మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
పోర్ట్ లూయిస్: మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ వారు ఈ 27, 28, 29 తేదీలలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెలుగు భాషా బోధన, పిల్లల్లో తెలుగు భాషాపై ఇష్టాన్ని పెంచడానికి ఒక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, స్లేట్ ద స్కూల్ వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ మట్లాడుతూ.. ఇక్కడి తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతిని ఏళ్ల తరబడి సజీవంగా కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతిని కాపాడటానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన మారిషస్ తెలుగు మహాసభ వారు 'మారిషస్ తెలుగు మిత్ర' అన్న బిరుదునిచ్చి అమర్నాథ్ గారిని ఈ సందర్భంగా సత్కరించారు.
బాలబాలికలు దీన్ని గర్వపడాల్సిన విషయంగా చూడాలని, కానీ వాళ్లు తెలుగులో మాట్లాడటానికి, భాష నేర్చుకోవడాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి 20 రోజుల పాటు వారికి తెలుగు భాషపై అవగాహన పెంచి, అనర్గళంగా మాట్లాడేటట్లు చేస్తామని చెప్పారు. ఇందుకై ప్రయాణ ఖర్చులు విద్యార్థులు భరిస్తే, వసతి, బస తాను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.