ఆరుబయట వంట .. వానోస్తే తంటా! | No kitchen sheds for lot of schools | Sakshi
Sakshi News home page

ఆరుబయట వంట .. వానోస్తే తంటా!

Published Thu, Aug 31 2017 3:30 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

ఆరుబయట వంట .. వానోస్తే తంటా!

ఆరుబయట వంట .. వానోస్తే తంటా!

వంట గదుల్లేక విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం
క్లాస్‌రూంలు, వరండాలు, చెట్ల కిందే వంటావార్పు
►  వర్షమొస్తే చాలా పాఠశాలల్లో భోజనం బంద్‌


సర్కారీ బడుల్లో మధ్యాహ్న భోజనం పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షమొస్తే చాలు వేల పాఠశాలల్లో పిల్లలకు భోజనం వండి పెట్టలేని దుస్థితి నెలకొంది. కిచెన్‌ షెడ్లు లేకపోవడంతో ఆ స్కూళ్లలోని పిల్లలకు అర్ధాకలి తప్పడం లేదు. రాష్ట్రంలోని 25,531 పాఠశాలల్లో దాదాపు 8 వేల స్కూళ్లలో ఇప్పటికీ కిచెన్‌ షెడ్లు లేవు. వానొస్తే చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల పాలిథిన్‌ కవర్లు అడ్డుపెట్టి వంటలు చేస్తున్నారు. షెడ్లు లేని కారణంగా ఈ ఒక్క నెలలోనే 585 స్కూళ్లలో ఐదు రోజులపాటు పొయ్యి వెలగలేదు. ఈ లెక్కలు ఏదో ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో తేలినవి కావు. సాక్షాత్తూ విద్యాశాఖ సేకరించిన సమాచారం. ఇవే వివరాలను కేంద్రానికి సైతం తెలియజేసింది!      – సాక్షి, హైదరాబాద్‌

కిచెన్‌ లేదు.. మెనూ లేదు..
మధ్యాహ్న భోజనం.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పగటి పూట భోజనం అందించడం ద్వారా వారు రెగ్యులర్‌గా బడికి వచ్చేలా చూడడం, డ్రాపౌట్స్‌ను తగ్గించే ఉద్దేశంతో తెచ్చిన పథకమిది. క్షేత్రస్థాయిలో ఈ పథకానికి కిచెన్‌ షెడ్ల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. షెడ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తోంది. అంతేకాదు షెడ్లు లేకపోవడంతో ఆహార పదార్థాల్లో చెత్తా చెదారం పడుతుండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న సందర్భాలూ ఉన్నాయి.

వర్షాల కారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెట్టని స్కూళ్లు అనేకం ఉన్నాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఆగస్టులో ఇప్పటివరకు ఐదు రోజుల పాటు విద్యార్థులకు భోజనం పెట్టని స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా 585 ఉంటే అందులో నల్లగొండకు చెందినవి 91 పాఠశాలలు ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 67, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 53 ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన మెనూ అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. చాలా స్కూళ్లలో సాంబారు, అన్నం మాత్రమే ఇస్తున్నారు.

షెడ్లు లేక తిప్పలెన్నో.. 
362 స్కూళ్లకు వంట  గదుల్లేవు. వీటిలో 55,790 మంది విద్యార్థులు చదువుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం ఉప్పర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో వంట గదిలేదు. వర్షమొస్తే అంతే సంగతులు. మహబూబాబాద్‌ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 635 మంది విద్యార్థులున్నా మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు వంటగది లేదు. ఆరు బయటే వండుతున్నారు. వానొస్తే ఫ్లెక్సీలు, గాలికి రేకులు అడ్డుగా పెడుతున్నారు. మిర్యాలగూడలోని బకల్‌వాడ ఉన్నత పాఠశాలలో 984 మంది విద్యార్థులు ఉన్నారు. వంటగది లేక ఆరుబయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే వరండాలో వండుతున్నారు. దాంతో తరగతి గదుల్లోకి పొగ వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

కవర్లు, ఫ్లెక్సీలు అడ్డు పెట్టి వంట చేస్తున్నాం...
12 ఏళ్లుగా ఆరు వందల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్నాం. కిచెన్‌ షెడ్‌ లేకుండా వంట చేయాలంటే మా గోస కాదు. ఎండకు ఎండుతూ, వాన కు తడుస్తూ వంట చేస్తున్నాం. గాలికి కవర్లు, ఫ్లెక్సీలు అడ్డుగా పెడుతున్నాం. వర్షానికి వంట సామగ్రి తడిసిపోతోంది.     – నిమ్మల మాధవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మహబూబాబాద్‌

అన్నంలో పురుగులు వస్తున్నాయి...
వంటలను చెట్ల కింద వండుతున్నారు. వర్షాలు వచ్చిన సమయంలో అన్నంలో చెట్ల పైనుంచి పురుగులు పడుతున్నాయి. అన్నం తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నాం. చారు కూడా నీళ్లలాగా ఉంటోంది.    
– నాగలక్ష్మి, 10వ తరగతి, బకల్‌వాడీ స్కూల్, మిర్యాలగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement