లండన్ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్ అథ్యయనం పేర్కొంది.
రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్‌ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment