4 లేన్లుగా కొత్త జాతీయ రహదారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులను ఒకేసారి నాలుగు లేన్లుగా నిర్మించనున్నట్టు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీకి ఈ మేరకు విన్నవించగా సానుకూలంగా స్పందించాన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 1,018 కిలోమీటర్ల నిడివి ఉన్న 6 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు 15 రోజుల్లో అనుమతి రానుందని గురువారం సచివాలయంలో వెల్లడించారు. కేంద్రం దారిలోనే రాష్ట్ర పరిధిలో కూడా వీలున్న చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తామన్నారు.
అవసరమైన సిమెంటును రాయితీ ధరకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.‘‘జడ్చర్ల-రాయచూర్ రోడ్డును 4 లే న్లుగా మార్చేందుకు, జగిత్యాల-వరంగల్ జాతీయ రహదారిని ఖమ్మం దాకా పొడగించేందుకు గడ్కరీ అనుమతించారు. శంషాబాద్-నాగ్‌పూర్ రోడ్లపై కట్టడాలను తొలగించి విస్తరించేందుకూ సరేనన్నారు. ఖమ్మం మాదిరిగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కూడా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గుర్తించి, రూ.2,000 కోట్లతో ప్రత్యేక రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చాం. తెలంగాణకు 2 డ్రై పోర్టులు కేటాయించేందుకూ సుముఖత వ్యక్తం చేశారు. వీటి ఎంపికకు అధ్యయన బాధ్యతను ప్రైవేటు సంస్థలకు సీఎం అప్పగించారు’’ అని చెప్పారు. కొత్త సచివాలయ భవనం డిజైన్ రూపకలప్పన బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించామన్నారు. గోదావరిని జలరవాణాకు కేంద్రం ఎంపిక చేయనుందని, బాసర నుంచి చెన్నై దాకా సరుకు రవాణామార్గంగా అభివృద్ధి చేస్తారని వివరించారు.