
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు పది రోజుల్లో వెల్లడికానున్నాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చర్యలు ముమ్మరం చేసింది. ఇక ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. బుధవారం ఆయా పోస్టులకు 1ః3 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపించింది. వాటిని, మరిన్ని వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది.
స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ (తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళ్) పోస్టులకు, అలాగే వివిధ మాధ్యమాల్లో మేథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ పోస్టులకు సంబంధించిన జాబితాలను ప్రకటించింది. మొత్తంగా 1,941 పోస్టులకు సంబంధించి 1ః3 నిష్పత్తిలో 4,989 మంది అభ్యర్థులను (వికలాంగులకు 1ః5 నిష్పత్తిలో) ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆయా పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పాత జిల్లాల కేంద్రాల్లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా వెరిఫికేషన్ తేదీలను తరువాత వెల్లడిస్తామని తెలిపింది.
‘ఫిజికల్ సైన్స్’జాబితాలో సవరణ
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పంపించిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జాబితాలోని అభ్యర్థుల బయోడేటాలో తేడాలు ఉన్నట్టుగా గుర్తించామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అందువల్ల ఆ జాబితాను సవరిస్తామని, దానిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది. 132 పోస్టులకు సంబంధించిన రివైజ్డ్ ర్యాంకులను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment