలోనే అతడు స్కూలుకు వెళ్లడం మానేశాడు.
మీనా బ్యుటీషియన్ కాగా, ఆమె భర్త రాజ్ ఒక దుకాణంలో పనిచేస్తాడు. స్కూల్లో విద్యార్థులతో పాటు డాక్టర్లు కూడా తన కొడుకును సరిగా పట్టించుకోలేదని, వాళ్లంతా కలిసే తమ కొడుకును చంపేసి, తమ జీవితాలను సర్వనాశనం చేశారని ఆమె వాపోయారు. తమ హృదయాలు తీవ్రంగా గాయపడ్డాయని.. అతడికి తగిన మానసిక చికిత్స అందించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు.