సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న జిల్లా నేతలను సమన్వయపరిచే వారు లేకపోవడం... గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడంతో అసలు జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే ముగిసిపోతుందా అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ఆ పార్టీ కేడర్‌లోనూ జరుగుతోంది. ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు కనీసం జడ్పీ రాజకీయం కూడా చేయలేని స్థితికి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘చేతి’లో పదిమంది జడ్పీటీసీలున్నా... మరో పదిమంది మద్దతు తీసుకునేందుకు కనీస ప్రయత్నం చేసే నాయకుడు ఆ పార్టీలో లేకపోవడంతో జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో తాము చేష్టలుడిగి చూడాల్సిందేనా అనే ఆవేదన పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. టీడీపీలోని గ్రూపు తగాదాలు, ఇతర పార్టీల నుంచి ఉన్న సానుకూల అవకాశాలను ఒడిసిపట్టుకునే నాయకత్వం లేకపోవడంతో పార్టీ నుంచి గెలిచిన పదిమంది జడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతారనే చర్చ జరుగుతోంది.
వేదికపైకి తెచ్చే వారేరి?
జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసలు ఎలాంటి చలనం కనిపించడం లేదు. నోటిఫికేషన్ వెలువడిన మర్నాడే టీడీపీ జడ్పీటీసీలు 19 మంది ఒకేసారి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి క్యాంపునకు కూడా వెళ్లిపోయారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ఇంతవరకు గెలిచిన 10 మందిని ఒక వేదికపైకి తీసుకువచ్చే నాయకుడే లేకుండా పోయారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో పాటు ఆ వర్గం నుంచి కేవలం ఒకే మహిళ గెలుపొందడం, ఆమె కూడా జిల్లాలోని ప్రధాన నాయకుల ఆశీస్సులున్న వ్యక్తి కాకపోవడం, కాంగ్రెస్ ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జడ్పీ పీఠం గురించి ఆలోచించే వారే లేరని పార్టీ కేడర్ అంటోంది. ‘ఎలాగూ టీడీపీకి ఒక్కరు కలిస్తే వారిదే పీఠం. మాకు పది మంది కావాలి. చాన్స్ వారికే ఉంది కాబట్టి మేం ప్రయత్నం చేసి ఏం లాభం.’ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నా.. టీడీపీతో కలిసే ఆ ఒక్కరు కాంగ్రెస్ వారే అయితే పరిస్థితి ఏంటనేది ప్రశ్న.
కనీసం పదిమందిని ఒక్కచోట కూర్చోపెట్టి, పది మంది పార్టీ నాయకులు కూర్చుని జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో తాము ఎలాంటి వ్యూహం అనుసరిం చాలి... ఎలా వెళితే బాగుంటుంది అనే అంశంపై చర్చకు కూడా ప్రయత్నించకపోవడం గమనా ర్హం. ఈ పరిస్థితుల్లో నాయకులు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఇతర పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని, తమకు పీఠం దక్కకపోయినా, తమ పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మద్దతుతో ఇతర పార్టీలు ఆ పీఠంపై కూర్చునే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ ముఖ్య నేతలపై ఉందని పార్టీ కార్యకర్తలంటున్నారు.
ఎవరికి వారే..
జిల్లా పార్టీకి అధ్యక్షుడు లేకపోవడం... అసలు అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి సారించకపోవడం లాంటి కారణాలను పక్కనపెడితే జిల్లా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికను పట్టించుకోవడం లేదని, జిల్లా పార్టీలో ఉన్న గ్రూపుల నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడే వ్యూహాలకు పదనుపెట్టి కార్యరంగంలో దూకాల్సిన నాయకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం తగదనే భావన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్న ‘ఆ నలుగురు’ కాకుంటే ఇంకెవరు పట్టించుకుంటారని కేడర్ ప్రశ్నిస్తోంది. అయితే, చైర్‌పర్సన్ ఎన్నిక జోలికి వెళితే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుందనే భయంతో పాటు అసలు ముందే బాధ్యత తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 7న జరిగే జిల్లా పరిషత్ పాలకవర్గం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందో, ఆ నలుగురు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.
అభయ‘హస్తం’ ఇచ్చేవారేరి?
Published Mon, Aug 4 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement