ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యమే మహా భాగ్యం..’ అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రపంచంలో వెలకట్టలేని వాటిల్లో ఆరోగ్యానిది మొదటి స్థానం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేస్తూ చురుకైన జీవనశైలి పాటిస్తున్న ఉద్యోగులకు దీర్ఘాయువు సొంత మవడమే కాదు, అతని కుటుంబం, పని చేసే సంస్థ, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రజల ఆరోగ్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. మనదేశంలోని విద్యావంతుల్లో అధిక శాతం కూర్చుని పనిచేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
ఆలోచన మంచిదే అయినా.. దీర్ఘకాలం వ్యాయామానికి, వాకింగ్‌లకు దూరంగా ఉండటం వల్ల శరీరంలో జబ్బులకు ‘టులెట్’ బోర్డు పెట్టినట్లేనని, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగులను రోగాలు చుట్టుముట్టేందుకు ఎంతోకాలం పట్టడంలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బు వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే.. అంతవరకు సంపాదించింది క్షణాల్లో కరిగిపోతున్న ఉదంతాలు రోజూ చూస్తున్నాం.. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసే లక్షలాది మందిలో అధిక శాతం కంప్యూటర్ల మీదనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఈ సర్వే ఓ మేలుకొలుపు లాంటిదని వైద్యులు సూచిస్తున్నారు. పావుగంట నడిస్తే.. అన్ని రోగాలను దూరం పెట్టినట్లేనని స్పష్టంచేస్తున్నారు. (చదవండి: పిల్లలు గంట.. పెద్దలు 45 నిమిషాలు)
ప్రాణాలు..పైసలు భద్రం
ఈరోజుల్లో ఆసుపత్రికి వెళ్తే.. ఒక మనిషి జీవిత సంపాదనే కాదు, అతని ఆస్తులు అమ్ముకున్నా.. క్షేమంగా వస్తాడన్న గ్యారెంటీ ఉండటం లేదు. చికిత్స కంటే నివారణ మేలు అన్న మాట ప్రకారం.. రోగాలు వచ్చాక జాగ్రత్త పడటం కంటే దానికి దూరంగా ఉండేలా ప్రతీరోజూ అదనంగా 15 నిమిషాలు నడవాలని సర్వే చెబుతోంది. దానివల్ల ప్రతీ ఉద్యోగి పనితీరులో మెరుగైన ప్రదర్శన కనిపిస్తున్నట్లు కూడా గుర్తించింది. ఇలా రోజూ వాకింగ్, జాగింగ్ చేసే వారు ఆసుపత్రులకు తక్కువగా వెళ్తున్నారని, తద్వారా తమ ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని భద్రంగా ఉంచుతూ దీర్ఘాయువులుగా జీవిస్తున్నారని గమనించింది. 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్యవారిలో రోజుకు 15 నిమిషాలు నడవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 బిలియన్ డాలర్లు అంటే మన లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ప్రకటించింది. మన కరెన్సీలోకి మారిస్తే.. దీని విలువ దాదాపు రూ.73 లక్షల కోట్ల మేర ఉంటుందని తెలిపింది.
30 శాతం బద్ధకస్తులే..
ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 100 మందిలో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా దాదాపు 30 మంది గడుపుతున్నారని సర్వే గుర్తించింది. అయితే, వీరిలో చాలామంది పనిచేయలేని బద్ధకస్తులు కాదు.. ఐటీ, ప్రైవేటు ఉద్యోగ జీవితాల వల్ల వ్యాయామానికి దూరంగా ఉన్నారు. వీరిలో ఏటా 50 లక్షల మంది వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతోనే మరణిస్తున్నారని సర్వే తేల్చిచెప్పింది. ఈ లెక్కన రాష్ట్రంలోని హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో కదలకుండా పనిచేసే ఉద్యోగులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగిందని, ఇప్పటికైనా మేల్కొనాలని హెచ్చరిస్తున్నారు.
నడకతో రోగాలు దరిచేరవు
ప్రతీరోజూ నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. భారతీయులు ఉద్యోగాల్లో ఎదుర్కొం టున్న ఒత్తిళ్ల కారణంగా షుగర్, బీపీ, గుండె జబ్బుల బారినపడుతున్నారు. నడవడం వల్ల కండరాలు బలోపేతమవడంతో పాటు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం, సానుకూల ఆలోచనలతో ప్రతి ఉద్యోగి వృత్తిలో మెరుగైన పనితీరును కనబరిచే అవకాశాలు పుష్కలం. అందువల్ల వీలును బట్టి చిన్న చిన్న దూరాలకు నడిచే వెళ్లడం, లిఫ్ట్‌కు దూరంగా ఉండటం, ఇంటి పని, వంట పని చేసుకోవడం మరింత ఉత్తమం.
– డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment