వేతన వేదన! | Sakshi
Sakshi News home page

వేతన వేదన!

Published Tue, Nov 24 2015 12:21 AM

no incriments for outsourcing employs

సకాలంలో జీతాలందక వైద్య, ఆరోగ్య
 శాఖలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విలవిల
 మూడునెలలకోసారి విడుదల చేస్తున్న వైనం
 జీతాల పెంపుపైనా మీనమేషాలు  
 ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
 జిల్లా ఆస్పత్రిలో వీరిదే కీలకపాత్ర

 
 సాధారణంగా ఉద్యోగం చేసే సగటు వ్యక్తికి ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు జీతం డబ్బులు చేతికొచ్చేస్తాయి. కానీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మాత్రం నెలనెలా వేతనాలు అందని ద్రాక్షే. కనిష్టంగా మూడునెలలు దాటిన తర్వాతే వేతనాలు రావడం వారికి పరిపాటిగా మారింది. సర్కారు నిర్లక్ష్యం.. దానికితోడు అధికారుల ఉదాసీన వైఖరితో వారికి క్రమం తప్పకుండా జీతం రాని పరిస్థితి తలెత్తింది.
 సాక్షి, రంగారెడ్డి జిల్లా :  తాండూరులోని జిల్లా ఆస్పత్రితో సహా పలు క్లస్టర్ ఆస్పత్రుల్లో రెండు వందలకుపైగా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరికి నెలావారీగా వేతనాలు అందక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మూడు నెలలు గా జీతాలు అందలేదు.
 
 నాలుగో తరగతి కేటగిరీలోని ఆయా తదితరులకు ఆర్నెళ్లుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులుచేసి పూటగడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి వేతనాలకు సంబంధించి దాదాపు రూ.25 లక్షల బకాయిలున్నట్లు అంచనా. జిల్లాలో వైద్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలే నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్యంతోపాటు ఎక్స్‌రే, డార్క్‌రూం అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్ తదితర కేటగిరీల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఉన్నారు.
 
 కొన్నిచోట్ల రెగ్యులర్ ఉద్యోగులున్నప్పటికీ పనిఒత్తిడిని బట్టి వీరిని ఎంపిక చేసుకున్నారు. ప్రాధాన్యత ఉన్న విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతన చెల్లింపుల్లో జాప్యం చేయడంతో వారంతా సమ్మె బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనున్నట్లు సంఘనేత శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. సమ్మె చేపడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు స్తంభించిపోనున్నాయి.
 
 పెంపులోనూ నిర్లక్ష్యమే..
 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనపెంపులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేసిన సమయంలో ఇతర కేటగిరీల్లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచాలి. కానీ ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. గతంలో రెండుసార్లు పీఆర్‌సీతోపాటే వేతనాలు పెంచగా.. ఇప్పుడు సర్కారు వేతన పెంపుపై మౌనం వహించిందని ఫార్మసిస్టు అనీల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 శమదోపిడీ జరుగుతోంది..
 ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నప్పటికీ.. వేతనాలు మాత్రం ఉపాధి కూలీల కంటే తక్కువగా చెల్లిస్తోంది. తాండూరు జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి రూ.50వేల వేతనం ఇస్తుండగా.. అదే ఆస్పత్రిలో అదే ఉద్యోగం చేస్తున్న నాకు రూ.9,200 ఇస్తోంది. మా ఇద్దరి మధ్య వేతనాల విషయంలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇంతే. గతంలో రెండుసార్లు పీఆర్‌సీ అమలు చేశారు. కానీ ఈసారి మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీఆర్‌సీ అమలు చేయకుండా నిలుపుదల చేసింది.
                                                                                 - శ్రీనివాస్, డార్క్‌రూమ్ అసిస్టెంట్, తాండూరు ఆస్పత్రి
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement