జాడలేని జీఎం అయోమయంలో చెరకు రైతులు
ఇక క్రషింగ్ లేనట్టే! కార్మికులకు అందని వేతనాలు
కాలనీకి సైతం నీటి సరఫరా బంద్ ఫ్యాక్టరీ వదిలివెళ్లిన జీఎం
కార్మికులు నివసించే కాలనీకి తాగునీటి సరఫరా బంద్
రెండు నెలలుగా అందని వేతనాలు
చెరకు రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
మెదక్: నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్‌ఎల్) మూతపడింది. దీంతో చెరకు రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. జీఎం నాగరాజు ఫ్యాక్టరీలోని కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోయాడు. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. మంభోజిపల్లి గ్రామ శివారులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1988లో అప్పటి ప్రభుత్వం నిర్మించింది. నాటి నుంచి ఫ్యాక్టరీ పరిధిలోని 12 మండలాలకు చెందిన చెరకు రైతులకు కల్పవల్లిగా మారింది. అప్పట్లో దీని పరిధిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. 600 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేయగా, 1000 మంది సీజనల్ కార్మికులు పనిచేసేవారు.
2002లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీలోని 51 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. దీంతో ఫ్యాక్టరీలోని కార్మికుల సంఖ్యను 140కి కుదించారు. గతేడాది కేవలం 97 మెట్రిక్ టన్నుల చెరకును మాత్రమే గానుగాడించిన యాజమాన్యం ఈ యేడు ఫ్యాక్టరీనే లాకౌట్ చేసేం దుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించక పోవడంతో దీని పరిధిలోని 12మండలాల చెరకు రైతులు సాగుచేసిన 1.27 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. దీంతో టన్ను ఒక్కటికి రూ.1200 అదనపు ఖర్చు వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్టంలో మూతపడనున్న మొదటి ఫ్యాక్టరీ
ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ నాయకులు మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీలను తాము అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవడం కాదు కదా.. కనీసం సీజన్‌లో నడిపించలేక పోయారని చెరకు రైతులు వాపోతున్నారు.
భిక్షాటనకు సిద్ధమవుతున్న కార్మికులు
ఫ్యాక్టరీ మూసి రైతులను రోడ్డున పడేసిన యాజమాన్యం కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. పాతికేళ్లుగా ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు అటు ప్రభుత్వం, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయం చేసిందని, నిబంధనల ప్రకారం వేతన సవరణ చేపట్టలేదన్నారు. ఇక వేతనాలు చెల్లించలేమంటూ యాజమాన్యం మొండికేస్తోదని, మరో రెండు రోజుల్లో వేతనాలు రాకుంటే భిక్షాటన చేసి కుటుంబాలను పోషించుకుంటామన్నారు.
కాలనీకి నీటిసరఫరా బంద్
ఫ్యాక్టరీ సమీపంలోని కార్మికుల కాలనీలో 100కుపైగా కుటుంబాలు ఉంటున్నాయి. కాలనీకి ర్యాలమడుగు శివారులోని పసుపులేరు నుంచి నీటి సరఫరా అవుతుంది. పది రోజుల క్రితం వాగులో నీటి ఊటలు తగ్గడంతో నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో కార్మికులే రింగుల నుంచి ఇసుకను తొలగించారు. అలాగే రెండుచోట్ల పైప్‌లైన్ పగలడంతో కార్మికులే మరమ్మతులు చేసుకుంటున్నారు.
మా భవిష్యత్తు ఏమవుతుందో..
ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించని యాజమాన్యం మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రెండు నెలలుగా జీతాలు రాక మా కుటుంబాలు అర్థాకాలితో అలమటిస్తున్నాయి. యాజమాన్యం స్పందించకుంటే మాకు ఆత్మహత్యలే గతి.
-ప్రభాకర్,టీఎంఎస్‌వర్కింగ్‌ప్రెసిడెంట్
జీతాలు రాకుంటే భిక్షాటనే గతి
మాకు రావాల్సిన రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించకుంటే మెదక్ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో భిక్షాటన చేస్తాం. ఇప్పటికే పస్తులుంటున్న మా కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.
-ముక్తార్, టీఎంఎస్ సెక్రటరీ
ఎన్డీఎస్‌ఎల్ మూత..?
Published Fri, Dec 4 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement