చలికాలం కొన్ని ప్రత్యేకమైన శారీరక ఇబ్బందులకు నిలయం. ముఖ్యంగా కండరాలు బిగువుగా మారడం వలన జాయింట్లు పట్టుకుంటాయి. జీర్ణక్రియ (మెటబాలిక్ రేటు) సహజంగానే తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా, శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీనికితోడు డీ హైడ్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో చెమట ద్వారా ఎక్కువ నీరు బయటకు పోవడం, చలికాలంలో శరీరంలో తగినంత నీరు లేక డీ హైడ్రేషన్‌కు కారణమవుతుంది.. వేసవి కాలంలో నీరుతాగడం ఎంత ముఖ్యమో చలికాలంలో కూడా అంతే అవసరం ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం వలన పెదవులు ఎండిపోవడం, చర్మం పొడి పొడిగా ఉండడం, పగుళ్ల వంటివి నివారించవచ్చు. వీటి వలన జలుబు, దగ్గు గొంతు నొప్పి మంట ఆస్తమా కాళ్లు, చేతులు చల్లబడిపోవడం పొడిచర్మం, గుండెపోటు సమస్యలు ఎక్కువ అవుతాయి. శరీరంలో అన్ని కండరాలతోనూ, జాయింట్స్‌తోనూ పనిచేయడం ముఖ్యం. అందుకు సంబంధించిన అంగచాలనాలు, అంగ బంధనాలు, ఎక్సర్‌సైజులు చేయడం ముఖ్యం. ఆసనాలు చేయడానికి ముందు శరీరాన్ని బాగా సిద్ధం చేయాలి. ప్రాణాయామాలలో మూడు రకాల ప్రాణాయామాలు ఉంటాయి.
1. శీతలీకరణ ప్రాణాయామాలు 2. సమశీతోష్ణ క్రియ ప్రాణాయామాలు
3. ఉష్ణక్రియ ప్రాణాయామాలు
వీటిలో ఉష్ణం జనింపజేసేటువంటి సూర్యబేధి, భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన ప్రాణాయామాలు చేయాలి. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వలన షుగర్ మెటబాలైజ్ కాదు. అందువలన పాల పదార్థాలు, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు తినడం మంచిది కాదు. ఇక చలికాలపు సమస్యలకు చెక్‌పెట్టేందుకు చేయాల్సిన ఆసనాల గురించి తెలుసుకుందాం.
1. తాడాసన
సమస్థితిలో నిలబడి చేతులు రెండూ పైకి తీసుకు వెళ్లి ఇంటర్‌లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మడమలు పైకి తిప్పుతూ ముందరి కాలి వేళ్ల మీద నిలబడి శరీరాన్ని నడుం భాగం నుంచి పూర్తిగా పైకి సాగదీయాలి. శ్వాస వదులుతూ తిరిగి పాదాలు భూమి మీద పూర్తిగా ఆనించి చేతులు ఇంటర్‌లాక్ చేసిన స్థితిలోనే తల మీద పెట్టుకుని కొంచెం రిలాక్స్ అయి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకు... 5 లేదా 10 రిపిటీషన్స్ చేయాలి. తొందరపాటు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా చేయడం చాలా ముఖ్యం.
2. కటి చక్రాసన: ఇందులో ఐదారు రకాల ఆసనాలున్నాయి. కాని ఈ క్రియకు సంబంధించినంతవరకూ ఈ ఫొటోల్లో చూపిన కటి చక్రాసనం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచి, ముందుకు వంగి శ్వాసతీసుకుంటూ కుడి చెయ్యి ఎడమ పాదానికి దగ్గరగా ఎడమచెయ్యి పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమవైపుకు ఎడమ చెయ్యి పైకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ వైపుకు ఎడమచెయ్యి కుడి పాదానికి దగ్గరగా కుడి చేయిపైకి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా కుడికి ఎడమకు 5సార్లు చొప్పున చేయాలి. అవసరమైతే మోకాళ్ళు ముందుకు కొంచెం వంచవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య ఉంటే చేతులు ఎంతవరకు తీసుకువెళ్లగల్గితే అంతవరకే తీసుకువెళ్లండి.
3. ఊర్థ్వ మేరు చాలన (వామ దక్షిణ) ఎడమ వైపునకు చాలనం చేసేటప్పుడు కుడి చేతిని పక్క నుంచి పైకి తీసుకెళ్లి మోచేయి పైకి చూపించే విధంగా కుడి అరచేయి ఎడమ భుజంపైకి, ఎడమ చేయి కింద నుంచి నడుం వెనుకకు వచ్చే విధంగా చేయాలి. ఇదే విధంగా మళ్లీ రెండవవైపు కూడా చేయాలి. ఒక కాలు స్థిరంగా ఉంచి రెండవ కాలి మడమపైకి లేపి చేసినట్లయితే పూర్తి స్థాయిలో ట్విస్టు అయిన అనుభూతి పొందవచ్చు. ఇలా 5 లేదా 10 రిపిటీషన్లు చేయాలి.
ఉపయోగాలు: ఊటరితిత్తుల పై భాగాలకు, మెదడులోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీని వలన అల్జీమర్స్, పార్కిన్‌సన్, బ్రెయిన్ ఎటక్సియా వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. భుజాలు, పై భాగాలకు, మెడకు మంచి వ్యాయామం అందుతుంది. స్టెర్నో క్లెయిడో మస్టాయిడ్ కండరాలకు, డీప్ నెక్ ఫ్లెక్సార్ కండరాలకు వ్యాయామం జరిగి మెడకు సంబంధించిన సమస్యలతో పాటు, సర్వైకల్ స్పాండిలైటిస్, మైగ్రేన్ సమస్యల నుంచి విముక్తికి సహకరిస్తుంది.
ముఖ్య గమనిక: అన్ని చాలనములు చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు పనికిరాదు. శ్వాస తీసుకుంటూ, వదులుతూ నిదానంగా చేయడం, చేతుల కదలికల స్థాయి కొంచెం ఎక్కువగా ఉండేట్టు జాగ్రత్తగా చేయడం ముఖ్యం. అప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ మూడు చాలనములు చేయడం వలన వృద్ద్ధాప్యంలో వచ్చే లోడోసిస్, కైపోసిస్, స్కోలియోసిస్ సమస్యలను నివారించవచ్చు. ఒకవేళ ఇప్పటికే అటువంటి డీవియేషన్ ఉన్నట్టయితే వాటి కరెక్షన్‌కు ఉపకరిస్తుంది.
– సమన్వయం: ఎస్. సత్యబాబు
మోడల్: ఈషా హిందోచా, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment