
సిడ్నీ : వేగంగా నడవడం గుండెకు మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 30 సంవత్సరాల వయసు పైబడిన వారు గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గుండెపోటు, స్ర్టోక్ ముప్పు మెల్లిగా నడిచేవారితో పోలిస్తే సగం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అన్ని వయసుల వారూ వేగంగా నడిస్తే ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుందని, జీవనకాలం 15 సంవత్సరాలు పెరుగుతుందని పేర్కొన్నారు. వేగంగా నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అథ్యయనం పేర్కొంది.
గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్లు నడవడం వేగవంతమైన నడకగా గుర్తిస్తామని, అయితే ఇది నడిచేవారి ఫిట్‌నెస్ స్ధాయిలపై ఆధారపడిఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ ఇమ్మానుయేల్ స్టమటకిస్ తెలిపారు. వేగవంతమైన నడకకు మరో సంకేతంగా చిరు చెమట పట్టడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.
1994 నుంచి 2008 వరకూ 11 జనాభా లెక్కల ప్రామాణికంగా 50,000 మంది ఆరోగ్య రికార్డులను అథ్యయనంలో భాగంగా పరిశోధకులు పరిశీలించారు. నడక వేగాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, అకాల మరణం ముప్పును నివారించవచ్చని తమ ఫలితాలు సూకచిస్తున్నాయని ప్రొఫెసర్ స్టమటకిస్ చెప్పారు.