మారిషస్ తెలుగువారికి వక్తల ప్రశంసలు
తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు
పోర్ట్ లూయిస్: భారతదేశంలో కీర్తనలు, భజనలు మరిచిపోతున్న ఈ రోజుల్లో వాటి ద్వారానే భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్న ఘనత మారిషస్ తెలుగు ప్రజలదేనని వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు. మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ ఈ 27న ప్రారంభించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. మారిషస్ ఒక మినీ ఇండియా అయినా ఇక్కడ కులాల ప్రస్తావన మచ్చుకైనా కనిపించని తెలుగు జాతిని చూశానని అమర్నాథ్ పేర్కొన్నారు. మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 150కు పైగా పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు రాష్ట్రాల విద్యావేత్త, స్లేట్ స్కూలు వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డిని మారిషస్ కేంద్రమంత్రి శాంతారామ్ సన్మానించారు.
మంత్రి శాంతారామ్ మాట్లాడుతూ.. వాసిరెడ్డి అమర్నాథ్ మారిషస్ విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులను సూచించారని, వాటిని మనం తప్పకుండా ఆచరిస్తామని చెప్పారు. స్లేట్ ద స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమానికి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీరామస్వామి, మహాత్మాగాంధీ సంస్థ, రవీంద్రనాథ్ ఠాగూర్ సంస్థల డైరెక్టర్ గయన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.