దమ్మారో ధం... జీనత్ అమన్ నటించిన హరే రామ హరే కృష్ణ సినిమా లోని పాట. హిప్పీలు గంజాయి కొడుతూ ఎంజాయ్ చేసే సీన్ ఇది. వాసిరెడ్డి సీత రచించిన మారీచిక నవలను, కొంతకాలం ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.
ఇందులో ఒక అమ్మాయి హిప్పీగా మారిపోతుంది.. మరో అమ్మాయి నక్సల్స్‌లో చేరిపోతుంది. కోర్టు ఆదేశాల మేర ఆ నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పుడు ఆ నవలను చదివాను. అసలే చిన్న వయసు. రెండు రోజులు పిచ్చెక్కిపోయింది.
హిప్పీ ఉద్యమం..
1965లో అమెరికాలో మొదలయ్యింది. 1970 కల్లా ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. సమాజం ధోరణి నచ్చని యువత చేసిన ఒక రకమయిన తిరుగుబాటు ఇది. తిరుగుబాటు అనడం కన్నా దారి తప్పిన పెడధోరణి అనడం సబబు. పొడవాటి చింపిరి జుట్టు .. బెల్ బాటమ్ పాంట్స్ .. ఇల్లు వదలి పెట్టి తనలాంటి తిక్క సన్నాసులతో చేరి గ్రూప్ లు గ్రూప్ లుగా దిమ్మరిలా ఊరూరా తిరగడం. నీది నాది అనేది లేదు. అంతా మనదే అనే ఫిలాసఫీ. సామూహిక జీవనం, నచ్చిన వారితో సెక్స్, మాదక ద్రవ్యాలు... 1970లలో తెగ నడిచింది. అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. గోవాలో అయితే ఆరంభోల్ బీచ్ అంతా వీరే ఉండేవారట. వీరు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం అంజునా మార్కెట్ ఉండేది.
ఇక భవిషత్తు అంతా ఇలాగే ఉంటుంది అని అప్పట్లో మేధావుల అంచనా. ఏమయ్యింది? 1980 వచ్చేటప్పటికి హిప్పీ ఉద్యమం మాయమయింది. ఆ నాటి హిప్పీ హీరోలు హీరోయిన్‌లు మాయమయిపోయారు. మాదక ద్రవ్యాలు తిని అప్పుడే ఎంతో మంది పోయారు. ఎవరైనా బతికున్నా వృద్ధాప్యంతో పోయుంటారు. యాభై ఏళ్ళ నాడు వారు 25 ప్లస్ వయసు వారు.. అంటే ఇప్పుడు 75 ప్లస్. ఏ వెర్రి అయినా కొంత కాలం ట్రెండింగ్ కావొచ్చు. కానీ అదే భవిషత్తు కాదు. ఇక పై పెళ్లిళ్లు వుండవు .. కుటుంబాలు ఉండవు అనుకొనే వారు ఈ నిజాన్ని గమనించాలి.
ఆ నాటి హిప్పీలు శారీరక సమస్యలు, వివిధ రోగాలతో పోయారు. నేటి వివాహ కుటుంబ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కొత్త తరం హిప్పీలు మానసిక రోగాలతో పోతారు. ప్రకృతి అనేది ఒకటుంటుంది. అన్ని విషయాలను అది చూసుకొంటుంది. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. సొంత అనుభవంతో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాడు వెబ్ పేజీలలో కేసు స్టడీ కీర్తి శేషుడిగా మిగిలిపోతాడు. మిగతా వారి అనుభవం నుంచి నేర్చుకొనేవాడు తెలివయినవాడు. బతకడం తెలిచినవాడు.
మీరు కేస్ స్టడీ అవుతారా? తెలివిగా బతుకుతారా? తేల్చుకోండి
వాసిరెడ్డి అమర్ నాథ్
మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త
Comments
Please login to add a commentAdd a comment