
అమ్మో.. లక్ష రూపాయలా!
► ఔత్సాహికులకు కష్టంగా కొత్త ఎక్సైజ్ విధానం
► మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు పెంపుపై ఆందోళన
► చిన్న సిండికేట్లకూ కష్టకాలమే
► పెద్ద సిండికేట్లు, లిక్కర్ మాఫియాకు అనుకూలం
సాక్షి, హైదరాబాద్ : ‘గతంలో రెండు మద్యం షాపులకు దరఖాస్తు చేస్తే రూ.లక్ష నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఒక్క దుకాణానికే రూ లక్షంట! ఇద్దరం ముగ్గురం కలసి మనిషికి రూ 50 వేలు వేసుకుని రెండు, మూడు దుకాణాలకు టెండర్లు వేసే వాళ్లం. ఇప్పుడు ప్రతి దుకాణానికి రూ.లక్ష పోగొట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఈసారి నేను మద్యం లాటరీలో పాల్గొనడం లేదు’ – ఓ మధ్యతరగతి వ్యాపారి మనోగతమిదీ
‘అబ్బో.. లక్ష రూపాయలా? పోయిన సారి 20 షాపులకు టెండర్లు వేస్తే రూ.10 లక్షలు పోయినా ఓ షాపు తగిలింది. కానీ ఈసారి అన్ని వద్దు. ఐదు నుంచి 10 దుకాణాలకు మించొద్దు.. దుకాణం తగలక పోతే లక్షలకు లక్షలు నష్టపోతాం. అందుకే షాపులు తగ్గిద్దాం’
– ఇది ఓ చిన్నతరహా లిక్కర్ సిండికేట్ ప్రాథమిక నిర్ణయం
ఈ సారి మద్యం దుకాణాల టెండర్‌కు దరఖాస్తు ఫీజును రూ.లక్షగా నిర్ణయించటం వ్యాపారులను బెంబేలేత్తిస్తోంది. నూతన మద్యం పాలసీలో ఎవరూ ఊహించని విధంగా దరఖాస్తు ధరను రెట్టింపు చేయడం, లాటరీలో షాపు రాకుంటే రూ.లక్షలు నష్టపోయే పరిస్థితి ఉండడంతో ఔత్సాహిక, దిగువ స్థాయి వ్యాపారులు ఈసారి మద్యం లాటరీల్లో పాల్గొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని సాధ్యమైనన్ని ఎక్కువ దుకాణాలు సొంతం చేసుకోవటానికి పెద్ద లిక్కర్ సిండికేట్లు మంత్రాంగం మొదలు పెట్టాయి.
పాత లిక్కర్ మాఫియాకు జీవం...
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక దశలో మద్యం వ్యాపారం పూర్తిగా లిక్కర్ మాఫియా, సిండికేట్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఈ నేపధ్యం లో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ పక్కా కసరత్తుతో మద్యం పాలసీని రూపొందిం చారు. ఔత్సాహిక వ్యాపారులను ఆకర్షించి సిండికేట్లకు, లిక్కర్ మాఫియాకు అవకాశం లేకుండా చేశారు. ఆయన రూపొందించిన పాలసీనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తూ వచ్చారు.
కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఎక్సైజ్ పాలసీ పాత లిక్కర్ మాఫియాకు జీవం పోసే విధంగా ఉందని ఎక్సైజ్ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.లక్షగా నిర్ణయించడం, ఈ సొమ్ము తిరిగి రాకపోవటంతో ఈ సారి టెండర్లు వేయటానికి యువ, దిగువ శ్రేణి వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పాత సిండికేట్లు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ దెబ్బకు ముక్కలు ముక్కలుగా విడిపోయిన ఈ సిండికేట్ల సభ్యులు ఒకే గొడుగు కిందకు వచ్చి భారీగా మద్యం దుకాణాలను చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
రాబడి తగ్గదు కానీ....
నూతన ఎక్సైజ్ పాలసీతో ప్రభుత్వానికి రాబడి ఏమాత్రం తగ్గదు. గతంలో కంటే ఇంకా ఎక్కువగానే వస్తుంది. గత పాలసీలో దరఖాస్తుల ద్వారా రూ.150 కోట్లు వస్తే ఈ సారి రూ.250 కోట్లకుపైగానే ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది. పాత లిక్కర్ మాఫియా చేతిల్లోకి ఎక్కువగా మద్యం దుకాణాలు వెళ్తే మళ్లీ పాత జమానా మొదలయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి పాలసీ ద్వారా కనీసం 40 శాతం మంది యువ వ్యాపారులు మార్కెట్‌లోకి వస్తేనే వ్యాపారం ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లో సాగుతుందని వారు చెప్తున్నారు.
ప్రస్తుత పాలసీని చూస్తే మాత్రం యువ వ్యాపారులు వచ్చే పరిస్థితి కనిపించటం లేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. మాఫియా రంగంలోకి దిగితే మొదటి, రెండు టర్మ్‌ల వరకు అంటే మొదటి ఆరు నెలల వరకు టీఎస్‌బీసీఎల్ మద్యాన్నే తీసుకొని విక్రయిస్తారని, ఆ తరువాత అక్రమాలకు తెగబడే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎన్డీపీఎల్ మద్యం దిగుమతి చేసుకొని విక్రయించే అవకాశం ఉంది. అదే జరిగి ప్రజారోగ్యం ప్రమాదంలో పడటంతో పాటు, ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
కొత్త వాళ్లు రారు
దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు చేయటం వల్ల కొత్త వాళ్లు వ్యాపారంలోకి దిగటానికి భయపడుతున్నారు. మద్యం దుకాణం టెండర్ వేయాలని మా ఊరులోనే నలుగురు యువకులు ప్లాన్ చేసుకున్నారు. కానీ రూ.లక్ష లైసెన్స్ ఫీజుకు భయపడి వెనుకడుగు వేశారు.
– శ్రీనివాస్, బెజ్జంకి
టెండర్లు తగ్గించుకుంటాం
కనీసం 10 దుకాణాలకైనా టెండర్ వేద్దామనుకున్నాం. పదింటిలో ఒక్క దుకాణం వచ్చినా చాలు. కానీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెట్టడంతో వెనుకడుగు వేశాం. రెండు , లేదా మూడు దుకాణాలకు మాత్రమే టెండర్లు వేస్తాం. – ప్రభాకర్, కొమురవెల్లి